క్రూర గాయాలు
- కర్లపాలెం హనుమంతరావు
( ధరల ఉగ్రవాదం పేరుతో ఈనాడు దినపత్రిక - సంపాదకీయ పుట- 28 - 12 - 2010 లో ప్రచురితం )
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి భార్య అంతటివారే ఉల్లి. పాయలు కొనడానికి బ్యాంకు అప్పుకోసం పరుగెత్తినప్పుడు, మామూలు మధ్యతరగతి గృహిణి కప్పు పంచదార కొనుక్కునేందుకు ప్రపంచ బ్యాంకు దాకా పోయి రావాలేమో!
కిలో బియ్యం మూడు రూపాయలకు ఇస్తామన్న ఎన్నికల వాగ్దానం ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు మన పాలకులు పావుకిలో టమోటా పాతిక రూపాయలకు పెంచేసి పె ట్టారు.
ఎక్కడో ముంబయిలో ఉగ్రవాదులు బాంబులు పెట్టబాతున్నారని అప్రమత్తమైతే చాలదు. ముందిక్కడ పేలబోతున్న కూరగాయల బాంబుల సంగతి చూసుకోండి బాబులూ! ఉప్పుబాంబో మిరపబాంబో పేలిందంటే దేశమంతా బీభత్సం. శాంతిభద్రతలు ఆనక.. ముందు ఆహార భద్రత ముఖ్యం. అరె!
ఉల్లి దోశ తినాలన్నా ఏ బిర్లా కడుపునో పుట్టాలంటే ఎట్లా? టాటాగారూ! టాటాకారు లక్షరూపాయలకోటి రేటుండేది కనిపెట్టే కన్నా కరివేపాకు కట్టోటి కనీసం ఐదుకైనా దొరికే దారి వెఅికి పెట్టండి సారూ! వోగ్స్ వ్యాగెన్లూ, ఫ్యాబ్ సిటీలు ఎట్లాగూ పోయాయి. ఉద్యోగాలు, ఉపాధిపథకాలు, ఉపకార వేతనాలు ఎట్లాగూ ఇప్పించలేక పోతున్నారు . కనీసం నూనె, ఉప్పుకారాలైనా తిప్పల్లేకుండా ఇప్పిచ్చండి సారో !
ఇంగువ డబ్బీ కోసం ఇంటిళ్లాళ్లు కొంపెక్కి ఆందోళన చేస్తుంటే ఆనందంగా ఉందా మహాప్రభో ! అరవైపెడితేగాని అరకిలో ఆలుగడ్డలు రాని ఈ గడ్డ మీద నిలబడాలంటేనే నిజంగా సిగ్గుతో చితికి పోవాల్సొస్తుంది.
ఎన్నిక లంటూ అర్థాంతరంగా ఇంటి ముందుకొచ్చి నిలబడితే నిలబడ్డవాల్లందరికీ ఈసారి నిజంగా గడ్డు పరిస్థితే!
వెయ్యి రెండు వేలంటే ఏ ఆఫ్ఘనిస్తాన్నుంచో అచ్చేయించుకొచ్చేయచ్చు. కానీ, ఇంటి కో కూరగాయల తట్ట దింపి పొమ్మంటే! .. కొంప కొల్లేరవడం ఖాయం.
వంకాయ కిలో అరవైపెట్టి కొనే స్తోమతు లేక వచ్చిన అమెరికా మంచి సంబంధాన్ని తిరక్కొట్టేసింది మా పెద్దక్కయ్య. కాలూ చెయ్యీ ఆడకున్నా ఆస్ట్రేలియా దాకా పాక్కుంటూ పోయాడు మా పెచ్చి బాబాయ్ చివర్రోజుల్లో అయినా చారెడు ఉలవచారు మనసారా తాగి పోవాలని.
చెబితే మరీ అతి అనుకుంటారు . కానీ, మా
దోస్తు పరమేశ్వరంగారింట్లో పడ్డ దొంగలు బీరువా తలుపులు బార్లా తెరచిఉన్నా పట్టుబట్టల్ని, బంగారాన్ని పట్టించుకోకుండా వంటింట్లో ఉన్న గ్యాస్ బండను దొర్లించుకుపోయారయ్యా !
కాశీదాకా పోయి, తినే కంచాన్ని ఏ గంగలోనో కలిపొచ్చిన వాళ్ళకు తప్ప ఈ పెరిగే ధరలతో తిప్పలుతప్పటంలేదు.
నాలుగు చినుకులు పడనీయండి, ధరలు వాటంతటవే నీరు కారిపోతా యని స్వామి చిదానందులవారి ధర్మప్రబోధాలు ! సన్నాసులు సూక్తులు వినేటందుకా సంసారులిలా విలువైన ఓటును వృథా చేసుకోడం?
అయ్య! ఆ జగన్నాథ రథచక్రాలు ఆనక తీరిగ్గా భూమార్గం పట్టిద్దురు గానీ, ముందు ఆకాశ మార్గం పట్టిన ఈ అపరాల పీక పట్టుకుని నేలమీదకు దింపుకు రండయ్య !
సర్కారు స్వాములా! ధరలను అదుపు చేయడానికి మించి దేశభక్తి మరోటి లేదు ప్రస్తుతానికి . ఒక్క పూటైనా రెండువేళ్లూ నోట్లోకి పోయే ఏర్పాటు చేస్తే అంతకు మించిన ప్రజాసేవా మరోటి ఉండబోదు.
ఆనాడు ఆ వేములవాడ భీమకవి ఏమని తిట్టిపోసాడో ! ఇప్పుడు నిజంగానే జనం ముందున్న కంచాల్లో అన్నం సున్నంగా, అప్పాలు కప్పలుగా కనబడు తున్నాయి.
సింగిల్ ప్లేట్ భోజనం కోసం డబుల్ బెడ్రూం ప్లాట్ కుదవ పెట్టాల్సిన రోజులు అట్టే దూరంలో లేవు.
బ్యాంకు లాకర్లలో ఇంతదాకా భద్రంగా దాచుకున్నదంతా లాగేసి, వాటితో నాలుగు ఆకుకూరలు, కాయగూరలు కొని దాచుకోకపోతే రాబోయే రోజుల్ని కాచుకోవటం కష్టమే!
ధరలు, దొరలు స్థిరంగా ఉండని ఈ పూర్ణగర్భలో గంజిలో ఇంతా ఉప్పుకలు, ఉల్లిగడ్డ నంజుకు తినేవాడికన్నా ఆగర్భ శ్రీమంతుడు ఇంకొకడు ఎవరుంటారు చెప్పండి!
ఆకాశంలోకి దూసుకొనిపోవడానికి రాకెట్లు సిగ్గుపడుతున్నా గానీ- అపరాల రేట్లు ఉత్సాహపడుతున్నాయి. అదుపులేని ధరలు పది అసమ్మతి నేతల పెట్టు. కేంద్రంలోని సర్కారు ఊపిరి తీసే ముసలం అదే కావొచ్చు .
'కూరగాయాలు' కాకుండా సర్కారు ముందే మేలుకుంటే మంచిది!
- కర్లపాలెం హనుమంతరావు
( ధరల ఉగ్రవాదం పేరుతో ఈనాడు దినపత్రిక - సంపాదకీయ పుట- 28 - 12 - 2010 లో ప్రచురితం )
No comments:
Post a Comment