Thursday, December 9, 2021

ఈనాడు - సంపాదకీయం జీవన వేదం రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - 06 - 09 - 2009 న ప్రచురితం )

 ఈనాడు - సంపాదకీయం 

జీవన వేదం

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 06 - 09 - 2009 న ప్రచురితం ) 


మనం ఎంతగానో ప్రేమించేవారిని ఆ దేవుడు మన దగ్గర్నుంచి తీసుకుపోతే... ఆ మోసానికి విరుగుడేమిటో తెలుసా! 'మనం ప్రేమించేవారు ప్రేమించినవన్నీ మనమూ ప్రేమిస్తూ ఉండటమే' అంటాడు ఆస్కార్ వైల్డ్. భారతంలో యక్షుడు ప్రపంచంలో కెల్లా వింత ఏది?' అనడిగితే 'రేపు పోయేవాడు ఇవాళ పోయేవాడిని గురించి ఏడుస్తూ కూర్చోవడమే!' అంటాడు ధర్మరాజు. నిజం కదా! అసలు 'జీవితం ఒక నాటకం' అని షేక్స్పియర్ లాగా  మనమూ అనుకోగలిగితే పుట్టటం, గిట్టటమనేవి దేవుడు చేసే ప్రక టనలు అని ఇట్టే అర్థమైపోతుంది. ఆవేదన సద్దుమణుగుతుంది. విశ్వవిజేతగా మారాలనుకున్న అలెగ్జాండర్ చలిజ్వరంతో 'హతీతో క్రతిస్తో' అంటూ ఖాళీ చేతులు చూపించి వెళ్లిపోయాడు! ఎలా పోయారన్నది కాదు లెక్క . ఎలా బతికారన్నది ముఖ్యం. తనకోసం అమృతం తాగిన ఇంద్రుడికి, లోకంకోసం విషాన్ని మింగిన శివుడికున్న విలువుందా? మిన్నాగులాగా కలకాలం బతికేకన్నా మిణుగురులాగా క్షణకాలం మెరిసినా మిన్నే! అసలు మృత్యువనేది ఒక్క దుఃఖాన్ని తప్ప మరేదీ దక్కనివ్వదా?! రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఓ జర్మనీ చెరసాలలో ఖైదీలు కిక్కిరిసిపోయి ఉన్నారు. ఇంకొక్క కొత్తబందీ వచ్చి చేరినా అంగుళం స్థలం కూడా లేనంత ఇబ్బందిగా ఉంది పరిస్థితి. ఖైదీల సంఖ్య తగ్గించేందుకు చెరసాల అధికారులు ఓ పథకం పన్నారు. ప్రతి బందీకి ఒక అంకె ఇచ్చారు. రోజూ కొన్ని అంకెలు చీటీలు వేసి తీయడం. ఆ అంకె వాడిని కాల్చిపారేయడం! ఓ రోజు అలాంటి అంకె వచ్చిన ఓ ఖైదీ ఏడుస్తూ కూర్చుని ఉంటే పక్కనే ఉన్న మరో ఖైదీ- ఏడవకు ... ఇంకా ఇక్కడ బందీగా నీకంతగా బతకాలనుంటే చీటీ నాకు ఇవ్వు' అని తాను ఆనందంగా వెళ్ళి తుపాకీ గుండుకు బలైపోయాడు! అతని ఆనందం- అరువు ప్రాణాలమీద బతికే ఆ ఖైదీకి ఉంటుందా ?


