Tuesday, December 7, 2021

యుగద్రష్ట గురజాడ - ఆధునిక తెలుగు నాటకం - కె. రవివర్మ సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 





యుగద్రష్ట గురజాడ -  ఆధునిక తెలుగు నాటకం

- కె. రవివర్మ

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 


(కేరళనుంచి వెలువడుతున్న హిందీ మాసపత్రిక “సాహిత్య మండర్ పత్రిక" ప్రధాన సంపాదకులు కె. రవివర్మ. తెలుగు సాహిత్యానికి మిత్రులు. ప్రజా సాహితి “గురజాడ కన్యాశుల్కం ప్రదర్శన శతాబ్ది" సంచికను ఆగస్టు 92లో వెలువరిస్తున్నామని వారికి ప్రజాసాహితి తెలియజేస్తో, ఈ నాటకం మళయాళంలోకి అనువాదం జరిగిందా ? అయితే ఓ సరిచయ వ్యాసం హిందీలో రాసి పంపమని కోరింది. మళళంలోకి అనువాదం కాలేదని ప్రజాసాహితికి తెలియజేస్తూ, 'కన్యా శుల్కం' పై హిందీలో పరిచయ వ్యాసం రాసి పంపమని వర్మ ప్రజాసాహితిని కోరారు. 'ప్రజాసాహితి' ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ లెక్చరర్ కృష్ణ గారిచేత వ్యాసం రాయించి పంపించింది. ఆ వ్యాసాన్ని 'సాహిత్య మండల్ పత్రిక' జూలై 1992 సంచికలో ప్రచురిస్తూ, వర్మగారు ఆదే సంచికలో రాసిన సంపాదకీయం “యుగద్రష్టాః ఏక్ తెలుగు నాటక్” కోసం ఈ క్రింద ప్రచురిస్తున్నాము. తెలుగు అనువాదం ప్రజాసాహితి పాఠకుల కోసం ప్రచురిస్తున్నాం . 


విజయనగరం (ఆంధ్ర) లోని జగన్నాధ విలాసినీ సభ అనేసాంస్కృతిక  సంఘం కేవలం సంస్కృత నాటకాలే ప్రదర్శిస్తూ వచ్చేది. అలాంటిది  అదే సంస్థ ఓ తెలుగు నాటకం ప్రదర్శించి, తెలుగు సాహిత్యంలో, రంగ స్థలంలో ఓ సంచలనం  సృష్టించింది. ఈ నాటకం యధాస్థితివాదులు, సాహిత్య సమాలోచకుల విమర్శకు గురి అయింది. నాటకం పేరు "కన్యాశుల్కం" . 


వివాహం పేరిట యుక్తవయుసు రాని కన్యల్ని, వారి తల్లిదండ్రులకి డబ్బుయిచ్చి  కొనుక్కో వడం. ఈ నాటకం ఇతివృత్తం. ఈ నాటకం ద్వారా  రచయిత గురజాడ వేంకట అప్పారావు తెలుగు త్యంలో శాశ్వత స్థానం పొందారు. 


శ్రీ గురజాడ అప్పారావు విజయనగరం యం. ఆర్. కాలేజీలో ఇంగ్లీషు, సంస్కృత అధ్యాపకులు. అయినప్పటికీ (తెలుగులో) గ్రాంథిక రచనలు చేసే పద్దతికి స్వస్తి చెప్పి, ప్రపథమంగా  తెలుగు నాటకంలో వ్యావహారిక భాషనీ, నుడికారాన్ని ప్రవేశపెట్టారు. అందువల్ల ఈనాడు వారు ఆధునిక తెలుగు సాహిత్యానికి వెలుగుదారి చూపినవారుగా గుర్తింప బడుతున్నారు. 


'కన్యాశుల్కం' ఆధునిక నాటక లక్షణాలని తూ.చ. తప్పకుండా అనుసరించి ఉండక పోవచ్చు. అయినా ఎక్కువ శాతం నిరక్షరాశ్యులు ఉన్న సమాజంలో భావవ్యాప్తికి మాధ్యమంగా నాటక ప్రక్రియని ఎంచుకోవడం ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. చెప్ప దలచుకున్న విషయానికి హాస్యాన్ని జోడించి ప్రేక్షకుల ముందుంచితే అది తన

లక్ష్యాన్ని తక్షణం  సాధించుకుంటుంది . 'కన్యాశుల్కం' నాటకం రాయడంలో శ్రీ గుర జాడ ఉద్దేశం సాంఘిక దురాచారాల మూలాలను  చీల్చి చండాడటం.


కన్యాశిల్కం 1892 ఆగస్టు 13వ తేదీన తొలిసారిగా రంగస్థలం మీ ద ప్రదర్శింపబడింది. 1897 సం॥రంలో గ్రంథరూపంలో వెలువడింది. నాటకానికి రాసిన 'భూమి'క'లో శ్రీ గురజాడ యిలా అన్నారు. "విజయనగరం మహారాజు గారి ఆదేశం ప్రకారం పదేళ్ళ క్రితం నేను బ్రాహ్మణ శుల్క  వివాహాలను గురించిన కొన్ని వాస్తవాలను పోగుచేశాను. విశాఖపట్నం ప్రాంతంలో గత మూడు ఏళ్ళగా (1880–83) ఇలాంటి వివాహాలు 1034 జరిగాయి.  ఈ సంఖ్య పరిపూర్ణ మయినది కాదు. కారణం– తత్సంబంధిత వ్యక్తులు తమ కన్యల్ని కుల్కం తీసు కొని వివాహం జరిపినట్టుగా అందరూ ఎలా ఒప్పుకుంటారు ?"


