Sunday, December 12, 2021

హనుమంతుడి రాముడు -సరదాగా -కర్లపాలెం హనుమంతరావు

 


ఇంటింటికో రామాయణం. రాముడంతటి దేవుడు తెలుగువాడికి మరోడు లేడు. పుట్టిందిపేగుబంధం


- కర్లపాలెం హనుమంతరావు 


( ఈనాడు, సంపాదకీయం, 03 -08 - 2009 ) 


 అక్కడ అయోథ్యలోనే అయినా  జన్మదినం , పెళ్ళిరోజు క్రమం తప్పకుండా ఇక్కడే కదా  మహాఘనంగా జరుపుకునేది మనం!

 

రామమందిరం లేని ఊళ్ళు చాలా తక్కువ. రామ్ నగర్ లు, రామన్నపేటలు, రామాయంపేటలు, రాములవారి వీధులు.. లేని ఊళ్లూ తెలుగునాట చాలా అరుదు. భద్రాచలం కోసం తెలంగాణా, సీమాంధ్రాలు మొన్నటి విభజనలో బాగా కొట్లాడుకున్న విషయం గుర్తుకొచ్చిందా! దక్షిణాదికి ఏడుకొండలవాడు ఎట్లాగో.. ఉత్తరాదికి ఈ శ్రీరామచంద్రమూర్తులవారు అట్లాగా. అన్నట్లు రామనామంతో పొత్తు ఉండబట్టే ఇద్దరు చంద్రులూ ముఖ్యమంత్రులయారన్న వాదనా కద్దు.

 

చంద్రబాబుకి మామగారు తారక రాముడైతే.. చంద్రశేఖర్రావుకి సాక్షాత్తు కన్నబిడ్డే మరో తారకరాముడు. రామ్మోహన రావు, రామచంద్రమూర్తి, రామన్నపంతులు, రామిరెడ్డి, రామానాయుడు, రామోజీరావు, రామశర్మ, రామశాస్త్రి.. ఇట్లా రామ నామం కోటి రూపాలల్లో  దర్శనమిస్తుంది తెలుగునాట. రామలక్ష్ములు, రామ సీతలు, సీతారామమ్మలు.. ఇలా స్త్రీ పక్షపాతం కూడా లేదు రామనామానికి. రామలక్ష్మణులని ఆదర్శసోదరులకు ప్రతీకలుగా భావిస్తాం. సీతా రాముల దాంపత్యం సర్వకాలాల్లో దంపతులకు శిరోధార్యం. రాముడు వంటి భర్త కావాలని తపించని పడతులుండరు. ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్యగా జీవితమంతా నిష్ఠగా గడిపిన ఆదర్శ పురుషుడు రామచంద్రుడు.

 

రాముడు అంటే మంచి బాలుడు కింద లెక. రాముడు వంటి బిడ్డ కావాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. రాముడు మర్యాద పురుషోత్తముడుగా  మహా ప్రసిద్ధి. మాట తూలడు. మృదుస్వభావి. ఆడిన మాట తప్పి ఎరుగడు. పితృవాక్య పరిపాలన అంటే ముందుగా గుర్తుకువచ్చేది రామచంద్ర మూర్తే. ఒక్క చెడుతో తప్ప ఎవరితో ఆమూర్తికి వైరం లేదు. రావణాసురుణ్నైనా తన భార్యను అపహరించినందుకూ, తప్పు తెలుసుకుని తిరిగి అప్పగించనందుకు శిక్షించక తప్పింది కాదు.

 

