Sunday, December 12, 2021

అశ్రు నీరాజనం- ఈనాడు సంపాదకీయం - ( సత్యసాయిబాబా నిర్యాణమయిన సందర్భంలో)

 


ఈనాడు సంపాదకీయం: 

అశ్రు నీరాజనం

( సత్యసాయిబాబా  నిర్యాణమయిన సందర్భంలో) 



. దైవం మానుష రూపేణ' అన్నది ఆర్యోక్తి. వేదనకు రోదనకు సాంత్వనగా, అంతకుమించి హృదయ తంత్రులను మెల్లగ మీటే అమృత స్పర్శగా సత్యసాయిని ఆరాధించే భక్తకోటి ఆయన్నే ప్రత్యక్షంగా కొలుస్తోంది. తమ దైవం అవతారం చాలించిందన్న దుర్వార్త  కోట్లాది భక్తజనుల గుండెల్లో విషాదాగ్నులు గుమ్మరించింది.  నేడు ప్రశాంతి నిలయం ఘనీభవించిన అశ్రుజలపాతం. విశ్వ జనీన ప్రేమకు తన పేరునే చిరునామాగా మార్చిన సత్యసాయి మరి లేరన్న పిడుగులాంటి వార్తే కోట్లాది భక్తజనులకు శరాఘాతం. ఎనిమిదిన్నర పదుల వయసులో తీవ్ర అస్వస్థతకు గురైన సత్యసాయి ఆరోగ్య పరిస్థితిపై కొంతకాలంగా తీవ్రాందోళన వ్యక్తమవుతోంది. సాయిబాబా ఆరోగ్యం విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు కొన్నా ళ్లుగా ఆందోళన వ్యక్తీకరిస్తున్నా పూర్తి స్వస్థతతో స్వామి తిరిగి దర్శ నం ఇస్తారన్న విశ్వాసాన్ని భక్తుల్లో పెంచిన భరోసా మరొకటుంది. అది సాక్షాత్తు సత్యసాయే ఇచ్చింది! దశాబ్దాల క్రితంనాటి ప్రవచనాల్లో తాను 2022 దాకా ఈ అవతారంలో కొనసాగి తన జీవన పరమా ర్థాన్ని సాధించగలనంటూ సత్యసాయి చెప్పిన మాటపైనే అశేష భక్తుల గురి. సత్యసాయి చూపుతున్న మహిమలు కేవలం కనికట్టే నని హేతువాదులు కొట్టిపారేస్తున్నా- ఆయన్ను అభిమానించే జన కోటి ఏటికేడు ఎల్లలు దాటి విస్తరిస్తూనే ఉంది. గత జన్మలో షిరిడీ సాయిగా కొలుపులందుకొన్న తాను, వచ్చే జన్మలో ప్రేమసాయిగా అవతరిస్తానని చెప్పే సత్యసాయి పథగమనాన్ని భక్తి ప్రపత్తులతో కొలిచే జనసంద్రం- పదేళ్లముందే ఏమిటీ ఉత్పాతమని కల్లోల తరంగితమవుతోంది! దేశాధినేతలూ భక్తి తత్పరతతో, ముకుళిత హస్తా లతో ప్రణమిల్లే సత్యసాయి- 1940లో తన జీవన లక్ష్యాన్ని నిర్దేశించు కొన్నప్పుడు కేవలం ఒక వ్యక్తి. అదే నేడు- విశ్వమానవ ప్రేమను ప్రబోధిస్తూ ధ్రువతారగా నింగికెగసిన అమేయశక్తి. ఆ మార్గం మలిగిపోదు. ఆ ప్రేమకు మరణం లేదు. 


