Sunday, December 12, 2021

ఆకుపచ్చ' ధనం ' - కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు సంపాదకీయం, 30 - 10-2011 )

 ఆకుపచ్చ' ధనం  ' 

- కర్లపాలెం హనుమంతరావు 

(ఈనాడు సంపాదకీయం, 30 - 10-2011 ) 


అశ్వత్థవృక్షాన్ని నాశనం లేనితనంలో సంసారంతో పోల్చాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత పదిహేనో అధ్యాయంలో. రావి ముక్కోటి దేవతల ఆవాసమని భారతీయుల విశ్వాసం. దత్తావతార పరంపరలో వృక్షాలకుండే ప్రాధాన్యం విశేషమైనది. షిర్డీసాయి పన్నెండేళ్లు వేపచెట్టుకింద తపస్సు చేసినట్లు చెబుతుంటారు . పంటపొలాలు లక్ష్మీ నివాసాలని ప్రాచీన భారతీయల భావన. సంతాన కామన, గ్రహదోష విముక్తి, పితృదేవతల అనుగ్రహం వంటి లౌకిక కార్యకలాపాలన్నింటికి అశ్వత్థ, బిల్వ, శింశుప వంటి వృక్షదేవతల అనుగ్రహం అత్యంత ఆవశ్యకమని బ్రహ్మవైవర్త  నుంచి తైత్తరీయం దాకా సర్వ  పురాణాలు, సంహితలు  ఘోషిస్తున్నాయి. అన్యమత సంస్కృతుల్లోనూ వృక్షసంపదకు గౌరవస్థానముంది. బౌద్ధ హీనయాన సంప్రదాయ శిల్ప కళాఖండాల్లో తధాగతుడికి  సంకేతం బోధివృక్షం. యూదుల ఆధ్యాత్మిక సంప్రదాయాలలో  సృష్టి అంటే జీవవృక్షం. యూరోపియన్లు ఇగ్డ్రాసిత్ మహావృక్షంగా అభివర్ణించేది ఈ జీవవృక్షాన్ని . ఈజిప్షియన్, ఇస్లామిక్ వంటి ప్రాచీన సంస్కృతులన్నీ వృక్షప్రాథమిక స్వరూపాన్ని వివరించాయి. మానవాళి మనుగడకు మూలాధారం ప్రకృతి ప్రసాదించిన వృక్షసంపద. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో- అత్తవారింటికి పోతున్న శకుంతలను తపోవన వృక్షాల అనుమతీ తీసుకొమ్మని కణ్వమహర్షి కోరడం వెనకున్న ఆంతర్యం ప్రకృతిలోని సాటి జీవి - వృక్షమూ సఖి పాటి ప్రేమ పాత్రమైనదన్న ఉదాత్త భావనము. చెట్లపాదుల్లో నీరు పోయకుండా తాను చుక్కనీరైనా తాగేది కాదు శకుంతల. అలంకారమంటే ఎంత మమకారమున్నా చిగురుటాకు తెంపడానికైనా ఇష్టపడేది కాదామె. మొదటిసారి మొక్క పూతకొచ్చినప్పుడు అదో మహోత్సవంగా సంబరాలు జరుపుకొనే ప్రకృతి పట్ల ప్రేమ ప్రపంచమంతటా పరచుకుని ఉండేది నిన్నమొన్నటి వరకూ.


చెట్లు, తీగెలు, పూలు, పళ్లు, చిగురుటాకులు, వసంతాలు, హేమంతాలూ- ఇవే ఒకనాటి మన మహాకవులకు అభిమాన కావ్య    వస్తువులు. ప్రకృతితో తాదాత్మ్యత పొందడం సుకవిత లక్షణంగా భావించిన రోజులవి. శివుడికోసం తపోనియమానికి సిద్ధమవుతూ  ద గౌరి తన హొయలు, విలాసాలను పూలతీగెల్లో భద్రంగా దాచుకుంది- అని భావన చేస్తాడు కుమార సంభవంలో కాళిదాసు. ప్రవరాఖ్యుడిని  అడ్డుపెట్టుకొని అల్లసాని పెద్దనామాత్యులు హిమగిరి వర్ణనలవేళ చెలరేగిపోవడం గమనార్హం. . భగీరథుడు శిరః కేశాలు  జడలు కట్టే వరకు  నిశ్చింతగా తపం చేయగలిగాడన్నా, బిడియం విడిచి పార్వతి ఏకాంతంలో శివుడు డస్సిపోకుండా అవిశ్రాంతంగా సేవలందించగలిగిందన్నా... అదంతా అడవితల్లి చలవే! త్రేతాయుగంలో పతీవియోగం వేళ సీతమ్మతల్లి శోకాన్ని పంచుకున్నది ఒక అశోక వృక్షం. మేఘనాథుడి  మాయదెబ్బకు మూర్ఛిల్లిన లక్ష్మణస్వామిని పునర్జీవితుడిని చేసింది ఆంజనేయుడు తెచ్చిన సంజీవనీ మూలిక. 'అసతోమాసద్గమయా' తత్వం తథాగతుడి హృదయానికి తట్టింది కూడా  ఓ బోధివృక్షం నీడ కిందేగదా! గడ్డిపరకనుంచి మహా వటవృక్షం దాకా మొక్కలోని ప్రత్యంగమూ మానవ జాతికి చేస్తున్న ఉపకారాలను ఏకరువు పెట్టుకుంటూ పోతే ఎన్ని ఉద్గ్రంథాలైనా చాలవు. పోతన భాగవతంలో గోపబాలురు వేసవితాపాన్ని తట్టుకోలేక తరుచ్ఛాయల కింద చేరిన సందర్భంలో గోపాలకృష్ణుడు పాదపాల ప్రయోజనాలను తెలియచేస్తాడు. సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ నుంచి, సుమనోహర తెలుగు కథారచయిత  గోపీచంద్ వరకు  పోతన తరహాలో   వృక్ష మహిమలను కథలుగా చెప్పినవారు ఇంకా  ఎందరో! చెవిన పెట్టేవారే  కరవవుతున్నారు గానీ  ఈ కలికాలంలో!