 స్నేహితుడు అంటే రామచంద్రమూర్తే. స్వలాభంకోసం సుగ్రీవుడితో స్నేహం చేసాడని ఏ గిట్టని  రంగనాయకమ్మగారో దుష్ప్రచారం చేస్తే చేసివుండవచ్చు గాక.. తన లాగే ప్రేమించిన భార్యను కోల్పోయిన అభాగ్యుడు అయినందుకు.. దానిక్కారణమైన వాలిని ఆయన చెట్టు చాటునుంచి మట్టు పెట్టవ. దుష్టత్వాన్ని తునుమాడటానికి తాను ధర్నాన్నైనా లక్ష్య పెట్టనని రావణాసురుడి లాంటి దురహంకారులకు సందేశం పంపించడానికైనా ఆ పని ఆయన చేసి ఉండవచ్చు. రావణ సంహారానికి ఆయన ఆయన సోదరుణ్ని చేరదీసి ప్రాణ రహస్యాన్ని రాబట్టడం ఇక్కడ గమనించాలి. రావణ సంహరణ అంటే దుష్ట రక్షణ అనే గదా అర్థం! లక్ష్యం మంచిదైతే లక్షణం విషయంలో సర్దుబాటు చేసుకున్నా తప్పు లేదని రామచంద్రుడు  చెప్పినట్లా? మరి రామ భక్తుడు మహాత్మ గాంధీ మాత్రం లక్ష్యం..లక్షణం రెండూ ఉదాత్తంగా ఉండి తీరాలని ఎందుకు పట్టుబట్టినట్లే? భక్తులంతా ఆరాధ్య దైవాల బాటలోనే సాగాలని రూలేమీ లేదుగా!  కంచర్ల గోపన్న ప్రజాధనంతో సీతారాములకు గుడి కట్టించాడు. ఆ నేరానికి కారాగార శిక్షా అనుభవించాడు. భక్తుల చేత ఎంతగా పొగిడించుకున్నాడో అంతగా తిట్టించుకున్న దేవుడూ రాముడే.'ఎవరబ్బ సొమ్మనీ కులుకుచున్నావూ రామచంద్రా!' అంటూ ఆ రామదాసు చేతే శాపనార్థాలు పెట్టించుకోలేదూ పాపం రామయ్య. ఆయనే మన్నా తనకు ఎలాగైనా గుడి కట్టించి తీరాలని పట్టు బట్టాడా?ఇప్పుడు అయోధ్య విషయంలోనూ అదే రభస. అక్కడ ఇదివరకు మసీదే ఉందో.. రామాలయమే ఉందో..  చరిత్రే సరిగ్గా తేల్చని విషయాన్ని పట్టుకుని ఎంతెంత రాజకీయం జరిగింది! ఇప్పుడు భద్రాచలంలో జరుగుతున్నదీ అదే. రామచంద్ర మూర్తి మంత్రపుష్పం విషయంలో విజయనగరం సాధువులు కొత్తగా లేవదీసిన పేచీలను ఏమనాలి? మండలాల వంకతో.. కోదండ రాముడి కొండను విభజన సమయంలో  వివాదం చేసారు! సాంఘికంగానే కాదు.. రాజకీయంగానే కాదు.. ఐహికంగానే కాదు ..పారలౌకికంగానే కాదు.. అన్నింటా భారత దేశంలో రామచంద్ర మూర్తిది ఒక ప్రత్యేక స్థానం. కృష్ణ పరమాత్ముడైనా రామచంద్ర మూర్తి తరువాతే. 'ఇంట్లో రామయ్య..వీధిలో కృష్ణయ్య' అని సినిమా కూడా వచ్చి .సినిమాల వాళ్ళకైతే రాముడు ఎప్పుడూ ఒక బ్లాక్ బస్టర్ సూత్రమే. లవకుశ రంగుల సినిమాగా వచ్చి కలెక్షన్ల రికార్డులు సృష్టించింది. రామాయణం థీమ్ మీద ఎన్నెన్ని సినిమాలు.. ఎన్నెన్ని భాషల్లో వచ్చాయో!అన్నీ దాదాపు పెద్ద హిట్లే. రామయ్యను నమ్ముకుంటే కష్టం గట్టెక్కుతుందని తెలుగు వాళ్లకి ఓ నమ్మకం. వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించి  ఆదికవి అయాడు. భవభూతి ఉత్తర రామాయణం ముట్టుకుని జన్మ సార్థకం చేసుకున్నాడు. త్యాగయ్య రామ చంద్రమూర్తిని తన ఆత్మగా చెప్పుకున్నాడు. రంగనాథ రామాయణంనుంచి.. రంగనాయకమ్మ రామాయణం దాకా ఎన్నెన్ని రామాయణాలో! విశ్వసాహిత్యంలోనే రామాయణం రచన అత్యధికంగా రాయబడ్డ కావ్యం కింద చరిత్ర నమోదు చేసుకుంది. రాముడు ఒక్క భారతీయులకే కాదు. మలేసియా.. కంబోడియా.. బర్మా(ఇప్పటి మయన్మార్), చైనా, జపాన్ వగైరా దేశాల్లో ఏదో ఓ రూపంలో కనిపిస్తాడు. 'రాముడికి సీతేమవుతుంది?' అని తాపీ ధర్మారావు గారు ఓ వివాదస్పద రచన చేసారు. 'శంభూకుణ్ని దుర్మార్గంగా మట్టుబెట్టాడు రాముడు' అని మన కవిరాజుగారు ద్వజమెత్తిన సంగతీ మర్చిపోరాదు. ఆయన గారి అసలు పేరులోనే (రామస్వామి చౌదరి)  ఆ రాముడు ఉండటం అదో తమాషా.  తమిళనాట రాముడికి కంబన్న హారతులు బడితే..  కరుణానిధిగారి డియెంకె తూర్పార పడుతుంటుంది. రాముడు రావణాసురుణ్ణి సంహరించడానికి  కోతి మూక చేత కట్టించినట్లు చెప్పుకునే వారధి శ్రీలంకకి.. రామేశ్వరానికి మధ్య ఉన్నదేనని  ఒక వర్గం.. కాదు అది అసలు వంతెనే కాదు.. రాముడు కట్టించింది అనటమే కట్టుకథ అని  సందు దొరికినప్పుడల్లా యాగీ చేయడం తమిళనాట రాజకీయ పార్టీలకు మామూలే. రావణాసురుడికి దక్షిణాదినే ఎక్కడో ఓ గుడి కూడా ఉన్నట్లు చెపుతారు. 'రావణాసురుడు ఒక్క స్త్రీల విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ అఖండుడు' అని కొంత మంది వాదన. ఆయన గారు ఏలిన లంకాపురి బంగారు నగరి. కుబేరుడి నగరాన్ని స్వాధీనం చేసుకున్న బలశాలి రావణాసురుడు. రానణాసురుడు అనుసరించింది రాక్షస సంస్కృతి, సంప్రదాయలను. మనుషుల ఆలోచనలు దేవతలకు దగ్గరగా ఉంటాయి కనక రావణాసురుడు మన కంటికి పరమ దుర్మార్గుడి కింద లెక్క. ఉత్తరాది వారి సంప్రదాయం ఆర్య సంస్కృతికి అనుకూలంగా  ఉంటుంది కాబట్టి అక్కడ రామలీలలు. రావణ సంహారాలు. తెలుగువాళ్ళది అటూ ఇటూ కాని ఆచారాలు కాబట్టి రాముణ్ణి ఆరాధ్య దేవుడు చేసుకోవడం .. శ్రీరామ నవమిని పెద్ద పండుగ్గా చేసుకోవడం. తెలుగు శుభలేఖలమీద కచ్చితంగా మనకు 'శ్రీరామ చంద్రః శ్రిత పారిజాతః సమస్త కళ్యాణ గుణాభి రామః/సీతా ముఖాంబోరుహ చంచరీకో నిరంతరం మంగళ మాత నోతు' అన్న శ్లోకం కనిపిస్తుంది.

