Saturday, December 4, 2021

సాక్షాత్ పర బ్రహ్మమ్ ! - ఈనాడు - గల్పిక - హాస్యం - వ్యంగ్యం గురు

 



ఈనాడు - గల్పిక - హాస్యం - వ్యంగ్యం 

ఉచల్లేని బోను 

- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సం - 18 -08 -2002 ) 


పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని భుజాన వేసుకుని ఎప్పటి లాగా మౌనుగా శృశానంకేసి నడువసా గాడు. అప్పటికే శమంలోని బేతాళుడు ఒకై దొందల తొంభై నాలుగు చందమామ కతలు చెప్పి మహారాజుకు మౌనభంగం కలిగించిన దీమాతో మరోమారదే కార్యక్ర మానికి శ్రీకారం చుడుతూ 'రాజా! ఒక పొడుపు కథ పొడుస్తా విడుస్తావా'అంటూ చెప్పటం మొదలు పెట్టాడు.


అదొక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. సుమారొక ఐదొందల పైచిలుకు బోర్డు మెంబర్లుండొచ్చు. అందులో నూట పాతిక మంది బి.నామీ నేముల్తో బ్యాంకు లోన్లు కొట్టేసి ఐపీలు పెట్టిన వీఐపీలు, సగం మంది ఇన్కంటాక్సు  మొదలు ఇంట్లో కరెంటు బిల్లు, ఇంటి పన్నులవరకూ బకా యిలు పెట్టందే  గిట్టని శిష్టాచార సంప న్నులు, బ్యాంకు బ్యాలన్సు లేకుండా బర్రుమని చెక్కులు చించిచ్చేసే మస్కాగాళ్లు, క్రెడిట్ కార్డులు కావాలని ఓవర్ డ్రా చేసి కట్టమంటే తప్పించుకు తిరిగే మాయగాళ్లు, సూపర్ మార్కెట్లో ఎవరూ చూడకుంటే చీపురు పుల్లలయినా కొట్టేసే చీపు టైపు టోపీగాళూ.. గట్రాలు సగానికిపైగా ఉండే ఆ కంపెనీ చేసే పనేమిటో తెలుసా? తెలిసికూడా చెప్పకపోయావో, తెలుసుగా, నీ తల ఇక్కడే, ఇప్పుడే వెయ్యి వక్కలైపో తుంది' అని బెదిరించినా పెదవి విప్పుని రాజును చూసి. . ఈ సత్యకాలం విక్రమార్కుడికింకా  వివరంగా విడమరిచి చెబితే గానీ విషయం బోధపడి మౌనభంగం కాదని కథని కంటిన్యూ చేశాడు బేతాళుడు. 


రాజా! నీ పట్టుదల చూస్తుంటే ముచ్చ టేస్తుంది. కానీ నీకన్నా పట్టుదలగల సభా ఒకటి పుట్టివుంది. విసుగు పుట్టకుండా ఉండేందుకు నీకాకథ చెబుతా వింటావా! అంటూ చెప్పసాగింది.


అనగనగా ఒక దేశం. ఆ దేశానికాదేశాలిచ్చేందుకో సభ . అది ఐదేళ్లకోసారి మారుతూ వుంటుంది . అర్ధాంతరంగా ఏదైనా రభస జరిగితే మాత్రం మధ్యంతర

ఎన్నికలు తప్పనిసరి. మళ్ళీ జనం దగ్గరి కెళ్ళి ఓట్లేయించుకు రావాలి సభ్యులు. ఓట్లంటే ఎన్ని పాట్లు! ఎన్ని ఒట్లు వెయ్యాలో . . తెలుసా!


