Saturday, December 4, 2021

ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం తెలుగువాడి తిండి యావ - రచన- కార్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - 07-06-2009 - ప్రచురితం )

 



 



తెలుగువారు పాలిటిక్సులో ఎంత చురుకో పాకశాస్త్రంలో అంతకన్నా చురుకు . తింటే గారెలే తినాలనే రకం . నలు డికి, భీముడికి నవగాయ వంటకాలు నేర్పి పెట్టింది మన తెలుగువాడే . పంచదార కన్న పాల మీగడ కన్న, జుంటు తేనియకున్న జున్నుముక్క కన్న, వెన్న కన్న, దోరమాగిన మామిడి కన్న తెలుగు తియ్యగా ఉంటుందన్న ఓ భాషాభిమాని- పాకాభిమా నాన్ని కూడా నిర్మొహమాటంగా చాటుకున్నాడు. గొల్లపిల్లల వేళ్లసందు మాగాయ పసందును రుచి చూపించినవాడు మన పోతన . కర్పూర విడెమును గురించి కవిసార్వభౌముడెప్పుడూ గొప్పగా చెప్పుకుంటుండేవాడు.


' భరత ఖండంబు చక్కని పాడియావు' అన్నది చిలకమర్తివారి ఊహ. 'చిక్కటి పాల మీద మిసమిసలాడే మీగడను పంచదారతో కలిపి తిన్నట్లు నీ అమ్మత రూపాన్ని ప్రేమతో దాస్యం దోసిలి బట్టి జుర్రుకుంటాన' ని  భద్రాచల రామదాసు ఆశపడ్డాడు. అలంకారాలలో ఉష్మాలంకారం.. పండగల్లో అట్లతదియ  మన ప్రత్యేకత. పిల్లాడు దుర్ముహూర్తంలో పుడితే మేనమామ మెడలో గారెల దండ వేస్తేనే అల్లుడిని చూడనిచ్చే ఆచారం మనది . బందరులడ్డు, కాకినాడ కాజా, హైదరాబాదు బిర్యాని అంటూ ఊరుకో పాకం పేరు పెట్టేసుకుని మురిసిపోతాం మనం . పిల్లలక్కూడా కాకి-రొట్టె కథే ముందు చెప్పటం అనాదిగా వస్తోన్న వరవడి . 'తిండి గలిగివే కండగలదోయ్. కండ గలవాడేను మనిషోయ్' అని గురజాడవారు కూడా తిండిగోలతోనే మొదలుపెడతారు. 'రొట్టెముక్కా అరటితొక్కా' .. దేన్నీ పక్కన పెట్టద్దంటాడు ఋక్కల్లో మహాకవి శ్రీ శ్రీ . పరబ్రహ్మం దగ్గర్నుంచీ పకోడీ దాకా పద్యాలల్లారు అవధానం కవులు . పీత్వా  పేర్వా పున :పీత్వా  స్వర్గలోకమవాప్నుయేత్' అనేది ఓ కవి కాఫీ ప్రేమ .


మనం వట్టి అల్పసంతోషులం . గోంగూర పేరు చెబితే ఒళ్ళు మరచిపోతాం. పిల్లలు అమెరికా పోతుంటే ఏ పచ్చళ్ళు ప్యాక్ చేయించాలా అని తల్లి తల్లడిల్లిపోతుంది. సాష్ట్ వేరంటే  ఇప్పుడొచ్చింది కానీ. తెలుగువాడికి అంతర్జాతీయంగా పేరుతెచ్చింది అప్పట్లో ఊరగాయ పచ్చళ్లే. మన గుత్తొంకాయ  కూరమీదింత వరకూ ఎవరూ పరిశోధన చేసి డాక్టరేటు కొట్టకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని తెలుగువాడి నమ్మకం. మనం వేపాకును కూడా వదిలి పెట్టలేం.. 'తినగ తినగ వేము తీయగనుండు'  అని దానిపనీ పడతాం.


మాయాబజారు సినిమా మీద మనకీ నాటికీ  అంత మోజెందుకో తెలుసా! పెళ్ళివాళ్లకని చేసిన వంటకాలన్నింటినీ వంటింటిలో చేరి ఘటోత్కచుడు టకటకామని ఊదేస్తాడు చూడండి! ఆ సీనుని ఎంజాయ్ చేయని వాడింతవరకూ తెలుగు నేలమీద లేడు.  ఆ 'వివాహ భోజనంబు'లోని అనుపాకాల పేర్లు వింటుంటేనే నోటివెంట నీరు ఊరిపోతుంటుంది. పెళ్ళిని మనం పప్పన్నమని  ముద్దుగా పిలుచుకుంటాం. అప్పుచేసైనా సరే పప్పు కూడు తినేసేవాళ్ళు మనలో చాలా మందున్నారు. అసలు తిండి ఊసులేకుండా ఏ పండగా పబ్బమూ మనకుండదు. పెళ్ళిచూపుల్లో ఒకప్పుడు మగపెళ్ళివాళ్ళు పిల్లను అడిగే మొదటి ప్రశ్న 'వంట వచ్చా? '  అని' ఏ పాటుతప్పినా సాపాటు తప్పదు గదా! క్షీరసాగర మధనమప్పుడు మనవాళ్లే ఉండుంటే అమృతానికి  బదులుగా  ఓ అర కప్పు కాఫీ ముందిప్పించమని మోహినితో  కచ్చితంగా పెచీపడి ఉండేవాళ్లు.  తిండిపోతు పోటీలే కనుక ఒలింపిక్సులో ఉండి ఉంటే మనవాళ్లకి ప్రతిసారీ ' స్వర్ణాలు' గ్యారంటీ.  ఆడటంలోనేకాదు. . తినడంలో కూడా మనవాళ్లు దిట్టలే . 'మన రాష్ట్రాన్ని 'అన్నపూర్ణ'ని చెప్పుకొంటాం . మన రైతుని అన్నదాతని గౌరవించుకుంటాం. ఇప్పుడంటే ఎక్కడబడితే అక్కడ మందుపాతరలు బైటపడుతున్నాయి గానీ  నిన్నమొన్నటిదాకా ఆంధ్ర రాష్ట్రం దేశం మొత్తానికి బియ్యంపాతర లేకపోతే కిలో రెండుకియ్యటం ఎలా సాధ్యం?  మనల్ని చూసే గదా కేంద్రం మూడు కివ్వాలనుకుంటుంది! మనలాగే మనదేవుళ్లకీ ప్రసాదాలంటే పరమ ప్రీతి తిరుపతి లడ్డు... తిరుపతి వెంకన్నంత ఫేమస్ .  రుద్రాక్ష మాల తిప్పేవారైనా 'ద్రాక్ష" అనగానే ఓసారి నాలికనలా చప్పరించుకోకుండా ఉండలేరు. మన తెలుగు బాలకృష్ణుడిచేత వెన్నకోసం పోతన చేయించిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇంతకే ఈ తిండిగోలెందుకని కదండీ మీ సందేహం? 


