Saturday, December 4, 2021

కాలర్ ఎత్తుకు తిరగాలి - ఈనాడు - హాస్యం

 



' కాలర్ ' ఎత్తుకు తిరగాలి! 

- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సంపాదక పుట 05 - 09- 2011 - ప్రచురితం ) 


'పాపం మన పిల్లకాయల్ని చూస్తే  జాలేస్తుంది బాబాయ్. సముద్రాలు దాటిన అమాయకంగా ఆ లోయ చదువుల్లో పడిపో యారు. స్కాలర్లు అవుదామనుకుని కాళ్ళకు అనేవో ' రేడియో కాలర్లు' తగిలించుకున్నారు . ప్రారబ్ధం కాకపోతే, పట్టాలు సాధించాలని వెళ్ళినవాళ్ళ కాలికి ఈ జీపీయన్ పట్టీలు పడటం ఏంటో? 


ప్రాసలో నువ్వు బాధపడటం వినేవాళ్ళకు బాగానే ఉంది. గానీ, దేశం కాని దేశంలో ఆ పిల్లలు పడే ప్రయాసను అర్ధం చేసుకోవడం లేదురా అబ్బాయ్ నువ్వు!  సిగ్గుమాలిన ఆ విశ్వ విద్యాలయాలు చేసినవనికి మనం సిగ్గుతో తలొంచుకోవాల్చిన పనేముంది చెప్పు!  పాజిటివ్ గా ఆలోచించుకోవడం ముందు మనం నేర్చుకోవాలి. గురజాడవారి గిరీశం ఏమన్నాడు ? వేర్ యీజ్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ క్రియేషన్ వుచ్ డజ్‌ నాట్ సెర్వ్‌ ది  పర్పజ్- అనలేదూ!  అమెరికావాడిచ్చిన సెల్లులు మన మెడల్లో గొలుసులుగా వేళ్ళాడదీసుకుంటున్నాం. అదే పంథాలో  ట్రాకర్లనూ, కాళ్ళకు వేసుకునే మేజోళ్ళు అనుకుంటే ఈ గోలే ఉండదు కదా!


నువ్వన్నీ ఇలాగే ఏమిటేమిటో ఉల్టాగా  చెబుతుంబావ్  బాబాయ్! అచ్చోసిన ఆంబోతులు  వెంట  పడకుండా ఇలాంటి ముందరి కాళ్ల బంధనాలు  తగిలించే వాళ్ళట పల్లెల్లో మనాళ్ళు.  పిచ్చివాళ్ళకు, పశువులకు, దొంగలకూ వేసే కాలి సంకెళ్ళను మువ్వల గజ్జెలసుకుని మురిసిపొమ్మంటావా ఏంటి మరీ విడ్డూరం కాకపోతే! 


ఆ ఇంగ్లీషువాళ్లు  తమ అవసరాల కోసం కనిపెట్టుకున్న వాటినల్లా మనం మనకు అవసరం ఉన్నా లేకపోయినా తెచ్చి ఇక్కడ అందరికీ గొప్పగా చూపించుకోవడంలా? అల్లాగే  కాలర్లనూ మనం మన అవసరాలకు తగినట్లుగా ఉపయోగిం చుకోవడంలో తప్పు..  ముప్పు ఏమిటి?


పుల్లుగా మందు కొట్టేవాడు ఎప్పుడు ఎక్కడున్నాడో తెలు సుకునేందుకు వాడుకునే ఈ ట్రాక్టర్లతో మనకు ఏ అవసరాలు ఉంటాయంటావ్‌బాబాయ్ ? 


బోలెడన్ని ప్రయోజనాలురా బాబూ!  త్రేతాయుగంలో ఇలాంటి ఆచూకీ తెలిపే సాధనాలు లేకపోబట్టేగదా. . రావణాసురుడు ఎత్తుకెళ్ళిన సీతమ్మవారు ఎక్కడుందో తెలుసుకోలేక రాములవారు అంతగా కమిలిపోయింది! ఇప్పుడీ  కాలంలో కూడా ఇలాంటి ట్రాకర్లుంటే ఎంత సుఖంగా ఉంటుందో తెలుసుకో..! 


