అబల కాదు
తబలే .. ఇప్పటికీ!
-కర్లపాలెం హనుమంతరావు
బ్రహ్మదేవుడు
ఏ బ్యాడ్ మూడ్ లో ఉండి సృష్టించాడో, ఆడదాని బతుకు ఎప్పుడూ గండ్రగొడ్డలి కింది
ఎండుకొమ్మే!
కిందే కాదు.. పై ప్రపంచంలోనూ! బ్రహ్మయ్యకు రిమ్మ తెగులు.
శివయ్య సగం శరీరం భార్యకు ఇచ్చినట్లే ఇచ్చి మరో గంగానమ్మను నెత్తికెత్తుకున్నాడు.
హరి మాత్రం! హరి.. హరీ! కట్టుకున్న దానిని ఆకట్టుకోవలసింది పోయి కాళ్ల దగ్గర అచ్చంగా
కట్టిపడేసుకున్న మహానుభావుడాయన.
'ఆడదానికి స్వేచ్ఛిసేస్తే మహా అపాయం' అని ఆ మనువెవరో
అన్నాట్ట కదా! ఆయనన్న మిగతా సుద్దుల్ని మాత్రం గట్టున పెట్టేసి, ఈ ఒక్క ముక్కను వేదంలా మన మగమహారాజులు
ఈ ఇరవైయొకటో శతాబ్దం దాకా వేదంలా ఈడ్చుకొచ్చారు!
ఒక్క
మగాడనేమిట్లే, గ్యాసుబండలు, యాసిడ్ సీసాలు, సెల్ఫోన్ కెమేరాలు, సినిమా బడితె బొమ్మలు, కట్నం వేధింపులు, అత్యాచారాలు, అతి ఆచారాలు,
అనారోగ్యాలు, భ్రూణహత్యలు, పరువుహత్యలు,
లైంగిక వేధింపులు, గాడిద చాకిర్లు, తక్కువ జీతాలు.. అబ్బో.. జల్లెడ
చిల్లుల కన్నా ఎక్కువ ఆడదాని కడగండ్లు!
వేళకు వంట
చేసి వడ్డించడానికి, మగాడికి బిడ్డల్ని కని.. పెంచడానికి,
ఇంటిని కనిపెట్టుకునుండటానికి, వంటికి సుఖమందించడానికి,
బైట బడాయి షోలకు, వేణ్నీళ్లకు చన్నీళ్లని వంక
పెట్టి సంపాదించిందంతా కుమ్మేయడానికి, సినిమాల కెళ్లినప్పుడు
క్యూలల్లో త్వరగా టిక్కెట్లు కోయించుకోడానికి, బస్సుల్లో
ఆడాళ్ల సీట్లనూ అక్రమంగా అక్రమించడానికి, బ్యాంకుల్లో
దొంగపేర్లతో ఖాతాలు తెరుచుకోడానికి.. మాత్రమే భగవంతుడు
ఆడదాన్ని తనకు జోడీగా కుదిర్చాడనుకుంటున్నాడు మగాడు.
బల్లిని చూసి
భయపడేటంత సున్నితమైన మనస్సు నిజానికి ఏ అమ్మడుకయినా. అయినా ఒక మగాడి సంసారం గాడినపెట్టడానికి నవమాసాలు నరకయాతన నవ్వుతూ సహించేందుక్కూడా
సిద్ధపడే సాహసి సహచరి. బిడ్డ పుట్టుకకు అవసరమైతే
కత్తికోతకైనా తను సిద్ధపడే త్యాగశీలి తరుణి.
గంట పనికే
వందలు డిమాండు చేసే వ్యాపార ప్రపంచంలో పాచి పని
నుంచి రాత్రి పడక పని దాకా సహస్రావతారాలతో సమర్థంగా శ్రమించే స్త్రీ మూర్తి
శుశ్రూషకు పైసల్లో, పెన్నీల్లో విలువ గడితే పది
మంది బిల్ గేట్స్, అంబానీల సంపాదలన్నీ కలిపినా ఒక వారానికి
మించి సరిపోతాయా?
మగమనుషులు మద
మాత్సర్యాలతో ఒకరినొకరు ఆడిపోసుకునే నీచ సంస్కృతిలో కూడా పాపం ఏ ప్రమేయం లేని
అమ్మలక్కల ప్రస్తావనలే వస్తాయి! మనుషులలో సరే.. మనసులలో సంగతి!