'మృత్యువు నా వాకిట్లో నిలబడితే వట్టి చేతులతో పంపను' అంటారు గీతాంజలిలో టాగోర్. 'జాతస్య: మరణం ధ్రువమ్' అంటుంది గీత. కాలప్రవాహానికెదురు ఈదటం ఎవరి తరమూ కాదు. అందుకే మృత్యువును మన పురాణేతిహాసాలు 'కాలధర్మం' గా వర్ణించాయి. భూవిం పై  కలకాలం సుఖంగా బతకాలని ఎవరి కుండదు? నిజంగా చిరంజీవిగా ఉండాలంటే తుమ్మి చిరంజీవ అనిపించుకోవడం కాదు. చిరకాలం జనహృదయాలలో  సజీవంగా ఉండే సత్కార్యాలు చేయడం అవసరం . మొక్కుబడిగా కీర్తిశేషులనిపించుకోవడం  కాదు. మొక్కి మరీ 'కీర్తి'ని గుర్తుచేసుకునే ఘనకార్యాలు చేయగలగాలి. మనస్సులకు దగ్గరైనవారు దూరమైనారంటే ఒక పట్టాన ఒప్పుకోలేని పిచ్చి ప్రేమభ్రమలు మనిషి పుట్టిననాటినుంచే వెంట వస్తున్నాయి. రోమన్లు చనిపోయినవాళ్ల వేళ్లు కోసి, రక్తం గడ్డకట్టి ఉంటే తప్ప ఆ వాస్తవాన్ని అంగీకరించేవాళ్ళు కాదు. గ్రీకులు చనిపోయిన మనిషి తిరిగి వస్తాడేమోనని మూడురోజుల పాటు భద్రం చేసేవారు. ఎడ్గార్ ఎలాన్ పో తన చిన్నకథా సంకలనం 'మెక్బరి'లో శవపేటిక లోపల మీటలు ఉండే విధానాన్ని సూచించాడు. ఖననమైన తరవాత మృతుడికి ప్రాణంవస్తే ఆ మీట నొక్కి బైటవాళ్ళకు చెప్పే ఏర్పాటు అది! హిందూ ధర్మంలో దింపుడు  కళ్లెం అవారం వెనక ఉన్న  రహస్యం ఈ బతుకుమీద ఆశే. 


శాస్త్రవిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఈ తరహా  ఆ మాటలు వింటే నవ్వులాటగా ఉండవచ్చు . కానీ, నిజానికి గుండె చప్పుడు ఆగిపోయిన కొన్ని క్షణాల వరకు  ఇసిజిని నమోదు చేయవచ్చని ఇప్పుడు వైద్యశాస్త్రం కూడా ఒప్పుకొంటోంది. పైలోకార్పైన్  అనే మందును మృతుడి కంటిలో వేస్తే మూడుగంటల అనంతరం  కూడా కంటిపాప సంకోచిస్తుంది. అసలు మరణమనేది హఠాత్తుగా జరిగే విషాదంకాదు. అదో క్రమంలో భౌతిక దేహంలో జరిగే ప్రక్రియ - అంటుంది మరణశాస్త్రం(థాంటాలజీ). మతాలన్నీ మర ణాన్ని మనకంటికి కనిపించని ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవడంగా అభివర్ణించినా- విజ్ఞానశాస్త్రం మాత్రం విశ్లేషించటానికి వీలైన ప్రయోగాలు విజయవంతమైనదాకా అది మనిషికి, మన సుకు సంబంధించి ఒక అత్యంత భావోద్వేగ సంబంధమైన విషాదంగా మాత్రమే గుర్తిస్తుంది. మనకు మరింత దగ్గరగా వచ్చిన మనిషి హఠాత్తుగా ఇంకెప్పటికీ తిరిగిరాని లోకాలకు ఎగిరిపోయాడని వింటే మనస్సు విలవిలలాడకుండా ఎలా ఉంటుంది! అందులోనూ పెద్దమనసున్న పెద్దమనిషి మరణమంటే మామూలు జనానికి పత్రికల్లో నల్లరంగు పూసుకొని వచ్చే పతాక శీర్షికో, టీవీ ప్రసారాలలో  ఆపకుండా చూపించే  రియాల్టీ ప్రదర్శనోకాదు గదా! ఆట ముగిస్తే రాజైనా, బంటైనా ఒకే పెట్టెలోకి పోతారన్న మాట నిజమే కావచ్చు. . కానీ జనం తరపున ఆడే ఆట ముగించకుండానే మధ్యలో వదిలి ఎవరైనా అలా చిరునవ్వులు పంచుకుంటో  పైలోకాలకు వెళ్ళిపోవటం మాత్రం కచ్చితంగా తొండే! ' బతుకు .. బతకనివ్వు'  అన్నది మానవ పరిణామ క్రమం తరంతరంగా నిరం తరంగా వినిపిస్తున్న పాఠం. గుండె దిటవుతో మృత్యుఘోషను ధిక్కరించి నిబ్బరంగా ముందడుగేస్తేనే నవోదయం!


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 06 - 09 - 2009 న ప్రచురితం ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...