కందిపప్పు కిలో యాభై ఆరు పలుకుతోంది. ఎండుమిర్చి డెబ్బైయ్! వేరుసెనగ నూనె అరవయ్యదు! చెక్కర ఇరవై ఆరు! ఉల్లి కొనేటప్పుడే కన్నీళ్లు తెప్పిస్తోంది. అందని ద్రాక్షలాగయిపోయాయి అన్ని దినుసులూ ! పాత బియ్యల సామాన్యుడు కొని తినే పరిస్థితిలేదు. ఎండల్లాగే మండుతున్నాయి  మండీలల్లో ధరలు . నో స్టాకు బోర్డులు పెడుతున్నారు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ సీజన్లో  ఉండుంటే పదహారువేలమంచి  గోపి కలను పోషించలేక ఆర్ధాంతరంగా అవతారం  ముగించుకుని ఉండేవాడు. 


అన్న బలమే అన్ని బలాలకూ మూలమన్నారు. రావణాసురుడు ముందు తన పదినోళ్లకి ఆహారమందించటానికి లంకనే ఏ అమెరికాకో కుదువ పెట్టవ లసి వచ్చుండేది. ఆ రోజుల్లోనే కౌరవులను కనీసం ఒక్కూరైనా ఇవ్వమని పాండవులు రాయబారాలు పంపించారు. ఈ ధరలు పెరిగిన సమయంలో కనీసం  ఒక జిల్లా అయినా ఇవ్వమని అడిగుండక తప్పేదికాదు . బకాసురుడు రోజూ బండెడన్నం పప్పూ కూరలు పంపించాలని పెట్టిన షరతును ఈ రోజుల్లో అయితే ఒప్పుకోవటం సాధ్యమా?  వేలుపోసినా నోట్లోకి నాలుగు వేళ్లు పోవడం కష్టంగా ఉంది ! ఈ ధరలను గురించి నిలదీస్తారనేనేమో తిరుపతి గుళ్ళో సైతం భక్తులని ఒక సెకను కూడా దేవుడి ముందు నిల బడనీయటంలేదు. ఈ పరిస్థితులిలాగే కొనసాగితే ఆ దేవుడిక్కూడా 'శబరి' ప్రసాదం తప్పదేమో, పాపం! సౌదీఅరేబియాలో భర్తకు కాఫీ ఇవ్వకపోతే భార్యకు విడాకులిచ్చేయచ్చుట . ఇక్కడా అలాంటి పరిస్థితులు రాకముందే అధికారులు, విజిలెన్సు వాళ్ళు మేలుకోవటం మేలు.


లేకపోతే అందరం యోగరత్నాకరంలో చెప్పిన నియమాన్ని పాటించాల్సిందే!


ధరలు పెరిగే రోజుల్లో పెరుగు... పెరుగు అంటూ కూర్చోకుండా మజ్జిగ చేసుకుని తాగితే ఇంటికీ వంటికి మంచిదని వైద్యశాస్త్రం చెబుతోం ది. కైలాసంలో మజ్జిగ దొరకకే శివుడు నీలకంఠుడైనాడు. వైకుంఠంలో మజ్జిగ దొరికుంటే విష్ణుమూర్తి నల్లబడి ఉండేవాడు కాదు.  స్వర్గంలో అమృతానికి బదులు మజ్జిగ వాడివుంటే ఇంద్రుడు అలా బలహీనపడేవాడే కాదు. వినాయకుడికి మజ్జిగ తాగే అలవాటు ఉండుంటే ఆ బొజ్జ వచ్చేది కాదు. మంది ఎక్కువైతే పెరుగు మజ్జిగవుతుంది. నిజమేగానీ ధరలు ఇలా ఆ కుండా పెరిగిపోతుంటే.. ఆ మజ్జిగ నీళ్లు  కూడా మరీ పల్చనయే అవకాశం హెచ్చు . పెరుగుట విరుగుట కొ రకే.. అంటారా ? ... ఆ ధరల భారం  విరిగి పడకుండా  ఉండాలిగదా . . బలుసాకైనా అని బతికేందుకూ? 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...