కథానిక:
గోపాలం బావి
- కర్లపాలెం హనుమంతరావు
( రచన మాసపత్రిక - సెప్టెంబర్, 2012 - కథాపీఠం పురస్కారం )
మౌళి సికిందరాబాద్ రైల్వేస్టేషను ముందు ఆటో దిగేవేళకు కృష్ణా ఎక్స్ప్రెస్ బైల్దేరడానికి సిద్ధంగా ఉంది.
z
ఆటో వాడి చేతిలో వంద నోటు పెట్టి చిల్లర కూడా తీసుకోకుండానే ఆదరాబాదరాగా ఫ్లాట్ ఫాం మీదకు పరుగెత్తివెళ్లి కదిలే బండి నెక్కేసాడు.. ఎలాగైతేనేం!
బండి క్రమంగా ఊపందుకుంది.
ఖాళీగా ఉన్న ఓ కార్నర్ సీట్లో కూలబడి బైటకు చూసాడు.
బస్సులూ... బైకులూ. . బళ్ళూ... పనిపాటలకు పోయే జనాలూ!... బండెడు బరువు స్కూలు బ్యాగులను భుజాల మీద మోస్తున్నా ... బండిలోని వాళ్లు తమకేదో బంధువులన్నంత హుషారుగా ‘టాటా’లు చెబుతోన చిన్నారువా !
ఇంకీ హైదరాబాదును చూడటం ఇదే ఆఖరు.
లోకానికీ తనకూ రుణం తీరిపోయినట్లేనని డిసైడయిపోయి కూడా ఇవాల్టికి రెండు రోజులు. ఇది మూడో రోజు పగలు .
ఈ రాత్రే తన చివరి రాత్రి. తెల్లారి అమ్మనీ.... అమ్మనబ్రోలునూ ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా చూడకూడదని నిశ్చయించుకొన్న తరువాతనేగా తను ఇంటికి ఆ ఉత్తరం రాసి పోస్టు చేసింది!
రేపు ఆ ఉత్తరం అమ్మ చదివించుకునే వేళకి తనీ లోకంలో ఉండడు . ఉండకూడదు.
ఉత్తరంలోని సంగతులు గుర్తుకొచ్చాయి.
"...అమ్మా! నేనిక్కడేమీ దొరబాబులాగా బతకడం లేదు. ఒక కెమేరామేన్ దగ్గర క్రేన్ ఆపరేటర్ పని. రోజుకు రెండొంద లొస్తే గొప్ప. అదీ పనిలేనప్పుడు పస్తే. పెద్ద సినిమా హీరో నవుదామని నిద్దర్లో కూడా కలవరించేవాడినని నువ్వెప్పుడూ తిట్టి పోస్తుండేదానివి. ఉడుకుడుకు నీళ్ళు మీద కుమ్మరించే దానివి. అప్పుడైనా బుద్ధి రాలేదు. ఊరొదిలి పారిపోయినప్పుడు నిన్నెంత బాధపెట్టానో తెలుసుకోలేదు. ఇప్పుడు తెలిసినా బాధ పెట్టక తప్పడం లేదమ్మా! ఈ లోకం నుంచీ వెళ్లిపోవాలనే నిర్ణ యించుకున్నాను. పోయేముందు నీ చేతి ముద్దలు రెండు తినా లనీ, రజనీ చేతిగాజులు తిరిగిచ్చేయాలనీ... నా చావుకు ఎవరూ బాధ్యులు కాదని పోలీసులకు తెలియాలనీ నీకీ ఉత్తరం రాసి పోస్టు చేస్తున్నాను....”
టీసీ వచ్చి టిక్కెట్టు అడగటంతో ఆలోచనల చైన్ తెగి పోయింది.
బండి బైలుదేరుతుందన్న హడావుడిలో టిక్కెట్టు తీసుకోకుండానే ట్రైనెక్కే శాడు తను .
ఒంగోలు దాకా పెనాల్టీతో సహా టిక్కెట్టు తీసుకుని సీటు మీద నిస్త్రాణగా పడుకుండిపోయాడు.
' ఆడపిల్ల గాజులు కాజేసినందుకు యమలోకంలో ఏం శిక్ష పడుతుందో ? తల్లినే కాదు... నమ్ముకున్న అమ్మాయిని కూడా అన్యాయం చేశాడు గదా తను...'
దుర్గ గుర్తుకొచ్చింది.