“పైన ఉదహరించిన అంకెలను గురించి ఒక ఏడాదిలో సగటున కుల్క వివాహాలు 334 జరిగాయి. 99 మంది అల్ప వయసులో, 44 మంది నాలుగేళ్ళ అమ్మాయిలకీ, 36 మంది మూడేళ్ళ అమ్మాయిలకి, ఆరుగురు రెండేళ్ళ అమ్మాయిలకీ, ఏడాది వయసు ముగ్గురమ్మాయిలకి శుల్కం తీసుకొని పెళ్ళిళ్ళు జరిగాయి. అమ్మా యిలకోసం తీసుకొన్న శుల్కం  350 రూపాయల నుంచి 400 రూపాయల మధ్య ఉంటుంది. యుక్త వయసు రాకుండానే శుల్క వివాహాలు జరిపించే ఈ దుష్ట సాంప్ర దాయం ఎంతవరమా పోయిందంటే గర్భంలో ఉన్న శిశువుకి సయితం శుల్కం తీసుకొని పెళ్ళి ఖాయం చేసుకోవటం దాకా వెళ్ళింది. ఇంతకన్నా అవమానకర మయిన విషయం సమాజానికేం ఉంటుంది ? ఇటువంటి సాంఘిక దురాచారాల

నిర్మూలనకు  సాహిత్యం నడుం కట్టాలి. ఈ నాటక రచనకి ప్రేరణ ఈ భావమే. 


" కుల్కం లేక వెలయిస్తే ముసలి వగ్గులకి సయితం ముక్కుపచ్చలారని బాలికలు లభిస్తున్నారు. కౌమార్యంలోనే వైధవ్యం ప్రాప్తించే వీరి చేత యిళ్ళల్లో గొడ్డు చాకిరీ చేయిస్తున్నారు.”


కేరళలో సంబూద్రీల (కేరళ బ్రాహ్మణులు) మధ్య సయితం బాల్య వివా హాలు పరిపాటి. అయితే అవి శుల్కం యిచ్చికాక, వరకట్నం ఇచ్చి జరిగేవి. బహు భార్యా వివాహాలు కూడా సర్వసాధారణ విషయం. డబ్బుల అవసరాన్ని బట్టి ఏకన్య తోనయినా వివాహం జరిపించేసేవారు. ఒక్కో పురుషునికి నలుగురేసి భార్యలు . వాళ్ళ మధ్య కీచులాటలు, తగవులాటలు ,అంతఃపుర సవతి  కలహాలు సాధారణం. స్త్రీ లు పరదా  పద్ధతి  పాటించేవారు. పరాయి మగవాని ఎదుటికి వచ్చేవారు కారు. నంబూద్రీ బ్రాహ్మణుల్లో  యింటి పెద్ద కొడుకు మాత్రమే నంబూద్రీ కన్యలనే వివాహం చేసుకునేవాడు. అందువల్ల కన్యాధారంనుంచి విముక్తి కోసం ఆమె తల్లిదండ్రులు ఎంత వరకట్నమయినా సమర్పించుకొని, కాటికి కాళ్ళు సాచుకొన్న నంబూద్రీ వృద్ధునికి  సయితం తమ కన్యల్ని కట్టబెట్టేవారు. 


ఈ సాంఘిక దురాచారానికి వ్యతిరేకంగా 1930వ దశకంలో నంబూద్రీ యువకులు పెద్ద ఎత్తున ఆందోళనను చేపట్టారు. తెలుగులో 'కన్యాశుల్కం'లా, (మళయాళంలో సయితం) నాటకాలు రాసి ప్రదర్శించేవారు. నవలలూ, కథలూ రాసే వారు. ఈ ఉద్యమం విజయవంతమయింది. సాహిత్యానికి ఉన్న శక్తి ఏమిటో, సంఘసంస్కరణకి సాహిత్యం ఎంతలా దోహద పడగలదో ఋజువయింది.


గిరిజనులలో సయితం ఓలి యిచ్చి కన్యల్ని కొనుక్కొనే ఆచారం ఉందని అంటారు. అయితే చిన్న వయసుగల బాలికల్ని కాదు. వయసు వచ్చిన యువతీ యువకులు పరస్పరం యిష్ట వడ్డ తర్వాతనే గిరిజనులలో వివాహాలు జరుగుతాయి. అంతేగాని 'కన్యాశుల్కం' నాటకంలోలాగ ముక్కుపచ్చలారని పసికందులతో క్రూరంగా చెలగాటం ఆడుకోవటంకాదు.


—అనువాదం : నిర్మలానంద

( ప్రజాసాహితి - జనవరి 1993 ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 


 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...