Sunday, December 12, 2021

ఈనాడు - హాస్యం - గల్పిక - వ్యంగ్యం వేడుకోలు - వీడుకోలు కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 31 - 12 -2010 ) పదీ! గుర్తుందా


ఈనాడు - హాస్యం - గల్పిక - వ్యంగ్యం 

వేడుకోలు - వీడుకోలు 

కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 31 - 12 -2010 )  పదీ! గుర్తుందా 


ఈ ఏడాది? మా ప్రధాని లాగా అదేపనిగా రెండు వేళ్తు ఊపుకొంటూ నా గది గోడ మీద ఇదేవేళ కొత్త క్యాలెండరులా నువ్వు  నవ్వుతూ కని పించినప్పుడు- సాధించబోయే అభివృద్ధి శాతానికి సూచనేమో అనుకున్నా! 


పెరగబోయే ద్రవ్యోల్బణానికో, రెండో తరం విద్యుదయస్కాంత తరంగాల కుంభకోణానికో సింబాలిక్ హెచ్చరిక అదని నాకేం తెలుసూ? 


పొద్దస్త మానం టూజీ.. బూజీ అంటూ కలవరిస్తుంటే అది సోనియాజీ, రాహుల్  జీ గురించి అని గ్రహించలేకపోయా!


ఈ దశాబ్దం మాంద్యాన్ని తెచ్చిపెట్టింది. ఉద్యోగాల కోసం అగ్రరాజ్యాలే మనల్ని అడిగే చమత్కారం చూపెట్టింది. ఓడల్ని బళ్లూ, బళ్ళను ఓడలూ చేసింది. ఇంతకీ మేరా మహాన్ భారత్ ఓడో, బండో తేలకుండా ఉంది. 


ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. ప్రపంచ వ్యాపార కేంద్రాన్ని ఢమాల్మని పేల్చిపారేయడంతో మొదలు పెట్టిన ప్రళయక్రీడ... రెండు కొరియాల మధ్య కొరివి మంటలు పెరిగిందాకా ఆగలేదు కదా! 


భూమిభారం తగ్గించడానికి కొత్త జబ్బులు అంత అవసరమా? ఒక వంక ప్రాణాం తక వ్యాధులకు పసుపు కొమ్ములతో మందు కనిపెడుతుంది. మరోవంక హంతక ముఠాల చేతికి వింతవింత అణ్వాయుధాలు అందిస్తుంది! 


ఒక దిక్కున అరనిమి షంలో ఆరు ఖండాలకు అత్యంత వేగంగా పాకే సమాచార సామర్థ్యాన్ని సాధిస్తుంది... 


మరోవైపు కట్టెదుటే ఉన్న మనిషిని పలకరించకుండా కట్టెలా నీలుక్కుంటుంది! 


పాత దశాబ్దీ ! నీ సంస్కరణల పుణ్యమా అని లోకం చిన్నదైతే అయి ఉండవచ్చుగానీ- మనిషి మనసు మాత్రం మరీ చిన్నదైపోయింది. తారామండలాల్లో కొత్త కొత్త సూర్యులు ఉదయిస్తున్నకొద్దీ భూమ్మీద యుద్ధాలు, సునా

మీలు, భూకంపాలు, వరదలూ, గనులూ, సెజ్జుల దెబ్బకు ఊళ్ళకు ఊళ్లే మాయమైపోతున్నాయి! 


మనిషి ముఖాన్ని పోలికపట్టే సాఫ్ట్ వేర్  నువ్వు సాధించగలిగావు గానీ.... మనిషికి సుఖాన్ని తెచ్చే సాధనాన్ని మాత్రం శోధిం చలేకపోయావు! 


పదవిపోయేలోపలన్నా ఏ పైరవీ లేకుండా జనం పనులు చేసి పెట్టే సర్కారులను సృష్టించలేకపోయావ్! గురు, అంగారక, చంద్రగ్రహాలపై అక్కడెక్కడో నీళ్ళున్నాయని చంకలు గుద్దుకుంటున్నావుగానీ... ఇక్కడ మనిషి గుక్కెడు నీళ్ల కోసం వాగులు వంకలూ తడుముకుంటున్నాడని తెలుసు కోలేకపోయావు ! 