ఎప్పుడూ ఓడిపోయే పార్టీలన్నీ కలిసి ఈసారీ గెలవంలే అనే ధీమాతో ఒక ఊపులో పాపం 'రాజకీయాల్నుండీ నేరాల్ని దూరంగా తరిమేస్తామ'ని ఘోర ప్రతిజ్ఞలు చేసిపారేసాయొకసారి.  పదవులొచ్చిన తరవాతైనా పోనీ మెదలకుండా వున్నాయా! పదేపదే అదే పదాలని పెదాల మీదనుండి వదలకుండా వల్లె వేస్తున్నాయి . కానీ, ' చేతల్లో చేస్తున్నది మాత్రం సున్నా! ' అని ఓ చాదస్తపు ప్రజాసంస్థ  సరాసరి న్యాయస్థానం తలుపుతట్టింది.


ఓ ఫైవ్ పాయింట్ ఫార్ములాతో పంచ కూళ్ళ కషాయం కాయించి పొలిటికల్ పార్టీలన్నీ అది సేవించాల్సిందేనని న్యాయమూర్తి సెలవిచ్చారు. కోర్టు వారి సెలవేమీ శిలాశాసనం కాదు . పోయింది ప్రభుత్వం కదా! పైకోర్టుకు పోయింది ప్రభుత్వం. 


'పంచశీల ఫార్ములాను పంచ్యువల్ గా పాటిస్తే సభలో వేళ్లమీద లెక్కించేందు క్కూడా వీల్లేనంత తక్కువ మంది మాత్రమే మిగిలుంటారు యువరానర్' అని మొరపెట్టుకుంది. కిడ్నాపులూ దోపిడీలు, మర్డర్లూ, మానభంగాలు, డ్రగ్గులు... ఉగ్రులూలాంటి వాటితో సంబంధాలు ఉన్నవాళ్లు ప్రజాప్రతినిధులుగా పనికిరారం టూ- కనీసం రాబోయే ఎన్నికల్నుండైనా కాసిన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చుకదా..  అని

ఎన్నికల కమీషన్ని  కోప్పడిందా శ్రీ కోర్టు . చట్టాలు చేసే పని తమ చట్రంలో లేదనీ, చట్టసభలా పని చేస్తే ఆచరణలో చట్టుబండలు కాకుండేలా చూసేందుకే 'లా 'వుందనేలా ఒక వివరణ కూడా ఇచ్చింది.


ఎన్నికల బరిలోకి వురికే ముందే తమ చరిత్రలో ఏముందో స్వచ్ఛందంగా  చెప్పా

లని, అప్పులూ ఆస్తులూ, చదువులూ సంధ్యలూ, నేరాలూ ఘోరాలూ వగైరాల నిర్వాకాలేవైనా వుంటే బహిరంగపరచాలంటున్న పైకోర్టు సూత్రానికి ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిర్వచనంతో నివ్వెరపోయిన రాజ కీయపక్షాలన్నీ, ఏకపక్షంగా ఒక చట్టాన్ని తేబోతున్నాయి. సర్వసత్తాక వ్యవస్థ సత్తా ఏమిటో ఈ చట్టం చేసి మరీ చూపెట్టబో తున్నాయి!


రాజా! దాని ప్రకారం నేరకపోయి చేసిన నేరం ఒకసారయితే సారీ అనేస్తే సరిపోతుంది. ఆరునెలల్లోపయితే ఏ పాపమయినా అభ్యర్థుల జాబితాలో చూపనవ సరమే లేదనేది దాని సారం. కనీసం రెండు వేరువేరు న్యాయస్థానాలయినా నిర్ధారణ చేయని ఏ నేరమయినా వ్యర్ధ మని పరమార్థం . పెండింగ్ లో  ఉన్నా, బెయిలు దొరికినా ఆ నేరం నిస్సారం. ఎల క్షన్ కమిషన్ ముందైనా సరే, సలక్ష ణంగా ఏ సంకోచం లేకుండా స్వేచ్ఛగా  నేరాలను దాచుకుంటూ చంకలు గుద్దు కునే సౌకర్యం అభ్యర్థులకు సంక్రమి స్తుందీ కొత్త చట్టం వల్ల. 


