Sunday, December 12, 2021

గోపాలం బావి – కథానిక -కర్లపాలెం హనుమంతరావు

 

గోపాలం బావి - కథానిక

-కర్లపాలెం హనుమంతరావు

 (రచన మాసపత్రిక ప్రచురితం)

మౌళి సికింద్రాబాద్ స్టేషన్ ముందు ఆటో దిగే వేళకు కృష్ణా ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగావుంది. ఆటోవాడి చేతిలో వందనోటు పడేసి చిల్లర కూడా అడక్కుండా ఫ్లాట్ ఫామ్ మీదకు జంపయిపోయి కదిలే ట్రైనెక్కేశాడు ఎట్లాగైతేనేం.

బండి వేగం పుంజుకుంది. ఖాళీగా ఉన్న ఓ కార్నర్ సీట్లో కూలబడి విండో గ్లాస్ పైకెత్తి బైటికి చూశాడు.

'బస్సులూ బళ్లూ బైకులూ.. పనిపాటలకెళ్లే జనాలూ.. బండెడు పుస్తకాల బరువు భుజాన మోస్తూనే బండిలోని ప్రయాణీకులకు ఆనందంగా టాటా.. బైబైలు చెప్పేస్తున్న చిన్నారులూ!' .. ఇహ వీళ్లందర్నీ చూడ్డం ఇదే చివరి సారి కాబోలీ జన్మకు!' అనిపించింది మౌళికి.

ఇంకీ లోకానికీ తనకూ రుణం తీరినట్లేనని నిశ్చయించుకుని  ఈవేళ్టికి రెండు రోజులు. ఇది మూడో రోజు పగలు. ఈ రాత్రే తనకు చివరి రాత్రి. మళ్లీ తెల్లారి అమ్మనూ, అమ్మనబ్రోలునూ చూడకూడదని డిసైడయిన తరువాతనే కదా తనా ఉత్తరం ఇంటికి  రాసింది! అమ్మ అది చదివించుకొనే టయానికి తను ఈ లోకంలో ఉండడు.. ఉండకూడదు కూడా.

ఉత్తరంలోని సంగతులు మళ్లీ మళ్లీ గుర్తుకొస్తున్నాయి '..అమ్మా! నేనిక్కడేమీ దొరబాబులా వెలిగిపోడంలా. ఓ కెమేరా మెన్ గాడి దగ్గర క్రేన్ ఆపరేటర్ గా గాడిద  చాకిరీ. రోజుకు రెండొందలొస్తే గొప్ప. అదీ లేనప్పుడు ఫుల్ డే పస్తే! మంచిరోజులు వస్తాయొస్తాయని చూసి విసిగెత్తిపోయిందే అమ్మా! ఇహ నా వల్ల కాడంలేదు.  పేద్ధ సినిమా స్టారయిపోదామని నిద్దట్లో కూడా కలలు కనేవాణ్ణి. నువ్వు ఉడుకుడుకు నీళ్లు మీద దిమ్మరించినప్పుడైనా బుద్ధొచ్చి చచ్చింది కాదు. ఊరొదిలి పారిపోయి నిన్నెంత క్షోభపెట్టానో అప్పట్లో! తెలిసి తెలిసీ తిరిగొచ్చి ఈ పుండును కెలకాలనుకోడం లేదమ్మా మళ్లీ ! ఇప్పుడొచ్చేది ఈ లోకం నుంచీ వెళ్లిపోయే ముందు నీ చేతి గోరుముద్దలు రెండు చప్పరించాలనీ, రజనీ చేతిగాజులు రెండూ తిరిగిచ్చెయ్యాలనీ. నా చావుకు ఎవరూ బాధ్యులు కాదని ముందు పోలీసులు తెలుసుకోడం ముఖ్యం ఈ రోజుల్లో! అందుకోసమైనా ఈ ఉత్తరం భద్రంగా దాచుంచుకో!..' టీసీ రాకతో ఆలోచనల చైన్ తెగిపోయింది.

బండి వెళ్లిపోతోందన్న హడావుడిలో టిక్కెట్ తీసుకోలేదన్న సంగతి అప్పుడు గుర్తుకొచ్చింది. ఒంగోలు దాకా పెనాల్టీ కట్టి సీటులో నిస్త్రాణగా పడుకుండిపోయాడు మౌళి.

ఆడపిల్ల గాజులు కొట్టేసినందుకు యమలోకంలో ఏ శిక్ష పడుతుందో! ఒక్క అమ్మనే కాదు.. నమ్ముకున్న అమ్మాయికీ అన్యాయం చేసిన పాపి కదా తను! శిక్ష రెట్టింపని హూంకరిస్తాడేమో యముండు!

