Sunday, December 12, 2021

ఏప్రియల్ ఫూల్స్ -కర్లపాలెం హనుమంతరావు

 

ఏప్రియల్ ఫూల్స్

-కర్లపాలెం హనుమంతరావు 

 

గతంలో అమాంతం లాక్ డౌన్ విధించేసిన తరువాత ఎదురైన చేదు అనుభవాలు ఇప్పుడు మన ఛాతీ వీరుడిని వెనక్కు లాగినట్లున్నాయ్.. మొన్న మంగళవారం టీవీలో జనం ప్రతినిధిగా  వచ్చి నూట పాతిక కోట్ల మంది నెత్తిన  ఒకేసారి ఎత్తి పోసిన చెత్తలో ఏరుకుంటే పనికొచ్చే పీస్ ఒక్కటంటే ఒక్కటే.. లాక్ డౌన్ లు.. గీక్ డౌన్ లు ప్రస్తుతానికి జాన్తానై..   అంటూ జనతాకిచ్చిన ఊరట! 

 

కోవిడ్ వైరస్ రెండో దఫా ఉధృతాన్ని ఆర్థికంగా గానీ, మరో పద్ధతిలో గానీ  తట్టుకునే ప్రణాళిక మన ప్రధానిగారి దగ్గరేదీ ప్రస్తుతానికి  లేదు. ఉన్న ఎత్తుగడల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఈ సారి ఈ కరోనా బండరాయిని   గుండెల మీద పెట్టుకోకూడదనే. ప్లస్ ఈ నష్టంలో నుంచి కూడా కాస్తో కూస్తో పొలిటికల్ మైలేజీ పిండుకోవాలనీ! ఇంతోటి గొప్ప సందేశం జాతి చెవిలో ఊదడానికి ఎన్ని డొంక తిరుగుళ్లో.. ఎప్పట్లానే! కొంపలు తగలడుతుంటే ఫైరింజన్ డ్రైవర్ ‘ఎవరి చెంబుతో వాళ్ళు నీళ్లు తెచ్చేసుకుని సుబ్బరంగా  నిప్పునార్పేసుకోవచ్చ’ని  తీరిగ్గా తీర్మానం చేసినట్లన్నమాట!  గారడీ కబుర్లతో ఫీట్స్ చేసేందుకు  మన ప్రధాని ఎవరడీ.. ఆల్ రడీనే కదా!

 ఒకళ్ల నుంచి ఒకళ్ళ పాకే అంటురోగాన్ని ఎవరికి వాళ్ళుగా, ఏ ఇంటికి ఆ ఇల్లుగా, ఏ పేటకు ఆ పేటగా, ఏ ఊరుకు ఆ ఊరుగా.. చివరికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా మటుమాయం చేసేసుకోడానికి మాయమంత్రాలను మాత్రమే ఇహ జనం నమ్ముకోవాలని ప్రధానిగారి మన్ కీ బాత్ సూచన! మా నాయనమ్మ తద్దినానికి సెలవిమ్మని అడిగితే .. ఇప్పుడు కుదరదయ్యా!.. వచ్చే వారం పెట్టుకో నిక్షేపంగా!' అని సలహా ఇచ్చిన బాసు చందం!

లక్షలాది శాల్తీలు ఇక్కడ కరోనా కమ్ముకొని లేచిపోతుంటే.. వల్లకాళ్లు కూడా వీళ్లను కడుపులో దాచుకోడం మా వల్లకాదని కన్నీళ్ళు పెట్టుకుంటుంటే.. ఎప్పుడో మే ఒకటికి కుర్ర్రకారందరికి టీకాలు ఇప్పిచ్చేస్తానని హామీ! మబ్బులో నీళ్లు చూపిస్తే.. చెంబులట్టుకుని నిలబడ్తారని జనం మీద ప్రధానికి బోలెడంత విశ్వాసం. గత చరిత్ర దగా కూడా అట్లాగే ఉంది గదా మరి! 