మహారాజా! ఈ కొత్త చట్టం మూలకంగా నాకు కొన్ని ధర్మ సందేహాలొస్తు న్నాయి. ఫోర్జరీలు... ఫోర్ ట్వంటీలు లాంటివసలు నేరాలే కానవసరంలేని నేపథ్యంలో నిష్కారణంగా తమను కేసుల్లో ఇరికించి వేధించారని చంద్రస్వామిలాంటి మహాత్మో, హర్షద్ మెహతా ప్రేతాత్మో కోర్టుకెక్కి పరువు నష్టం కింద కోట్లు కక్క మనే ఆస్కారముందంటావా?


కొత్త ఏక్టు ఫోర్సులోకొస్తే భోఫోర్సులో ఫోర్సు పోయి కేసే ఒక ఫార్సుగా  మారి పోయే అవకాశం లేదంటావా?


కొత్త చట్టం తెచ్చిన తరువాత తహల్కా టేపుల్ని చుట్టచుట్టి తలకింద పెట్టుకుని గుర్రుకొడుతూ ఎవరైనా హాయిగా నిద్రపోవచ్చంటావా?


పశుదాణా కుంభకోణం, పంచదార పందారం, యూరియా నిర్వాకం, శవపేటి కల వ్యవహారం, టెలికాం స్కాం, ఆదాయాల వివాదాలు, ఖల్నాయక్ కాంటాక్టులు, రామ్ నాయక్ పెట్రోలు పంపులు... అవేవీ అవినీతి పనులు కానేకావని ఎవ రైనా దావావేస్తే ఎంత కొమ్ములు తిరిగిన లాయర్లయినా కవర్ చేయగలరంటావా? 


వీధులూడ్చే ఉద్యోగానికైనా నేర విచా రణ చేయనిదే ఫైలు క్లియర్ కాని రోజుల్లో సభలోకి అలా  'నేరుగా' ఎవరికైనా ఎంట్రీ ఇవ్వటం ఎంతవరకు సబబంటావూ? 


పాస్పోర్టు జారీకైనా పోలీసెంక్వయిరీ కంపల్సరీ అనే సర్కారు- ఎన్నికల్లో పోటీకి ఏ నేరవిచారణ లేకుండా ఎవరిని బడితే వారిని ఎలా నిలబెడుతుంది ?


పొట్టకూటికి చిల్లర కాజేసే  చేసే చిల్లర దొంగలు సభల్లోకే నేరస్తులను నేరుగా పోనిస్తున్నప్పుడు మమ్మల్నెందుకు శిక్షిస్తున్నారని బోనులో నిలబడి న్యాయదే వతను నిలదీస్తే  సమాధానమేమొస్తుంది?


రాజా; నేరాలు చేసేవాళ్లందరూ చట్టాలతో చుట్టరికం నెరిపేందుకే ప్రజాప్రతిని ధుల పాత్ర పోషించే పాడుకాలం దాపురించవచ్చునేమో అని  నా సందేహం. ఇప్పుడైనా నా సందేహాలకు సమాధానాలు చెప్పగలవా? ఇంతకుముందు నేనడిగిన పొడుపు కథ విప్పగలవా? అని బేతాళుడు అడిగిందే తడవుగా


బేతాళా! నీ సందేహాలలోనే  అన్ని సమా ధానాలు వున్నాయి. నీ ప్రశ్నల్లోనే జవా బుల దాగున్నాయి. ఇంతకుముందు నువ్వడిగిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ పేరు నేను చెప్పగలిగినా చెప్పలేను కాని.. అది చేసే పని మాత్రం తప్పక చెప్పగలను. 'ఊచలు లేని  బోనులు' తయారుచేస్తుంది కదూ! అన్నాడు విక్రమార్కుడు.


'శభాష్ విక్రమార్కా! మార్కులు కొట్టేశావ్! మరి మౌనభంగమయిందిగా.. మళ్ళీ కలుస్తా' అంటూ తుర్రుమని ఎగిరి తిరిగి చెట్టెక్కి కూర్చున్నాడు బేతాళుడు.


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సం - 18 -08 -2002 ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...