‘అభిమానం గల పిల్ల. ఎవర్నీ హద్దుమీరి దగ్గరకు రానిచ్చేది కాదు. ఆపరేటర్ పాపారావుగాడి కన్ను దానిమీద పడటం తన ఖర్మ. తనకూ దానికీ ఉన్న చనువు తెలిసి వెయ్యి నోటు పారేసి గెస్టుహౌసుకి తోలుకు రమ్మన్నప్పుడే దుర్గను తను ఎలర్ట్ చేసుం డాల్సింది. తను మందుకొట్టి గమ్మున రూంలో పడుండబట్టేగదా దాని బతుకు అన్యాయమైపోయింది! ఆ గొడవల్లో తన పేరూ బైటకు రావడంతో. . పోలీసోళ్ళ కళ్ళు గప్పి శేఠ్ దగ్గర కుదువ పెట్టిన రజని గాజులు విడిపించుకుని బండి ఎక్కటానికి బ్రహ్మ ప్రళయమైపోయింది'
“మీల్స్.... మీల్స్......” అనే కేకలతో ఈ లోకంలో కొచ్చి పడ్డాడు మౌళి.
బండి చినగంజాం స్టేషనులో ఆగి ఉంది.
ఒంటి చేతి మీద అన్నం ప్లేట్లు దొంతర్లుగా పెట్టుకుని కంపార్ట్ మెంటంతా చురుగ్గా కలియతిరుతున్నాడొక కుర్రాడు.
కుడి చేయి సగం దాకా లేదు!
అన్నం ప్లేటు చూడగానే ఆకలి రెట్టింపయింది . కానీ ఆర్డరీయ బుద్ధి కాలేదు.
ఇంకో గంటాగితే ఇంటికే పోయి అమ్మ చేతి ముద్దలు కమ్మగా తినచ్చు. కాలే కడుపుతో ఇన్ని నీళ్ళు పట్టిద్దామని బండి దిగి పంపు దగ్గరికెళ్ళాడు మౌళి.
“సార్! ఈ వాటర్ తాగితే నేరుగా పైకే; అమృతం లాంటి నీళ్ళు. ప్యూర్ వాటర్. గ్లాసు ఓన్లీ టూ రూపీస్ సార్! " అంటూ అడక్కుండానే ఐసు ముక్కలేసున్న నీళ్ల గ్లాసునందించాడు అక్కడే ఉన్న ఒక గడుగ్గాయి.
నిండా పదేళ్ళు కూడా ఉన్నట్లు లేదు. వాడి నవ్వులాగే వాడి నీళ్ళూ తీయగా, చల్లగా ఉన్నాయి.
ఇంకో రెండు గ్లాసులు పట్టించి వాడి చేతిలో పది నోటు పెట్టి కదిలే బండెక్కేశాడు మౌళి.
చిల్లరివ్వడానికి కాబోలు వాడు కాస్సేపు బండి వెంట పడ్డాడు. కానీ కుదర్లేదు.
బండి అమ్మనబోలు ఔటర్ సిగ్నల్ దగ్గర ఆగిపోయింది. పావు గంటయినా క్లియరెన్సు రాలేదు.
ఓపిక నశించి బండి దిగి పొలాల కడ్డం పడ్డాడు మౌళి.
పైరుమీద నుంచొచ్చేగాలి పరిమళానికి వళ్ళు పులకరించింది. అదోరకమైన జన్మభూమి ఉద్వేగం!
ఏడేళ్ళు దాటిపోయాయి ఈ హాయి అనుభవించి.
ఈ ఏడేళ్ళలోనే ఊరు ఎంత మారి పోయింది! జట్కాలకు బదులు ఆటోలు! కంకర రోడ్డు స్థానంలో తారు రోడ్డు! రోడ్డుకి రెండు పక్కలా ఉన్న నేరేడు చెట్లు మాత్రం చిన్ననాటి స్నేహితుడిని గుర్తుపట్టి అప్పటిలాగానే నవ్వుతూ ఊగు తున్నట్లున్నాయి.
ఆ చెట్ల మానులకు చిక్కుల ముడిలాగా వేలాడు తున్న సెట్ బాక్సు వైర్లూ... కేబుల్ వైర్లూ!
'ఊరు బాగానే బలి ! ' అనుకున్నాడానందంగా మౌళి.