 తీసుకున్న టీకానే పని చేస్తుందో లేదో తెలీక తికమకగా ఉంది గదా  ఇక్కడంతా.  జనం కరోనా రోగంతో బాల్చీ తన్నేస్తుంటే.. ఇంకేదో పక్కనొచ్చే బుల్లి రోగాల పేర్లు గిలికి  వాటితో పోయారని నివేదికలిచ్చే తమాషాలకు తెరలేపాయి చాలా రాష్ట్రాలు! ఎవరికి వాళ్ళు అప్రమత్తంగా లేకపోతే మళ్లీ లాక్ - డౌనే అని ప్రధానిగారు చిన్నబళ్లో అయ్యవారులా బెదిరించడం వింటుంటే .. జనాలకు కొత్తనుమానాలు కూడా మొదలయిపోయాయ్.. ‘లాక్ డౌన్ ముందస్తు నివారణా చర్యా? ముషీరాబాద్ సెంట్రల్ జైలు టైపు శిక్షా?’ ఆవటా అని! రాబోయే రోజులు మరింత దారుణంగా ఉంటాయనికి బెదరించడానికా 'అచ్ఛే దిన ఆనే వాలా హైఁ' మార్క్ ప్రధానిగారు పనిమాలా రాత్రిపూట  ప్రసంగాలు! నిష్క్రియాపరత్వం ఎంత పెద్ద దురభిమానగణాలున్నా సరే దెబ్బ కొట్టితీరుతుంది. అమెరికన్ ట్రంపే అందుకు మన ముందున్న లేటెస్ట్ ఉదాహరణ!

కరోనా క్రిమి  ఎన్నికల కమీషన్ కాదు, క్రిమినల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అంతకన్నా కాదు.. గదమాయిస్తే గమ్మున చెప్పిన వాళ్లని  మాత్రమే గమ్ములా తగులుకోడానికి కనీసం కొలీజియమ్ లో  దూరి ఏ సిజెఐ పోస్టుకో వెయిటింగులో ఉన్న  చెట్టు కింది ప్లీడరైనా కాదు.  

ఏక మొత్తంగా కేంద్రమంతా మందీ మార్బలంతో దిగొచ్చేసి ఏదో ఘనకార్యం చేసేస్తుందని ఎంత వెర్రివెంగళ్ళప్పా ఇప్పుడున్న గడ్డుపరిస్థితుల్లో  కలలో కూడా అనుకోడు. కానీ, కనీసం తన వంతు మార్గదర్శక పాత్రయినా కొంత పోషిస్తుందని ఆశగా ఎదురుచూస్తాడు. చూశాడు కూడా. కానీ, ఏమయింది? వెరీ శాడ్!  ఉత్తుత్తి పెత్తనానికైనా ఉత్తరకుమారుడి మించి వణికిపోతోంది జనం తననే ఏకపక్షంగా ఎన్నుకున్నారని నిత్యం డబ్బాలు కొట్టుకునే ప్రగల్భాల ప్రభుత్వం.

 

ప్రధాని హోదాలో మోదీ వచ్చి చెప్పాడనా దేశంలోని స్వచ్ఛంద సేవా సంస్థలు చాలా బాధితులకు తమ స్థాయికి తగ్గ సేవలు నిస్వార్థంగా అందిస్తున్నది! బైటి శక్తుల   చురుకుపాలు ఎక్కువయే కొద్దీ .. జనాలెనుకున్న ప్రభుత్వాలకే నామర్దా.. ప్రభుత్వాల కార్యాచరణలోనే ఎక్కడో లూప్ హోల్సున్నాయని  బైటపడిపోడానికి! 

ఇప్పుడున్న ఆక్సిజన్ , టీకా మందు కరువు పరిస్థితులకే దిక్కులు చూసే కేంద్ర ప్రభుత్వం మే ఒకటి నుంచి మొదలయ్యే  తాకిడికి ఎట్లా తట్టుకుంటుందో మరి.. ఆ తామాషా కూడా చూడాల్సిందే! ఆరోగ్యశాఖ పెద్దలకు ఆక్స్ ఫర్ద్  పట్టభద్రులైనా సరే.. వట్టి దద్దమ్మలు! ప్రయివేట్ రంగ  ఉత్పత్తులపై  కొద్ది కాలమైనా  పూర్తి నియంత్రణ తీసుకుంటే బోలెడన్ని సమస్యలు పరిష్కారమైపోతాయ్! కానీ బాధ్యతలు జనాలెనుకున్న మన ప్రభుత్వాలకు ఎప్పుడూ భారమే!  గుర్రం గుడ్డిదైనా సరే.. దాని మెడకో  కాడేసి  తామే సర్వం భరాయిస్తున్నట్లు ఫోజులివ్వడానికి మాత్రం రడీ మన ప్రభుత్వ సర్వెంట్లు!