సీతా లక్ష్మణ భరత శతుఘ్న ఆంజనేయాది సమేతంగా కొలువై ఉన్న రామచంద్ర మూర్తి   రవి వర్మ చిత్రం తెలుగువాళ్ల సకుటుంబ సంప్రదాయానికి ఓ దైవీక ప్రతీక.

స్వయంగా దుష్ట సంహరణ సమర్థుడై ఉండీ బాల రామచంద్రుడి సాయం అందుకునాడు విశ్వామిత్రుడు. స్వయంగా బుద్ధిశాలి. .ధీశాలి ఐనా రామచంద్రుణ్ని గుండెల్లో దాచుకున్నాడు ఆంజనేయుడు. రాజుల అంతిమ లక్ష్యమైన రాజ్యాధికారం ఆయాచితంగా అంది వచ్చినా సోదరుడి పాదుకులను పెట్టి మాత్రమే రాజ్యపాలనకు సిద్ద్జపడ్డాడు భరతుడు. తనకన్నా  బలవంతుడైన వాలితో విరోధం తెచుకున్న సుగ్రీవుడు పాదరక్షలు సైతం లేని భార్యా వియోగి కేవలం సోదర సమేతంగా వచ్చి స్నేహ హస్తం అందిస్తే ఆ రామ్మూర్తిలో ఏమి చూసి ముందు కడుగు వేశాడో?  ఒక పట్టాన ఎదుటి వారి ఆధిక్యాన్ని ఒప్పుకోని రావణ బ్రహ్మ రాముణ్ణి యుద్ధక్షేత్రంలో మొదటి సారి చూసి నప్పుడు ప్రశంచించకుండా ఉండ లేక పోయాడు. స్వయంగా చూడక పోయినా మండోదరి రామచంద్ర మూర్తి పరాక్రమాన్ని కీర్తిస్తుంది. గుహుడునుంచి శబరి దాకా ఎవరూ ఏ ప్రత్యుపకారం ఆశించకుండానే రామ సేవకు ఉత్సుకత చూపించారు. నాతిని బండరాతి కన్నా హీనంగా చూసింది రావణాసురుడైతే రాతిని  నాతిగా ఆదరించింది శ్రీ రామచంద్ర మూర్తి. అదే రాముడు మరి సొంత భార్య   విషయంలో  అంత   కఠినంగా ఎందుకు  ఉండవలసి వచ్చిందో! రాజధర్మం అంటే  ప్రజాభీష్టానికి  అనుకూలంగా సాగడమేనని  లోకానిని  చాటడానికా? రాముడు అధర్మ చక్రవర్తే ఐతే వాల్మీకి మహర్షి అంతటి జ్ఞాని  ఆ మహానుభావుడిని కథానాయకుడిగా చేసి మహాకావ్య రచనకు పూనుకుంటాడా? రామాయణం ప్రథమ కాండలో నారదుల వారి నోట రామచంద్రమూర్తివిగా చెప్పుకొచ్చిన  పదహారు కళలు అన్ని కాలాల్లో అందరికీ పరమాదర్శనీయ మైనవి. కాబట్టే రామాయణం ఇన్ని వేల సంవత్సరాలు గడిచి ఇంత నాగరీకం అభివృద్ది చెందినా అన్ని సంస్కృతులనూ అన్ని వర్గాలను ఇంకా  అపరిమితంగా  ప్రభావితం చేస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణం భారతీయుల  ఆత్మ.