రెండువందల పదీ! పోయేకాలానివి. ఎందుకులే నిన్నాడిపోసుకోవడమని ఎంత ఆపుకొందామనుకున్నా మా భోపాల్ గ్యాసు గుర్తు కొచ్చి మనసు ఉడికిపోతుంది. 


కోటి మారుతీ కారు  అమ్ముకున్నానని గొప్పలు పోతున్నావుగానీ, తిరిగే మామూలు బస్సుల్ని నాలుగు పెంచమంటే నలు దిక్కలా  చూశావు. 


వర్కర్లు ఆందోళనలు చేస్తుంటే- ఎమ్మెల్యేలు, ఎంపీల జీతభత్యాలు పెంచావు. దారిద్య్రరే ఖను కిందకు పడలా గేసి, దేశంలో ధనవం తుల శాతం పెరిగిందని దబాయిస్తావా? ఇంక కుంభకో ణాల చిట్టా విప్పితే ప్రధాన శీర్షికలు చదవడానికే ఈ ఏడాది మొత్తం చాలదు. 


దేవుడి సొమ్ముకే నామాలు పెడుతున్న పోయేకాలం నీది. రైళ్లు, విమానాలు, వంతెనలు, గనులు, అంతరిక్ష నౌకలు కూలిపోవటంలో నీదే రికార్డు. 


రెహమానూ, సచినూ, నెహ్వాల్ కన్నా  రాడియాలు, కోడాలు, రాజాలు, కల్మాడీలే మీడియా ఆకర్ష ణలు. ఫేస్బుక్ బర్గ్ కన్నా వికీలీక్సు అసాంజీకే అభిమానులెక్కువ. 


ఎన్నికల సంగతలా ఉంచు... అసలు ఎన్నికల యంత్రాలమీదే నమ్మకం పోయింది జనాలకు.  సహస్రాబ్దిలో పెద్ద సూర్యగ్రహణం, పదేళ్లకోసారి మొదలయ్యే అతి పెద్ద జనగణన తప్ప... కాలమా! నువ్వు కాలరెగరేసుకోవడానికి ఇంకేం ఉన్నాయి చెప్పు! 


పాపం...పోయేకాలానివి- నువ్వు మాత్రం ఏం చేస్తావులే! విధా


విధాయకం కనుక విన్నవించుకుంటున్నా... కొత్త సంవత్స

రమా... కాస్త కునికిపాట్లు మాని శ్రద్ధగా వింటావా? వేళకు వానలు పడాలి. పిల్లల పరీక్షలు జరగాలి. నీళ్ళ ట్యాపులూ, పరీక్ష పేపర్లు లీక్ కాకూడదు. ఉప్పులేని తిరు పతి లడ్డు కావాలి. మంచి సినిమాలు రావాలి.  జనం మంచిభాషనే మాట్లాడాలి. రాత్రిళ్ళయినా కరెంటు కోతవద్దు. యాసిడ్ సీసాలకు కరవు రావాలి. పిల్లలు ఏ కేసుల్లో ఇరుకోక్కుండా చక్కగా చదువుకోవాలి. ఉల్లితో సహా అన్ని సరకుల ధరలు దిగి రావాలి. ఉద్యోగాలు, ప్రయాణాలు క్షేమంగా సాగాలి. బళ్లో పంతుళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు నిండుగా ఉంటే మంచిది. దీక్షలు, ధర్నాలు తగ్గుముఖం పట్టాలి. చేనేతకు చేయూత కావాలి. రైతుకు మద్దతు ధర పెరగాలి.....


అదేఁ... అర్ధాంతరంగా అలా లేచిపోతామేంటి నూతన సంవత్సరమా! రైతును ఆదుకోవడానికి ఏమైనా అభ్యంత రమా? సరే వినకపోతే మానె, కనీసం నా విజ్ఞాపన పత్ర మన్నా భద్రంగా దాచుకో! పైఏడాదికి ఇదేవేళలో, మరో కొత్త ఏడాదికి సమర్పించుకోవటానికైనా ఉంటుంది. 


రెండు వేల పదకొండూ! నీకు పుణ్యం ఉంటుంది... మళ్లా  నాకు నామాలు పెట్టకుండా చల్లగా ఉండు. అదీ నా వేడు కోలు. రెండు వేల పదీ... ఇదే నీకు వీడుకోలు!


కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 31 - 12 -2010 ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...