మేటర్ ట్రాక్ తప్పక ముందే మళ్లీ మన ప్రదాని ప్రసంగం దగ్గరికొచ్చేద్దాం.  సగం రాష్ట్రాలకు ఉచితమని ఊరిస్తున్నా అ ఎరలన్నీ  సర్కారీ పెద్దల అనుకూలతల వరకే! ఆ తరువాత అంతా స్టాప్! కరోనా టీకా ఉత్పత్తు మరింత వేగంగా పెంచాలన్న ఉద్దేశంతో.  ప్రయివేటు రంగాలకు నాలుగున్నర వేల కోట్లు సాయమందిస్తోంది కేంద్రం. రాష్ట్ర్రాల దగ్గరి కొచ్చేసరికి  మాత్రం మొండి చెయ్యి చూపిస్తోంది! సరుకు డబ్బిచ్చి కొనుక్కోవాలనడంలోనే   కేంద్ర పెద్దల దుర్బుద్ధి బయటపడ్డంలే! అర్థికంగా బలమైన రాష్ట్రాలు సొంతంగా ఉచిత టీకాల కార్యక్రమం విజయవంతం చేసుకుంటే.. అనేక ఇతరేతర కారణాల వల్ల కొన్ని   రాష్ట్రాల మీద వత్తిడి పెరుగుతుంది. (18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సిన్‌లంటూ యుపి ప్రకటించించేసింది అప్పుడే!) అగ్గిపుల్ల వెలిగించి వెన్నముద్దను కరగద్దని గద్దించినట్లుంది కత. రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి పార్టీపరంగా లబ్దిపొందే వ్యూహం అవసరమా ఇంత సంక్షోభ సమయంలో కూడా!

వ్యాక్సిన్ల కొరత, టీకా కేంద్రాల మూసివేత, తెరిచున్న చోటా ఏ సామాజిక దూరాల పాటింపులు పట్టని జనం రద్దీ! ఇట్లాంటి పరిస్థితి అమెరికాలో అయినా ఉండేదే! కానీ.. ముందుస్తు రిజిస్ట్రేషన్ అనే  తెలివైన చిన్న ప్రక్రియను కచ్చితంగా పాటించడంతో ఏ చిక్కూ లేకుండా వ్యవహారం సాగిపోతోంది. ఏ వ్యూహాలు లేకుండా పథకాలు ప్రారంభించి బొక్కబోర్లాపడ్డంలో మన ప్రభుత్వానిదే నిజం చెప్పాలంటే ప్రపంచ రికార్ద్!

ప్రభువులిచ్చిన పాత ఉచిత టీకా హామీ గాలిలో కలిసిపోయింది.  టీకా ధర పెంచడం పైనే ప్రస్తుతమంతటా రచ్చ! 'ఉచితం'అన్నప్పుడే ప్రయివేట్ ఆసుపత్రులు  రూ. 500 వరకూ కుమ్మేశాయి. ఇహపై సర్కారు దవాఖావాఖానాలలోనూ  ఆ నల్లలక్ష్మీ దేవి చిందులు మొదలు కాబోలు! హిట్ వెన్ ఇటీజ్ హాట్ అన్న సూక్తిని ఇట్లా కూడా వాడుకుంటారా?!అవునులేండి! ఏప్రియల్ ఒకటి నాడే జనమంతా ఫూల్స్ అవాలనే రూల్ ఎక్కడా లేదుగా!

-కర్లపాలెం హనుమంతరావు

22 -04 -2021

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...