అలా అడుగు బాబాయ్! గడగడా వప్పచెప్పే స్తా . ఒపిగ్గా విను ! రాజకీయాలు ఇవాళా  రేపూ  ఎలా గున్నాయ్?  ఎవరేపూట ఏ పార్టీలో తిరుగుతున్నారో అధికనాయకులకు  తెలీక తలలు పట్టుకుంటున్నాము!  లేదా కార్యకర్తాల  కాళ్ళకు ఇలాంటి చిన్నచిప్పు ఒకటి తగిలిస్తే వాళ్ళ కదిలకలను ప్రతిక్షణం కనిపెట్టుకుంటూ అప్రమత్తంగా ఉండొచ్చు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశాక, అలిగి అజ్ఞాతంలోకి వెళ్ళి పోయే నాయకులు కాళ్ళకో చేతులకో ఇలాంటి కాలరేమన్నా  ఉంటే ఎక్కడున్నారో తెలుసుకుని వెళ్ళి బుజ్జగించే కార్య క్రమం చేపట్టవచ్చు.  అభివృద్ధిని పరిశీలించటానికి విదేశాలకు బయలుదేరే బృందాలు నిజంగా ఏ స్విట్జర్లాండులో దిగారో లేదో తెలుసుకోడానికి ఇంతకు మించిన మంచి సాధనం ఇంకే ముంటుంది బాబాయ్ ? సర్కారు సొమ్ము మీద విజ్ఞాన విహార యాత్రలకు బయలుదేరినట్లు పెట్టే  దొంగబిల్లుల చెల్లింపులకు స్వస్తి చెప్పేయచ్చు....  రాష్ట్ర సమస్యలను మాత్రమే  చర్చించటానికి వెళుతున్నామని బుకాయించే ప్రజాప్రతినిధులు నిజంగా కేంద్రమంత్రులతో మాట్లాడుతున్నారో, ఆంధ్రాభవన్లో పేకాడుకుంటూ కూర్చున్నారో ఈ సాధనంతో తెలుసుకోవచ్చా లేదా ? మామూలు రోజుల్లో ముఖ్యుల వెంట నీడలాగా మసలే అదృశ్య హస్తాలు, అవసరం పడినప్పుడు మాయమైపో

తున్నాయి గదా..  అలాంటి శక్తులకు  కాళ్ళకో  చేతులకో ఇలాంటి ట్రాకర్లు తగిలిస్తే కనిపెట్టడం సులభమవుతుందా లేదా?


నీవు చెబుతుంటే నిజమేననిపిస్తోంది బాబాయ్ ! కదలికల గుర్తింపు సాధనలు రాజకీయంగా మనకూ మంచి ప్రయో జనకరం అనిపిస్తున్నాయి.


ఒక్క రాజకీయంగానే కాదురా అబ్బాయ్ ! సగటు మ మనిషికీ  తట్టెడు  ఉపయోగాలు. మొగుడు మందు కొట్టడానికి ఏ బారు చూరు పట్టుకు వేలాడుతున్నాడో తెలుసుకునేందుకు  ఈ చిప్పులు ఆడవాళ్ళకు పనికొస్తాయి. పిల్లాడు కాలేజీలోనే  ఉన్నాడో.. సినిమాహాలు క్యూలో నింబడి ఉన్నాడో తెలుసుకోవడానికి తల్లిదండ్రులకు చక్కగా పనికి వస్తుందిది. బయ టకు వెళ్ళిన ఆడపిల్ల ఎక్కడ ఎంత భద్రంగా ఉంటుందో తెలుసుకోవడానికి అక్కరకొచ్చే సాధనంరా ఇది అబ్బాయ్ ! మొన్న సంక్రాంతి పండుగ రోజుల్లో రథంముగ్గు వేసుకుంటూ మీ ఆవిడ ఎక్క డికో వెళ్ళిపోయిందని నువ్వెంత కంగారుపడ్డావో  గుర్తుందా! ఇట్లాంటి  పట్టీ ఒకటి కాలికి పట్టాల్లాగా చుట్టుకొని ఉంటే ఆమెకోసం ఏడే వెతుకులాట తప్పి ఉండేది కాదా ? ట్రాఫిక్కులో నువ్వెక్కడన్నా.  ఇరుక్కుపోయినా ఇంట్లో వాళ్ళకు కంగారుపడాల్సిన ఖర్మఉండదు- ఈ పట్టీ గానీ నువ్వు తగిలించుకుంటే. 


నిజమే కానీ బాబాయ్.. ఇలాంటివి మా కార్యాలయాల్లో కూడా ప్రవేశపెడితే మస్టర్లో  సంతకంచేసి క్యాంటీన్లో కూర్చోవడం తగ్గుతుంది.


దార్లోకొచ్చావ్. బళ్ళలో పంతుళ్ళు, ఆసుపత్రుల్లో వైద్యులు పనివేళల్లో ఉండేలా చూడటానికి ఇంతకుమించిన మంచి సాధనంలేదు..


బ్యాంకులోన్లు ఇచ్చేముందు అప్పు తీసుకున్నవాడి కాలికి ఇలాంటి చిప్పు ఒకటి తగిలిస్తే- మొండి బకాయీల బెడదా బాగా తగ్గిపోతుందిగా బాబాయ్! 


నీ బుర్ర పాదరసంలాగా ఎలా పనిచేస్తుందో చూశావా ఇప్పుడు!  నిత్యానందస్వాముల్లాంటి వాళ్ళ కాళ్ళకూ ఇలాంటి కచ్చడాలు తగిలిస్తే వీడియోలో ఉన్నది నకిలీనో కాదో తెలి సిపోతుంది. న్యాయస్థానాల పని తేలికవుతుంది.  నేను చెప్పే దేమంటే, ఈసారి మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్న ప్పుడు పెళ్ళికొడుకు కాళ్ళకు రేడియో కాలరుందో లేదా ముందుచూడు. లేకపోతే ఒకటి కట్టుకున్నదాకా సంబంధం ఖాయం చేసుకోకు సరేనా??


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సంపాదక పుట 05 - 09- 2011 - ప్రచురితం ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...