దుర్గ కళ్లలో మెదిలింది. మహా అభిమానం గల పిల్ల. ఎవరినీ హద్దు మీరి దగ్గరకు రానిచ్చేదే కాదు. ఆపరేటర్ పాపారావు గాడి కన్ను దాని మీదెందుకు  పడ్డదో.. ఖర్మం! తన మొహానో వెయ్యి కొట్టి  గెస్ట్ హౌసుకు మళ్లించుకు రమ్మన్నప్పుడే  తను దుర్గను ఎలర్ట్ చేసుండాల్సింది. మందు కొట్టి తను రూంలో గమ్మున పడుండిపోయాడు. అందు వల్లనే అన్యాయంగా దుర్గ బతుకు  ఆగమాగమైపోయింది. దౌర్జన్యం చేసిన పెద్దమనుషులంతా దర్జాగా తప్పుకుంటిరి! ఏ సంబంధం లేని తానొక్కణ్ణి  మాత్రం కేసులో  ఇరకబెట్టిరి! పోలీసు మాయ! వాళ్లు కళ్లు కప్పి సుల్తాన్ బజార్  'చిచ్చా' దగ్గర కుదవ పెట్టిన గాజులు విడిపించుకొని ఈ బండిట్లా ఎక్కడానికి ఎన్ని బ్రహ్మప్రళయాలయ్యాయో!.

ఊరెళ్లినా సేఫ్టీ ఉండదని తెలుసు. తను బతికుంటే అమ్మకింకా క్షోభే! పై కెళ్లిపోడమే బెటర్! అప్పుడే అందరి ప్రాణాలకీ తెరిపి! 'మీల్స్.. మీల్స్' అనే కేకలతో ఈ లోకంలోకి వచ్చిపడ్డాడు  మౌళి.

బండి చినగంజాం స్టేషంలో ఆగివుంది. ఎడం చేతి మీద అన్నం ప్లేటు దొంతర్లుగా పెట్టుకుని క్యాంటిన్ కుర్రాడొకడు మహచలాకీగా దున్నేస్తున్నాడు కంపార్ట్ మెంటంతా. పరీక్షగా చూస్తే  మడం దాకానే ఉంది చెయ్యి!

అన్నం ప్లేటు కళ్లబడగానే ఆకలి ఉవ్వెత్తున ఎగసిపడింది.  అయినా ఆర్డరీయ బుద్ధికాలే. ఇంకో గంటాగితే ఇంటికే పోవచ్చు. అమ్మ చేతి అమృతం ముద్దలు కమ్మంగా లాగించచ్చు.

కాలే పొట్టకు నీళ్లు పట్టిద్దామని బండి దిగి పంపు దగ్గరకు పరుగెత్తాడు మౌళి.  

'సార్సార్! ఈ కాలకూటం తాగితే నేరుగా కైలాసానికే డీలక్స్ జర్నీ! నా దగ్గర అచ్చమైన గంగామృతముంది మాష్టారూ. గ్లాసు రెండే రూపాయలు. ఓన్లీ టూ రుపీస్!' అంటూ ఓ లోటాడు నీళ్లల్లో రెండు  ఐస్ ముక్కలేసి గిలక్కొట్టి అడక్కుండానే చేతికందించేశాడో గడుగ్గాయ్. ఆ బాలుడి మొహం ఎక్కడో చూసినట్లుంది. ఇల్లొదిలి ఏడేళ్లయింది. పదేళ్లయినా నిండని ఈ బుడతణ్ణి  చూసే ఛాన్సెక్కడుంటుందీ!

 వాడి మాటల్లానే వాడిచ్చిన వాటరూ మహతియ్యగా చల్లగా ఉంటంతో మరో మూడు లోటాలు కడుపు నిండా పట్టించేసి పది రూపాయల నోటొకటి వాడి చేతిలో పెట్టి గబగబా కదిలే బండెక్కేశాడు మౌళీ. చిల్లర ఇవ్వడం కోసం కాబోలు పాపం ఆ పసోడు  ఊపందుకున్న  బండి వెంట బడ్డాడు శాయశక్తులా.

బండి అమ్మనబ్రోలు ఔటర్ సిగ్నల్ దగ్గర తిష్ఠేసింది.. స్టేషన్ క్లియరెన్సు కోసం దాని తిప్పలు! పావు గంట గడిచినా మోక్షం లేకపోడంతో.. ఓపిక నశించి బండి దిగి పొలాలకడ్డం బడి ఊళ్లోకి బైలుదేరాడు మౌళి.

పచ్చని పైర గాలి తగిలి వళ్లు పులకరించింది చానాళ్లకు. అదో రకమైన ఉద్యేగం! కొన్ని అనుభూతులకు నిర్వచనాలు కుదరవు.