ఊరు బైటుండి... ఊర్లోకొచ్చే వాళ్ళందర్నీ... నీటి గలగల లతో ఆప్యాయంగా ఆహ్వానించే అప్పటి చెరువు మాత్రం, పాపం బాగా చిక్కిపోయింది.
చెరువు చుట్టూ పరిచున్న కంచె చిక్కి శల్యమయిన తల్లి కట్టుకున్న చిరుగుల చీరలాగా చూపులకే గుబులు పుట్టించేటట్లు న్నది.
చెరువు మధ్య ఏదో భారీ నిర్మాణమే జరుగుతోంది. తల్లి పొట్టమీది రాచపుండులాగా చూట్టానికే చాలా వికారంగా ఉందా దృశ్యం.
చెరువు గట్టుమీది 'గోపాలం బావి' మాత్రం ఎప్పటిలాగా సందడిగా ఉంది. ఊరి జనాలని అక్కడ అలా చూసేసరికి చాలా ఆనందంగా అనిపించింది మౌళికి.
అప్పట్లో ఊరు మొత్తానికి అదొక్కటే మంచినీళ్ళ బావి.
చెరువు ఎండిపోయినా ఆ బావిలో నీళ్ళు మాత్రం మూడు కాలాలలోనూ నిండుగా ఉండేవి.
‘ఈ జలం తాగితే ఎంత మొండి రోగమైనా చేత్తో తీసేసినట్లు ఇట్టే మాయమైపోతుంది. అంతా మీ నాయన చేతిచలవరా మౌళీ!' అంటుండే వారు వెంకట్రావు మేష్టారు.
అరవై తొమ్మిదిలో వచ్చిన ఉప్పెనకు చెరువు నీరు చప్పబడి పోతే... గట్టుమీద ఈ బావిని తవ్వించాడుట నాయన. నాయన పేరు మీదే అందరూ దాన్ని 'గోపాలం బావి' అంటుండేవారు.
' ఇంకా నయం ! చెరువుతోపాటు ఈ బావిని కూడా పూడ్చి
పారేయ లేదు. ఆ మహానుభావులెవరో!' అనుకున్నాడు మౌళి.
శివాలయం వెనక గుండా అడ్డదారిన బడి పోస్టాఫీసు ముందున్న రోడ్డెక్కాడు మౌళి.
కిటికీగుండా ఉత్తరాలు సార్టు చేస్తున్న ఆడమనిషెవరో కనిపించింది.
రజని అయితే గుర్తుపట్టి గోల చేస్తుంది. ఏ గోలా లేకుండా ప్రశాంతంగా పోవాలనేగా తను ఇంత దూరం పడుతూ లేస్తూ వచ్చింది.
తలొంచుకుని గబగబా రెండగల్లో తూర్పు వీధిలోని తనింటి
ముందు కొచ్చిపడ్డాడు.
కంపగేటు తీస్తుంటే తల్లి కోసం కాబోలు అంగలారుస్తున్నట్లు అంబా అని అరుస్తా ఉంది లేగ దూడ.
తడిక తలుపు బైటికి గడియపెట్టి వుండటంతో ఇంట్లో ఎవరూ లేరని తెలిసిపోతోంది.
అరుగు మీదున్న కుక్కిమంచంలో అలాగే కూలబడిపోయాడు.
నీరసంగా మౌళి కళ్ళు మూతలు పడి పోతున్నాయి నిస్త్రాణవల్ల.
గబగబ మాటలు వినబడుతుంటే గభాలున మెలుకువ వచ్చింది మౌళికి.
అది అమ్మ గొంతే! ఆ గొంతులో ఏ మార్పూ లేదు.
మనిషే బాగా నలిగిపోయినట్లు కనిపిస్తోంది. మొగానికి పట్టిన చెమటను చీరె కొంగుతో తుడుచుకొంటూ వసారాలో కొచ్చిన తల్లిని చూసి అమాంతం లేచి నిలబడ్డాడు మౌళి.
చెట్టంత కొడుకు హఠాత్తుగా కట్టెదుట అలా నిలబడుండేసరికి నిర్ఘాంత పోయింది ఆదెమ్మ ముందు .
'నువ్వా!' అందిగానీ... ఆ షాకులో నుంచీ తేరుకోగానే తన్నుకొచ్చిన ఉక్రోషాన్ని ఆపుకోలేక తడిక తలుపును తన్నుకుంటూ లోపలికి దూసుకుపోయిందామె.