పులి అడవిలో
కదిలేటంత చురుగ్గా ఇంటిలో కలితిరిగే శక్తి కలది స్త్రీ. ఇంటి నాలుగు గోడల మధ్య పనిపాటల చేసుకొనే
సందర్భంలో అమ్మ నడిచే దూరం ముందు ఏ
మారథాన్ పరుగుపందెం విజేత రికార్డయినా బలాదూర్! ఇంటి బరువు బాధ్యతలను ఒంటిచేతి మీదుగా
నిర్వహించే ఆమె దారుఢ్యం ముందు ఎంత మంది కరణం మల్లీశ్వరులు ధృఢంగా నిలబడగలిగేది!
ఇంటికి ఆమే
యమర్జెన్సీ వైద్యురాలు. ఏ శిక్షణా అక్కర్లేని సుశిక్షణగల
ఉపాథ్యాయురాలు. అనుక్షణం బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే జీతమివ్వని
వార్డెన్ కూడా ఆమే. కుటుంబ సభ్యులు ఎవరికైనా కష్టం వాటిల్లితే
పైసా ముట్టకుండా చక్కని కౌన్సిలింగు ఇచ్చే సామర్థ్యం ఆమె సొంతం. ఎవరి ఇష్టాయిష్టాలేమిటో పెదవి విప్పకుండానే ఇట్టే పసిగట్టి వీలును బట్టి ఉన్న
వనరులతో అందరికి సంతృప్తి కలిగించే ట్రబుల్ షూటర్ అమ్మ తరువాతే భూమ్మీద ఇంకెవరైనా.
సంసారమనే
విమానానికి ఆమే ప్రధాన చోదకురాలు. ఎయిర్ హోస్టెస్.
రచ్చలో కూర్చున్న రాజేంద్రునికి మల్లే భర్త కాలు కదపక పెత్తనం
చెలాయిస్తున్నా, ఆమె కలికి కామాక్షికి మల్లే వదిగి ఉంటున్నందు వల్లనే ఇల్లు ఓ కైలాసగిరిగానో..
అమరావతికి మల్లేనో బైటి కళ్లకు శోభకలిగించేది.
ఆధార్ కార్డ్
సైతం ఓ పట్టాన దొరకని ఈ కలికాలంలో ఇంటిల్లిపాదీ గుడ్డిగా ఆధారపడ్డా ఇబ్బంది లేని
ఆమె సేవలు ఉదారంగా దొరకడం మగమారాజు చేసుకున్న అదృష్టం. మెడలో మూడు ముళ్లు పడి, సహచరునితో ఏడడుగులు నడిచిన మరుక్షణం నుంచి ఇంటి పేరును మార్చు, మార్చక పో వంటి తీరును
భర్త వంశానికి మీదు కట్టే త్యాగమయులు భూమ్మీద తరుణుల తప్ప ఇంకెవరుంటారు!
రాముడొచ్చి
కూల్చే వరకు రావణబ్రహ్మనైనా గడ్డిపోచ కింద
దూరం పెట్టగలిగిన సీతనీతి స్త్రీ జాతిది. కాళ్ల పారాణి ఆరక ముందే కట్టుకున్న భర్త సోదర ప్రేమతో కానలు పట్టిపోతున్నా
కంటి నీరు కొనుకుల కట్ట నుంచి ఉబికి రానీయని ఊర్మిళకట్టు ఉదిత జాతిది. పతిని దేవుడనుకోడం వట్టి మాటలలోనే కాదు; ప్రాణగండం ముంచుకొస్తే
సాక్షాత్ ఆ దేవుడితో తలపడేందుకైనా వెనక్కు
తగ్గని సావిత్రిసాథ్వీగుణం కూడా స్త్రీ జాతిదే. తనవాడుగా
తలచిన మరుక్షణం మనువాడే తెగింపుగుణం
రుక్మిణికి వలె మనం మగులందరిలోనూ చూడగలం. భర్తకు లేని దృశ్యభాగ్యం తనకు మాత్రం ఎందుకు.. వద్దని
కళ్లకు గంతలు కట్టుకుంది పట్టపురాణి గాంధారి!
బుద్ధిలో నాలుగు రెట్లు, సాహసబుద్ధిలో ఎనిమిది రెట్లు స్త్రీకే ఆధిక్యతని చెప్పేందుకు ఈ తరహా ఉదంతాలు చరిత్రలో ఇంకెన్నో!