'కులం ఒక్కటే- అది మానవత్వం... మతమూ ఒక్కటే- అది ప్రేమతత్వం... భాష ఒక్కటే- అది హృదయ సంబంధి... దేవుడూ ఒక్కడే- అతడు సర్వాంతర్యామి!'- ఇదీ సత్యసాయి బోధ . ఓ క్రైస్త వుడు మంచి క్రైస్తవుడిగా, ఓ ముస్లిం మంచి ముస్లిముగా ఎదగాలన్నదే బాబా ఉద్బోధ! సత్యసాయి ఎదుగుదలపై వాద వివాదాలు, తనకు తాను దైవత్వం ఆపాదించుకోవడంపై ఆస్తిక నాస్తిక సంవాదాలు ఎన్నయినా ఉండవచ్చుగాక- తన జీవితాన్నే పచ్చని చెట్టులా మలచి కోట్లమందికి సేదతీర్చిన ధన్యజీవి ఆయన.  సామాజిక అవ సరాల్ని సరిగా గుర్తించి తన ట్రస్టు ద్వారా తాడిత పీడిత శోషిత వర్గాల బతుకుల బాగుసేత లక్ష్యంగా ఆయన పరిశ్రమించిన తీరుకు కళ్లకు కడుతున్న పలు విధాల ప్రాజెక్టులే తిరుగులేని దాఖలా! ఆసుపత్రులు, విద్యాసంస్థలు, తాగునీటి వసతులు, అత్యంత ముఖ్యమైన  సాయి గ్రామాలు- వేల కోట్ల రూపాయలను వ్యయీకరించి ప్రణాళి కాబద్ధమైన కార్యాచరణతో పరమాద్భుతమని ప్రభుత్వాలే అచ్చెరువొం దే స్థాయిలో ఆయా ప్రాజెక్టుల్ని కట్టి, నిలబెట్టిన సత్యసాయి ఆదర్శం ఆయనలోని దైవత్వాన్నే భక్తులకు సాక్షాత్కరింపజేసింది. పదహారేళ్ల నాటి ముచ్చట అనంత దాహార్తితో డస్సిపోతున్న అనంతపురం జిల్లా వాసులకు ఏడాది వ్యవధిలోగా తాగునీటి సేవలందిస్తానని సత్య సాయి ప్రకటించినప్పుడు- అది అమల్లోకి వచ్చినప్పటి సంగతి కదా అని పెదవి విరిచినవారే అందరూ! 3200 కిలోమీటర్ల పైప్ లైన్లు , 2,350 ఓవర్ హెడ్ ట్యాంకులు, 136 ఉపరితల జలాశయాలు, 200 పంప్ హౌస్లు, 250 గొట్టపుబావులు- ఇంత భారీ పథకాన్ని పట్టుమని తొమ్మిదినెలల్లో సాకారం చేసి, దాహార్తి పీడితుల చేరువకు అమృత జలధారల్ని చేర్చిన సత్యసాయి భగీరథ యత్నంలో- మానవసేవే మాధవ సేవ అనే దైవత్వ భావన కనిపించక మానదు. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ వందలకోట్లు వెచ్చించి సత్యసాయి ఏర్పాటు చేసిన తాగునీటి పథకాలు- ఆ పుణ్యజీవి జీవన సార్ధక్యానికి మేలిగురుతులు!


'మీ గుండెల్లో ప్రేమజ్యోతులు వెలిగించడానికే వచ్చాను' అని ప్రవచించిన సత్యసాయి- భావితరంలో జ్ఞానజ్యోతుల ప్రకాశానికి చేసిన కృషి అమోఘం. 'విద్యకు పరమార్థం శీలసంపదే'నంటూ నమూనా విద్యావ్యవస్థను సత్యసాయి ఆవిష్కరించిన తీరు అభినందనీయం. ప్రాథమిక, మాధ్యమిక విద్యాలయాలనుంచి మూడు ప్రాంగణాల విశ్వవిద్యాలయందాకా చదువులమ్మ ఒడిని విస్తరించి, ధనిక-పేద వ్యత్యాసాలు లేకుండా , ఫీజుల ప్రస్తావనే రాకుండా వేలమందికి జ్ఞానభిక్ష ప్రసాదిస్తున్న సత్యసాయి- రేపటి పౌరుల భవితకు మేలుబాటలు పరచిన చిర యశస్వి! విదేశాలలో  రెండున్నర వేలకు పైగా సాయి కేంద్రాలుంటే, ఎన్నెన్నో పాఠశాలల్ని సత్యసాయి సంస్ధలే నడుపుతున్నాయి. యాభై ఏడేళ్ల క్రితం పుట్టపర్తిలో కేవలం రెండు పడకలతో ప్రారంభమైన సత్యసాయి వైద్యసేవలు నేడు లక్షలమందికి అత్యాధునిక వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ ప్రాణ జ్యో తులు మలిగిగుండా కాపాడుతున్నాయి. ఆసుపత్రిదాకా రాలేని గ్రామీణ షాంత రోగులకు  సంచార వైద్య సదుపాయాల్ని కల్పిం చడంలోనే సత్యసాయి ప్రేమతత్వం గుబాళిస్తోంది. అందరినీ ప్రేమించు- అందరికీ సేవలందించు' అన్న నినాదాన్ని జీవన విధానంగా మలచుకొని ఎల్లలెరుగని ప్రేమతత్వాన్ని జగమంతా పరచిన సత్యసాయి భౌతికంగా దూరం కావడం- గుండెల్ని పిండే విషాదం.  సాయిబాబా తల పెట్టిన ప్రతి సేవా ప్రాజెక్టులో ప్రేమాస్పద ముద్ర సత్యం; ఆ ప్రేమజీవి పెంచిన, కోట్లాడు భక్తులకు పంచిన సేవా స్ఫూర్తి అజరామరం. 


 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...