మౌళికి ఏం చేయాలో పాలుపోలేదు.
లోపల్నుంచీ తిట్ల దండకం ఆగకుండా వినిపిస్తోంది.
“చచ్చానో... బతికానో... చూట్టాని కొచ్చాడు కాబోలు! ఏం తక్కువచేసి చచ్చానీ చచ్చినాడికి. గాడిదలాగా కూకోబెట్టి మేపానే! తండ్రిలేని బిడ్డ గదా అని గారాబం చేసినందుకు బాగానే బుద్ధి చెప్పాడు. ఊరి పిల్లకాయలకు మల్లే వీడి మెడలోనూ ఒక కాడి వేసి మడి చెక్క లోకి తోలేసుంటే తెలిసొచ్చేది. కొవ్వెక్కి పిల్లదాని గాజులు దొబ్బుకెళ తాడా! ఒంటాడముండని ఊరి దయాదాక్షిణ్యాల కొగ్గేసి ఏడనో పేద్ద ఊడబొడవడానికట వెళ్ళాడండీ బాబూ! ఇప్పుడే మయిందంటా.! దేభ్యం మొగమేసుకుని దిగబట్టానికీ..."
ఇంక ఆ పురాణం వినలేకపోయాడు మౌళి.
"ఇంకాపవే అమ్మా... నీ పుణ్యముంటుంది! మూడు రోజుల బట్టి ముద్ద తినలేదు. ముందేదైనా తినడానికి ఇంతుంటే పెట్టవే!” అంటూ లోపలికి దూరి గారాబంగా తల్లి వడిలోకి చేరబోయాడు.
కొడుకు అభిమానంగా పట్టుకున్న చేతిని విదిలించి
కొట్టింది ఆదెమ్మ.
" పోరా.. నన్ను తాకమాక. వళ్ళంతా మంటలు పెట్టినట్లుం డాది. నువ్వు చేసిపోయిన ఘనకార్యానికి నా గుండెలు ఇప్పటికీ అగ్గి గుండమయి మండిపోతానే ఉండాయి. ఊరంతటికీ న్యాయం చెప్పే మీ నాయనకు నువ్వెంత గొప్ప కీర్తి తెచ్చి పెట్టావో ఎరికంట్రా నీకు? నువ్వు చేసిపోయిన పనికి నలుగురూ నా మొహాన్ని పేడనీళ్ళు చల్లలేదంటే... అదంతా మీ నాయన మీదున్న భక్తి తోనే ! అట్లాంటి తండ్రికి ఇట్లాంటి కొడుకు! నిన్ను కాదురా అసలనాల్సింది... నిన్నిట్లా పెంచానే, అందుకు... ముందు నాకు నేను కొర్రికాల్చి వాతలు పెట్టుకోవాల..." అంటూ అరచేయి మీద వాతలు పెట్టేసుకోవటం మొదలు పెట్టేసింది ఆదెమ్మ
మౌళి అనుకోని ఈ హఠాత్పరిణామానికి పాకయిపోయాడు.
ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్ధం కాలేదు.
మరుక్షణంలోనే తేరుకుని తల్లిని అమాంతం అలాగే మోసుకుంటూ వెళ్ళి బైటున్న నీళ్ళ తొట్టెలో పడేశాడు.
వేడివేడి బొబ్బల మీద చల్లటి నీళ్ళు పడంగానే ఆ నొప్పికి తాళలేక రంకెలు వేయడం మొదలు పెట్టింది ఆదెమ్మ.
ఆ గోలకు నలుగురూ చేరటంతో మౌళి రాక అందరికీ తెలిసిపోయింది.
ఆచారిగారొచ్చి చేతులకు చందనం లాంటిదేదో పట్టించి.. నొప్పి తెలీకుండా అల్లోపతి మాత్రలు రెండు మింగించి మళ్ళా వచ్చి చూస్తానని వెళ్ళిపోయారు.
... ... ...
మునిమాపు చీకట్లు కమ్ముకున్నాయి.
చలికాలం కావడంపల్ల ఊరు అప్పుడే నిద్రకు పడింది.
ఆచారిగారిచ్చిన మందులవల్ల ఆదెమ్మ వంటి మీద స్పృహ లేకుండా అలా పడుండిపోయింది.
బుడ్డి దీపం ఎక్కడుందో కూడా తెలీక అట్లాగే చీకట్లో వసారా గోడకానుకుని కూర్చోనున్నాడు మౌళి.