మగవాడి మతలబు
కేవలం ఐదు పదాల్లో తేల్చేసిన అమరుకం, ఆడదాని విషయంలో నూటనలభై నాలుగు పదాలు వాడీ 'ఇహ నా వల్ల కాదు పొమ్మ'ని
గుడ్లు తేలేసింది. కావ్యాలంకారాల అష్టవిధ నాయికల నుంచి, కన్యాశుల్కం మార్కు మధురువాణి వరకు స్త్రీ మనసు అర్థం చేసుకోనేందుకు మగవాడు
పడ్డ ఆపసోపాలు అన్నీ ఇన్నీ కావు. స్త్రీ అంతరంగ గంగనూ ఎంత తిరగ దోడినా మగాడి మనసనే చేదకు
దక్కేది రవ్వంత బొట్టే!
హృదయంతో
కాకుండా పెదవులతో కొలవబోతే కోమలి కొలతలకు ఏనాడూ అందదు. యుగయుగాలుగా చిక్కుబడ్డ స్త్రీ-పురుష సంబంధం
చక్కబడాలంటే మగవాడికి కావాల్సింది ఒక్క నేర్పే కాదు! కష్టానికి సుఖానికి విడిపోకుండా వుండే ఓర్పు.
అప్పడాల
కార్ట్యూన్లు కేవలం మగాడి మనోవికార సూచితాలే! అసలుకు అప్పడంలా నలుగుతున్నది స్త్రీ జాతి మగాడి అహమనే కరకు కోరల మధ్యన చిక్కి . చంద్రమతి నాటి సత్యకాలం నుంచి.. దివ్య
దిశాల ఈనాటి కలియుగం వరకు వ్యథ ఒకేలా సాగుతున్నది.. వ్యక్తీకరణల్లోనే
ఆధునికత.. వైవిధ్యం!
సునీతా
మిలియమ్స్, నైనా సెహ్వాలు, మలాలా, ఇందిరా ప్రియాంకాలు, ఇంద్రా
సూకీ.. ఎన్ని కోట్ల మందిలో
కొట్లాడి పరజితులవగా చివరకు
గెలిచిన విజేతల జాబితాలో కనిపించేది?
నిన్నటి దాకా
వంటిళ్ళు, పడగ్గదుల వరకే పరిమితమై నోరు
విప్పే అవకాశం లేని నారి తంటాలు. విశాల ప్రపంచంలోకి వచ్చి
పనిపాటలు చేసుకోక తప్పని ఆర్థిక వాతావరణంలోనూ మారని దుస్థితి! మగవాడి మదమాత్సర్యాల
మూలకంగా ఈనాటికీ ఆడదాని పరిస్థితి ముల్లు పక్కన అరటి ఆకు అధోగతే! ఇదే వాస్తవ
పరిస్థితి!
ఆత్మరక్షణకు
మహిళలు వాడుకునే 'పెప్పర్ స్ప్రే' పార్లమెంటు వాడకం వరకూ పెరిగిందే కానీ,
ఆత్మగౌరవానికై మహిళకు హామీ ఇచ్చిన 'రిజర్వేషన్ బిల్లు'
అదే పార్లమెంటులో ఎన్నో దశాబ్దాల బట్టి పెండింగులో పడివుంది! 'చీపురు కట్ట'కు దక్కిన రాజకీయ గుర్తింపు ఆ చీపురే అనాదిగా
ఆయుధంగా వాడే స్త్రీ జాతికి ఇరవైఒకటో శతాబ్దం వచ్చినా దక్కకపోవడం.. మగాడి హిపోక్రసీ బుద్ధి.. రంగులు మార్చే ఊసరవెల్లి చెల్లికి అక్క అవుతోందని తేటతెల్లమవడంలా!
'అబల' అనగానే లబలబలాడటమే గానీ, మగవాడి పెత్తందారీ కచేరీలో ఆడదాని పరిస్థితి 'తబలా' కు మించి ఏం మెరుగ్గా ఉందని!
'ఆడ పుటక'మగ సమాజం పానకంలో ఇంకా పుడకలాగే ఉంది.
'తిరిగి ఆడది .. తిరక్క మగాడు' చెడతారన్న మనువు సూత్రం మంట గలిసేదాకా ఆడది తిరగబడి ప్రశ్నించడం కొనసాగాల్సుంది అందుకే!
ఏడాదికి ఏదో
ఓ ఎన్నిక చేసుకున్న రోజు మహిళా దినోత్సవం జరుపుకోడం కాదు.. ఏడాదంతా మహిళకు ఉత్సవంలా సాగాలంటే ముందు
మగవాడి అంతరంగానికి శాశ్వతంగా మరమ్మత్తు చేసే చాతుర్యం కావాలి!
-కర్లపాలెం
హనుమంతరావు
(2014 లో
మహిళా దినోత్సవానికి (మార్చి 8) కి రాసిన వ్యాసం)
No comments:
Post a Comment