Tuesday, December 7, 2021

ఆంధ్రుల ప్రాచీనత - కర్లపాలెం హనుమంతరావు

 ఆంధ్రుల ప్రాచీనత 

-  కర్లపాలెం హనుమంతరావు 


భారతదేశంలోని పురాతన జాతులలో ఆంధ్రజాతి ఒకటి..


భారత రామాయణాలలో, ఇతిహాసాలలో, పురాణాలలో జాతక కథలలో ఆంధ్రుల ప్రస్తావన కనిపిస్తుంది. 


కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్రులు కౌరువుల తరుఫున్ పోరాడారని ఒక విశ్వాసం. 


శ్రీకృష్ణుడు మధురానగరం వచ్చినపుడు అతని పై యుద్ధానికి కంసుడు  ఉసిగొల్పినా చాణూరుడు ఆంధ్రజాతి వాడేనని కూడా మరో నమ్మిక . 


మరో కథలో విశ్వామిత్రుడు ఒకానొక నరమేధ యాగంలో  బలిపశువు శునశ్శేపుని విడిపించి తన  దత్తపుత్రునిగా  స్వీకరిస్తాడు. దానితో విభేదించిన  విశ్వామిత్రుని బిడ్డలు ఉత్తర భాగం నుంచి తూర్పు , దక్షిణ దిశలుగా వలస వచ్చేస్తారు. వారు ఆంధ్రులు అనే భావనా ఉంది. 


కురుక్షేత్ర  యుద్ధం కారణంగా కురు పాండవుల పక్షాన పోరాడిన అనేక తెగలునాశనమయ్యాయి. గంగా,యమునా తీరాలు పీనుగుల పెంటగా మారిన ఫలితంగా మిడతల దండుల దాడి అధికమయినట్లు, ఆ బాధనుండి విముక్తికై వివిధ దిక్కులకు తరలిపోయిన జాతులలో ఆంధ్రులలోని ఒక భాగం  దక్షిణాపథానికి  వచ్చి స్థిరపడ్డట్లు ఛాందోగ్యోపనిషత్  తెలియచేస్తుంది. 


పుండ్ర పుళింద, శబర మూతిలులతో కలిసి వింధ్యకు దక్షిణాన ఆంధ్రులు నివసించినట్లు ఐతరేయ బ్రాహ్మణం చెబుతోంది . 


ఆంధ్రులంతా మూకుమ్మడిగా ఒకేసారి తరలిపోలేదు. ఇది శతాబ్దాలపాటు తెగలు తెగలుగా జరిగిన  మహాప్రస్థానం. ఉన్న చోటును ఒక పట్టాన వదలలేని మనస్తత్వంతో ఆంధ్రులలోని కొంత భాగం క్రీ.పూ 700 నాటికి కూడా యమునా నదీ  తీరాన గల  సాళ్వీదేశంలోనే అవస్తలు పడుతూనే ఉండిపోయారని  ఆపస్తంబ  రుషిగాధ తెలియచేస్తున్నది. 


ఆంధ్రులలోని బ్రాహ్మణులు నేటికీ పాటిస్తున్న  వివాహ పద్ధతులు.. గృహ్య సిద్ధాంతాలు ఈ ఆపస్తంబ  రుషి నిర్దేశించినవే! 


ఒక్కో గణానికి నిర్దేశకుడుగా ఒక్కో రుపి ఉండేవాడు. సాళ్వీదేశంలో ఉన్నప్పుడే ఆపస్తంబుడు రచించిన గృహ్య సూత్రాలు ఆంధ్రులతో పాటే వింధ్య దక్షిణానికీ తరలివచ్చి ఇక్కడి తెగలలో కలగలసిపోయాయి. 


వింధ్య దక్షిణానికి కొన్ని ఆంధ్ర తెగలు వలస వస్తే ( నేటి హైదరాబాద్ .. పరిసర ప్రాంతాలు) , మరికొన్ని ఆంధ్ర తెగలు తూరు కనుమల గుండా ఒరిస్సా వైపు నుండి కిందకి దిగి కళింగదేశంలో స్థిరబడ్డాయి . 


సెరివణిజ జాతక కథ ఆంధ్రులు తేల్ నదీ తీరాన   అంధకవురం నిర్మించుకున్నట్లు వర్ణిస్తుంది.  జాతక కథల కాలం క్రీ.పూ 200-250 . 


తేల్ మహానదికి  ఉపనది తెలివాహ . మహానది ఉన్నది ఒరిస్సాలో.  కాబట్టే ఆంధ్రులలోని ఒక తెగ ఒరిస్సా మీద నుంచి వచ్చినట్లు  భావిస్తున్నది. 


ఒరిస్సా  పురాతనకాలంలో కళింగదేశం .. ఆ దేశవాసులు కాళింగులుగా సుప్రసిద్ధం. బహుశా ఈ కారణం చేత కూడా ఆంధ్రులలోని  ఆ వైపు తెగకు కాళింగులు అన్న పేరు స్థిరపడిఉండవచ్చు .  నేటికీ కాళింగులు అనే పదం  . . ఆంధ్రులు  అనే పదానికి పవ్యాయపదంగా వాడటం గమనీయం . 


- కర్లపాలెం హనుమంతరావు 

26-11-2021 

( ఆధారం: ఏటుకూరి బలరామమూర్తి గారి ' ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర - ఆంధ్రుల ప్రాచీనత ' ) 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...