ఊళ్ళో వాళ్ళు మధ్యా హ్నం ఇంటి కొచ్చినప్పుడు అనుకున్న మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి.
'ఈడు లేనంతకాలం ఆదెమ్మ హాయిగా ఉండింది. వచ్చాడు. అప్పుడే మొదలయ్యాయా మహాతల్లికి కష్టాలు!
తల్లిని చూడటానికొచ్చిన వెంకట్రావు మేష్టారుదీ అదే
మాట...!
ముల్లులా పొడుస్తున్నాయా మాటలు.
" మీ అమ్మ ఏడేళ్ళ కిందటి ఆదెమ్మ కాదురా ఇప్పుడు! నువ్వు పారిపోయినప్పుడు నెల రోజులు మంచం పట్టింది. అంతా పోతుందనుకున్నాం. తిప్పుకుందెట్లాగో!
ఎందుకు తిప్పుకుందో తెలీదు కానీ.... అదే ఊరికిప్పుడు చాలా మేలయింది.
ఊరు కోసం చాలా చేస్తున్నదిరా మీ అమ్మ ఇప్పుడు! అచ్చంగా మీ నాయనలాగే!
నిన్ను మీ నాయనలాగా తీర్చి దిద్దాలనుకునేది. నువ్వు పారిపోతివి.
నవ్వు లేని లోటును ఇట్లా పూడ్చుకుందామనుకుందో ఏమో!
డ్వాక్రా అనీ, అదనీ.. ఇదనీ... ఎప్పుడూ ఏదో పని చేస్తుంటుంది. ఊరి ఆడవాళ్ళకు అప్పులిప్పించింది. సారాయి అంగడిని మూయించిందాకా నిద్ర పోలేదు. యానా దయ్యకు అదే గంటు ఇప్పుడు.
చెరువు పూడ్చి పారేసి సినిమా హాలు కట్టిస్తున్నాడు. చూసావుగా! దాన్నెట్లాగైనా అడ్డుకోవాలని ఈ వయసులో ఒంగోలు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంది... అలుపు సొలుపు లేకుండా!
ఎన్నికలొస్తున్నాయి . ఎట్లాగైనా పంచా యతీ బోర్డుని కైవసం చేసుకొని ఊరు మొత్తాన్ని మింగేయాలని చూస్తున్నాడు రాక్షసుడు. ఎదురు నిలబడి శతవిధాలా కొట్లాడు తుంది మీ అమ్మ.
ఇంకో వారంలో ఎలక్షన్లు. ఇప్పుడు నువ్వొ చ్చావు....”
మేష్టారు అర్థాంతరంగా ఆపేసిన ఆ వాక్యం అంతరార్థం అర్థం చేసుకోలేనంత అమాయకుడు కాదు మౌళి.
తను ఊరు వదిలి పారిపోయేరోజు ఈ సారు కూతురు రజని చేతి బంగారు గాజులేగా కాజేసుకెళ్ళింది!
ఎప్పట్లా ఆడుకోవడానికి తనతో చెరువు గట్టుకొస్తే ఒంటరిగా చూసి ఆమె గాజులు గుంజుకు న్నాడు తను.
ఆ పెనుగులాటలో రజని బావిలో పడినా పట్టిం చుకోకుండా పారిపోయి హైదరాబాద్ బండెక్కేశాడు.
రజని కేమయిందో అడిగే ధైర్యం రావడం లేదుఇప్పుడు! .
మేష్టారు కూడా ఆ ప్రస్తావనే లేకుండా అమ్మను గురించే అంతలా చెబుతున్నారంటే... అర్థం తెలుస్తూనే ఉంది.
"టీవీలు... సెల్ఫోన్లు ఇప్పుడంతటా ఉన్నాయిరా! అక్కడ హైదరాబాదులో ఏం జరిగిందో ఇక్కడ అందరికీ తెలుసు. ఊరు మారుండవచ్చేమోగాని... ఊరి జనాల తీరేం మారుతుంది!” అన్నారు సారు శ్లేషగా.
నిజమే! జనాలు... చాటుగా ఏం ఖర్మ.... మొహం మీదనే ... అదోలా మొహం పెట్టి అంటున్న మాటలు వింటూనే ఉన్నాడు.
మేష్టారేమీ జరిగనిది చెప్పడం లేదు.