'రామా అంటే బూతు మాట ఐనట్లు' అంటూ అభిశంసన సమయంలో సైతం ఆ రామ నామ స్మరణను మనం మర్చిపోలేక పోతున్నాం.  రామాయణం పట్టు మన భారతీయులమీద ఎంత బలంగా ఉందో అదే చెబుతోంది.

భారతం మాత్రం! 'రామాయణం రంకు..భారతం బొంకు' అంటూ ఓ వంక  వంక పెడుతూనే వాటిని వదలి పెట్టకుండా చదువుకుంటుంటాం. కావ్యాలుగా రాసుకుంటుంటాం. నాటకాలుగా మలిచి చూస్తుంటాం. పాటల్లోకి మార్చి పాడుకుంటుంటాం. కీర్తనలుగా అల్లుకుని కచేరీలు చేస్తుంటాం. వ్రత కథలుగా చెప్పుకుని పునీతులయినట్లుగా భావిస్తుంటాం. శతకాల్లోకి మార్చుకుని సంఘానికి నీతులుగా బోధించుకుంటుంటాం. శకుని జిత్తులకు,  దుర్యోధనుడు దురభిమానానికి, ధృతరాష్ట్రుడు గుడ్డి ప్రేమకి, ధర్మరాజు గడుసుదనానికి, ఉత్తర కుమారుడు డాంబికాలనకి, భీష్ముడు పెద్దరికానికి, ద్రోణుడు గురుత్వానికి, కుచేలుడు బీదరికానికి, భీముడు బండ బలానికి, బకాసురుడు తిండియావకి, కుంభకర్ణుడు మొద్దు నిద్రకు, దుశ్శాసనుడు.. కీచకుడు కాముకత్వానికి, బృహన్నల పేడితనానికి..ఇలా  నిత్య జీవితంలో ప్రతి లక్షణానికి పురాణాల పాత్రలే మనకి తిరుగులేని సంకేతాలయి పోయాయి. 'నరకాసుర వధ' చేస్తానంటుంది ఒక పార్టీ. రావణ కాష్టంలా తగలబడుతుంది దేశం అంటుంది ఇంకో పార్టీ. నేతలను ఐతిహాసిక పాత్రలతో పోల్చి  ఎద్దేవా చేయడం మిగతా దేశాల్లో కన్నా  గా మన దగ్గరే  చాలా ఎక్కువ.

 

'ఏం భాగోతాలు ఆడుతున్నాడండీ!' అంటే చాలు ఎదుటి వాడివి ఎన్ని టక్కరి వేషాలో ఒక్క ముక్కలో చెప్పేసినట్లు. రెండో కృష్ణుడు.. భామా కలాపం.. సత్య హరిశ్చంద్రుడు, నక్షత్రకుడు, దూర్వాస మహాముని, రాధా కృష్ణులు, రాస లీలలు, రామలక్ష్మణులు, సుందోపసుందులు, జయవిజయులు, నరసింహావతారం, బలి చక్రవర్తి..ఇలా ఎన్నైనా ఉదాహరణలుగా  చెప్పుకోవచ్చు. ఆంజనేయుడి తోకంత ఉంటుంది. శుక్రాచార్యుడు, వామనావతారం, శూర్పణఖ.. ఇలా మన మాటల్లో మనం అనుకుంటున్నట్లే వేరే సంప్రదాయాల్లోనూ అనుకునే ఆచారం ఉండే ఉంటుంది.  కురుక్షేత్రం అంటే మనకు ఒక యుద్ధ వాతావరణం. గీతా బోధన అంటే  కౌన్సిలింగు.భగవద్గీత అంటే తు.చ తప్పకుండా పాటించడం. బైబిలు. కొరాను . సైతాన్.. ఇలా పరభాషా సంస్కృతుల్లోనూ ఏన్నో ఉండే ఉంటాయి.

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్,యూ.ఎస్.ఎ

13 -1ఒ -2021

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...