తరువు దేవుళ్ల  మహాప్రసాదం తగుపాళ్లలో లేకపోతే మనిషి ఎంత తిన్నా అది అసంపూర్ణాహారమే అవుతుందన్నది  ఆయుర్వేద సిద్ధాంతం . మనిషి పుట్టుకకు ముందునుంచే చెట్టు ఉంది. బట్ట కట్టడానికి పత్తి, పెరిగి పెద్ద కావడానికి కాయా కసరూ  , పండుగలకు ఆకుపచ్చని తోరణాలు, పెళ్ళిళ్లకు అరటి బోదెల మండపాలు, చివరికి అంత్యదశలో  బూంది కాష్టంలో   కాలేందుకు    చెట్టుచేమలిచ్చే కట్టెలేగదా సాయంపట్టేదీ!అణుయుద్ధంలో అంతా సర్వనాశనమైపోయినా బీజం  రూపుతో   భూగర్భంలో దాగి ఉండి అదను దొరకగానే  తిరిగి చిగురై మొలిచే  చేవ సృష్టిమొత్తంలో ఉన్నది ఒక్క వృక్ష  జాతికే - అంటారు జగదీశ్ చంద్రబోస్. 'వాడిన వనవాటిక / మరల తిరిగి పల్లవిస్తుంది' అన్న దాశరథి గేయంలో దాగున్న భావమూ అదే! రాకాసి రెక్కల నీడలో వ్యాపారమొక్కటే   వూపిరవుతున్నవినాశకరపు వేళ  పచ్చదనం గతకాలపు జ్ఞాపకంలా మిగిలిపోమే దౌర్భాగ్యం దాపురించడం  ఆందోళనకరం. ఆకుపచ్చని  పొలాలనూ  అడవులను విచ్చలవిడిగా ఆక్రమించి  పరిశ్రమలు నెలకొల్పే పిచ్చితనంతో మనిషి సొంత మనుగడకే అంతకుడవుతున్నాడు.  అంతకంతకు హరితసంపదను   హరించేస్తూ     భూతాపం దుర్భర స్థాయికిచేరేందుకు కారకుడవుతు న్నాడు.  రుతుధర్మాలను గతులు తప్పించి    కొత్తరోగాలు నెత్తికి చుట్టుకుంటున్నాడు  . వేరునుంచి చిగురుదాకా నిస్వార్థంగా సకలం సమర్పించుకునే వృక్షసంతతిని సర్వనాశనం చేయడం- మనిషి స్వవినాశానికి మొదటి మెట్టు. అర్ధశతాబ్ది వయసు వృక్షం అందించే సేవల విలువ రూపాయల్లో సుమారు పదిహేడు లక్షలు. మూడుపదుల చదరపు కిలోమీటర్ల పచ్చదనం ఒక్కరోజులో అందించే ప్రాణవాయువు ఒక మనిషికి రోజంతా సరిపోతుందని అంచనా. హెక్టారు భూమిలోని చెట్టూచేమా ఇరవైనాలుగు కిలోల సారవంతమైన మట్టిని కొట్టుకుపోకుండా కాపాడటమే కాదు  ఆరు నుంచి  ఎనిమిది డెసిబుల్స్ వరకు శబ్ద కాలుష్యాన్ని తగ్గించగలుగుతుంది. . పచ్చదనాన్ని మించిన పసిడి ధనం ఉచితంగాఇంతెత్తున  ఇంకెక్కడ ఉచితంగా  దొరికేది?! ఎక్కి ఉన్న కొమ్మనే విరిచేసే వెర్రితనం మనిషి  ముందు మానుకోవాలి. వృక్షాలను నరికితే ఆరునుంచి రెండేళ్ల వరకు  బెయిలు దొరకని జైలు శిక్ష విధించే జీవవైవిధ్య మండలి చట్టం పట్ల  అందుకే అందరం సానుకూలంగా స్పందించాలి! 

- కర్లపాలెం హనుమంతరావు 

(ఈనాడు సంపాదకీయం, 30 - 10-2011 ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...