"గెలవడం కోసం యానాదయ్య వెయ్యని ఎత్తు లేదు. అందు లోనూ మీ అమ్మ చేతిలో ఓడటమంటే.... అవమానం . ఆ సంగతలా ఉంచు! ముందు సినిమా హాలు పని ఆగిపోతుంది. ఈ దఫా ఎన్నికల్లో గెలిస్తే మిగతా చెరువు భాగంతో పాటు గోపాలం బావిని కూడా పూడిపించి మళ్ళా ఏదో కల్లు దుకాణం తెరిచే
పెద్ద ప్లానులో ఉన్నాడు.
అందుకే మీ అమ్మ అట్లా తెగించి పోరాడుతోంది..
.. ఇప్పుడు నువ్వొచ్చావు. అప్పుడే జనాల్లో నీ రాక
మీద కలవరం పుట్టిస్తున్నాడు యానాదయ్య.
ముందు ముందు ఏమవుతుందో ఏంటో?
గెలవడం కోసం ఎంతకైనా దిగజారగల త్రాష్టుడు ఆయన.
చాలా ఏళ్ళ బట్టీ నువ్వీ వూళ్ళో లేవుకదా! అందుకే నీ కిక్కడి రాజకీయాలు అంతు పట్టటం లేదు”
ఆదెమ్మ నొప్పితో కదలటంతో సంభాషణ మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు వెంకట్రావు మేష్టారు.
మంచం మీద మూలుగుతున్న తల్లి వంక చూసాడు మౌళి.
ఆమె అలా మూలుగుతోంది. . వట్టి నొప్పి వల్లే కాకపోవచ్చు.
మేష్టారు చెప్పినట్లు తను ఇలా హఠాత్తుగా ప్రత్యక్షమవడం వల్ల కూడా కావచ్చు.
చెప్పాపెట్టకుండా పోయి ఆ రోజు అట్లా బాధపెట్టాడు. అడగా పెట్టకుండా వచ్చి ఇపుడు ఇట్లా హింస పెడుతు న్నట్లున్నాడు.
లోకంలో దర్శనం చేత తల్లిని హింసపెట్టే కొడుకు బహుశా తానొక్కడేనేమో!
అప్పుడు పసితనంలో చేసిన తప్పు! ఇప్పుడు చేతగానితనంతో చేస్తున్న తప్పు!
తనవల్ల తల్లికి అప్పుడూ... ఇప్పుడూ దుఃఖమే!
ఆమెను సంతోషపెట్టాలంటే తనేమి చేయాలి? తనేం చేస్తే అమ్మ ఊరందరి ముందు గర్వంగా తలెత్తుకుని తిరగగలుగు తుంది?
ఠక్కుమని తట్టింది మెరుపులాంటి ఆలోచన.
ఒక నిర్ణయాని కొచ్చినట్లు గభాలున లేచాడు మౌళి.
అంత చీకట్లో కూడా ఓపిగ్గా తడుముకుంటూ పొయ్యి దగ్గరి దాకా వెళ్ళి ఓమూల ఉన్న అగ్గిపెట్టె నందుకుని బుడ్డిదీపం వెలి గించాడు.
ఆ మసక వెలుతురులోనే మధ్యాహ్నం తల్లి వండిపెట్టిన అన్నం కుండలో నుంచి ఇంత తీసుకుని కంచంలో పెట్టుకుని అక్కడే ఉన్న ఆధరువుతో కలుపుకుని గబగబా రెండు ముద్దలు మింగేశాడు.
కుండలోని నీళ్ళు రెండు గ్లాసులు తాగేసరికి ఆత్మా రాముడు శాంతించాడు.
తల్లి తలగడ దగ్గర తాను తెచ్చిన రెండు బంగారు గాజులు పెట్టి... నిశ్శబ్దంగా బైట కొచ్చేశాడు.
తనే తరువాత రజని కిచ్చు కుంటుంది అనుకున్నాడు.
చీకట్లో చూడక కాలు బర్రె డొక్కలో తగిలినట్లుంది. అది
'బా' అంటూ బాధతో విలవిలలాడింది.
ఆ అలికిడికి తల్లి లేవకముందే గభాలున కంపగేటు లాగి ఒక్క ఉదుటున రోడ్డు మీద కొచ్చి పడ్డాడు మౌళి.
చల్లగాలికి వూరంతా డొక్కల్లో కాళ్ళు ముడుచుకుని నిశ్శబ్దంగా పడుకోనున్న పాపాయిలా ఉంది.
బజారులో నరసంచారం లేకపోవటంతో మెయిన్ బజారు గుండానే శివాలయం వెనకున్న గోపాలం బావి గట్టు మీదకు చేరాడు మౌళి.
బావిలోకి తొంగి చూశాడు.
చీకటి తప్ప ఏమీ కనిపించలేదు .. తన భవిష్యత్తులాగా .
ఏడేళ్ళ క్రిందట ఇదే బావిలోనే రజని జారిపడి పోతుండటం చివరిసారిగా చూసాడు తను.
తనూ అలాగే జారి పడిపోతున్నాడిపుడు.
అవును! ఎక్కడికో పోయి ఏ దిక్కుమాలిన చావో చచ్చి... ఈ శవం ఎవరిదని ఎవరెవరిచేతనో పంచాయితీ పెట్టించుకోవడంకన్నా.. జన్మభూమిలో... కన్నవారి కనుసన్న ల్లోనే జీవితం అంతం చేసుకుంటే... కనీసం ఆ సానుభూతైనా అమ్మను ఎన్నికల్లో గెలిపి స్తుందేమో!
బ్రతికి సాధించలేనిది ...చచ్చి సాధించడమంటే ఇదేనా? ఏమో!
ఏమైనా సరే.. తల్లి గెలవాలి.
ఈ విధంగా మేలు చేసే అవకాశం తనకు కలిగించడానికే కాబోలు... బహుశా దేవుడు తనను ఎక్కడి హైదరాబాదు నుంచో ఇక్కడికి తీసుకొచ్చింది!
కాలికి కట్టుకున్న చేంతాడు మరో కొసను అక్కడే పడి వున్న బండ రాయికి చుట్టాడు.
బావి ఒరల మీదకు బండరాయిని చేరుస్తున్నంతసేపు చేతి గాయాలతో గగ్గోలు పెడుతున్న తల్లిని మధ్యాహ్నం... నీళ్ళతొట్టి దాకా మోసుకెళ్ళిన దృశ్యమే మనస్సులో మెదులుతూ వుంది.
గోపాలం బావి గట్టు మీదెక్కి నిలబడి ఒక్కసారి వెనక కనిపించే తాను పుట్టిన ఊరి వంకా... మరోసారి ముందు చిక్కి శల్యమై దీనంగా చూస్తున్న చెరువు వంకా చూసి... శివాలయం వంకే చూసుకుంటూ
కాలితో బలంగా బండరాయిని బావిలోకి తన్నేసాడు మౌళి.. బండరాయితో పాటే... తనూ... ఆ చీకట్లోకి జారిపోతూ....!
... ... ...
కళ్ళు తెరిపిడి పడేసరికి ఎదురుగా మొహంలో మొహం పెట్టి ఆత్రంగా చూస్తున్న తల్లి కనిపించింది మౌళికి.
చుట్టూ సినిమా చూస్తున్నట్టు పోగైన జనం!
తను బలవంతపు చావు నుంచి బైటపడ్డానని తెలియడానికి అట్టే సమయం పట్టలేదు మౌళికి. అర్ధమయింతరువాత చాలా సిగ్గనిపించింది.
“ఇప్పుడు సిగ్గు పడితే ఏం లాభం? ఆ బుద్ధి బావిలో దూక్క ముందుండాలి. ఊరోళ్ళకి మీ నాయన చేసి పోయిన మంచి పనుల్లో చివరికి మిగిలింది ఈ గోపాలం బావొక్కటే! దీన్ని కూడా జనాలకు దక్కకుండా చేసి పోవాలనా నీ దరిద్రపు ఆలో చన?” ఆదెమ్మ మాటల్లోకి మల్లా మధ్యాహ్నపు పదును వచ్చి చేరింది!
“ఏమంటున్నావు ఆదెమ్మా! " అన్నారు వెంకట్రావు మేష్టారు అయోమయంగా.
“అవును సారు! ఇప్పుడీ బావి... చెరువు కోసమే కదా మనమంతా ఆ యానాదయ్యతో కొట్లాడతావుంది . వీడు ఇందులో పడి ఛస్తే నీళ్ళు మైలపడ్డాయని బావిని వెలేసే త్రాష్టులున్నారు సారూ ఊళ్లో! అయినా అక్కడ హయిదరాబాదులో ఏదో ఛండాలప్పని చేసి ఇక్కడికొచ్చి చావాలనుకోవడం ఏంటసలు?... ఆ చావేదో అక్కడే గుట్టుచప్పుడుగా చావచ్చుగా! తెలిసి ఒక్కేడుపు ఏడ్చి వూరుకునే దాన్ని”
"ఛ... మరీ అంత అన్యాయంగా మాట్లాడద్దత్తమ్మా! అక్కడ హయిదరాబాదులో జరిగిన దాంట్లో మన మౌళి తప్పేంలేదసలు. చెయ్యని నేరం మీద పడిందని నీ కొడుకెంత కుమిలిపోతున్నాడో నీకు తెలుసా!" అంది ఒక ఆడమనిషి.
అప్పుడు చూసాడు మౌళి రజని వంక! కళకళలాడే ఆమె మొహం తిలక సౌభాగ్యం లేక బోసిగా ఉండటం చూసి మనసు కలుక్కుమంది.
రజని అంటోంది. " మౌళి రాసిన ఉత్తరం ఇదిగో. నిన్న సాయంత్రం టపాలో వచ్చింది. ఇది చదివే ఏదో జరగబోతుందని నేనొక కంట కన బెడుతూ ఉంది. నీళ్ళ కోసం ఎప్పటిలాగే తెల్లారగట్ట బావి దగ్గర కొచ్చాం నేనూ, చిన్నా. బావి లోపల్నుంచి మూలుగులు వినబడుతుంటే నేనే వీడిని దూకి చూడమన్నా!" తడిసిన బట్టలతో వణుకుతూ నిలబడ్డ చిన్నపిల్లవాడిని ముందుకు నెట్టింది రజని.
వాడివీ రజని పోలికలే! చిన్నగంజాం స్టేషనులో మంచినీళ్ళమ్ముకునే కుర్రాడు వీడే !
మేష్టారు రజనికి తెచ్చిన కృష్ణ సంబంధం అంత మంచిది కాదు. తాగుడు ఎక్కువై పచ్చకామెర్లొచ్చి భర్త పోయేనాటికి రజనికి ఈ పిల్లాడుట. తండ్రి సబ్ పోస్టాఫీసులోనే కృష్ణ చేసే పోస్టుమేన్ పని తను చేస్తూ... పిల్లాడి చదువు ఖర్చుల కోసం శని ఆదివా రాలు అట్లా చినగంజాం రైలు స్టేషనులో నీళ్ళమ్మిస్తూ ఉంటుందిట రజని. తరువాత ఇంటి దగ్గర రజనే చెప్పిందీ విషయాలన్నీ మౌళికి.
ఊళ్ళో కల్లు దుకాణాలు యానాదయ్యవి రెండు మూడున్నాయి . కాని... మంచినీళ్ళ బావి మాత్రం మీ నాయన తవ్వించింది ఒకటే! నీ వల్ల అది పాడయిపోతుందన్న ధర్మకోపంతో అత్తమ్మ
అలా అంది కాని.. నీ మీద కోపమెందుకుంటుంది మౌళీ? నా గాజులు మీ అమ్మ కిచ్చావుటగా! నాకు తెచ్చిచ్చింది. నేనేం చేసుకోను వీటినిప్పుడు? '
గిల్టీగా తలొంచుకున్నాడు మౌళి .
" నీ చిన్ననాటి ఫ్రెండుగా ఒక సలహా ఇస్తారా ; నచ్చితే చెయ్యి! మళ్ళా ఆ హైదరాబాదెందుకు? ఇక్కడే ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకో! ఈ గాజులు పెట్టుబడిగా పెట్టుకో! చిన్నాని సాయానికి నీ దగ్గర పెట్టుకో! " అంది రజని.
" ముందు ఈ ఎన్నికలయిందాకా వూళ్ళోకి దొంగసారా రాకుండా కాపుకాయరా! రాత్రిళ్ళు గోపాలం బావిలో రాక్షసులు ఏ విషం పోయకుండా కాపలా కూడా కాయాలి” అంది ఆదెమ్మ. కంచం నిండా అన్నం ముద్దలు కలుపుకొచ్చి మౌళి నోటి కందిస్తూ .
- - కర్లపాలెం హనుమంతరావు
( రచన మాసపత్రిక - సెప్టెంబర్, 2012 - కథాపీఠం పురస్కారం )
No comments:
Post a Comment