'ఏడేళ్లాయ తన ఊరి నీళ్లు తాగి! ఈ కొద్ది కాలంలోనె ఎన్ని పోకిరి పోకడలు! జట్కాలకు బదులు ఆటోలు.. కంకర రాస్తా మీద తారు పూతలు!

రోడ్డుకు రెండేపులా ఉన్న  సిరిమావిడి, నేరేడు చెట్లలో  మాత్రం ఏ మార్పూ లేదబ్బా. చిన్నప్పట్లానే దోస్తును గుర్తుపట్టి హుషారుగా విజిల్సేస్తూ మహా ఊగిపోతున్నాయి! వాటి  మానులకు కట్టిన సెట్ బాక్సులను చూసిం తరువాత గాని ఊరి బలుపు మౌళి బుర్రకెక్కిందికాదు.

బయట నుంచి వచ్చే అతిథులను తన గలగలతో పలకరించే చెరువు మాత్రం బాగా చిక్కిపోయుంది. చెరువుకు చుట్టూతా కట్టున్న ముళ్ల కంచెల బారు చిక్కిశల్యమయిన అమ్మ ఆ రోజుల్లో కట్టుకునే చీకిపోయిన చీరెను గుర్తుకు తెచ్చింది.  చెరువు మధ్యలో ఏదో భారీ నిర్మాణమే లేస్తోంది. అమ్మ పొట్ట మీద  ఎన్నటికీ మాయని పుండొకటుండేది ఎప్పుడూ. దానికి మించి వికారం కలిగించిందీ కట్టుబడి మౌళీ కళ్లకు. 

చెరువు గట్టు మీది గోపాలం బావి మాత్రం అప్పట్లానే ఇప్పుడూ సందడిగా ఉండటం కొద్దిగా ఊరటనిచ్చే ముచ్చటబ్బా ప్రస్తుతానికి. ఊరు మొత్తానికి అదొక్కటే మంచినీళ్ల బావి మొదట్నుంచి. 'ఆ బావి జల వంటికి తగిలితే చాల్రా.. ఎంత లావు మొండిరోగమైనా ఇట్టే  లొంగొచ్చెయ్యాల్సిందే! పుణ్యాత్ముడ్రా  మీ నాయన.. అంతా ఆయన చలవ' అనేవారెప్పుడూ వెంకట్రావ్ మేష్టారు. అరవైతొమ్మిదుల్లో వచ్చిన ఉప్పెనకు చెరువు నీరు చప్పలకు తిరిగితే గట్టు మీద నాయన ఈ బావిని తవ్వించాడంటారు! 'ఏ కాలంలోనూ బావిలోని ఊట వట్టిపోవడం ఎరగం.  కొబ్బరి బోండాలు లేని లోటు ఊరుకు తీర్చింది మన  గోపాలం బావే' అనే వారు వెంకట్రావ్ సారు! నాయన పేరు మీదనే బానిని  'గోపాలం బావి' అని ఊరు గౌరవంగా పిలుచుకునేది మొదట్నుంచి.

'ఇంకా నయం! చెరువుతో సహా  ఈ బావి మీదా కబ్జాగాళ్ల  కన్ను పడిందికాదు' అనుకున్నాడు మౌళి కొద్ది సంబరంగా.

శివాలయం వెనక గుండా అడ్డదారిన బడి పోస్టాఫీసు ముందుండే రోడ్డెక్కాడు మౌళి. పోస్టాఫీసు ఇంకా అట్లాగే ఉంది వెలిసిపోయిన మొండి గోడలతో! చువ్వల గుండా పద్దాకా  ఉత్తరాలు సార్ట్ చేస్తూ కనిపించే  పోస్ట్ మేన్ సుబ్బారావు లేడివాళ. వాడు గాని తనను చూస్తే గుర్తుపట్టి గోల చేయడం ఖాయం. ఏ గోలా గబ్బూ లేకుండా ప్రశాంతంగా పోవాలని కదా.. తానింత దూరం పడుతూ లేస్తూ వచ్చిచావడం!

తలొంచుకుని గబగబా రెండే అంగల్లో తూర్పు వీధి చివర్లోని తన ఇంటి ముందు కొచ్చిపడ్డాడు మౌళి.

కంపగేటు తీస్తుంటే గుండెలు గుబగుబలాడాయి. పూరింటి వసారా బోసిగా ఉంది. రాటకు కట్టేసున్న లేగ దూడ తల్లి కోసం కాబోలు అంగలారస్తా ఉంది.  గుడిసె తడికతలుపు బైటకు తాళమేసి ఉండటంతో అరుగు మీదున్న కుక్కిమంచంలో నిస్త్రాణగా వాలిపోయాడు మౌళి. నీరసంతో కళ్లు మూతపడిపోతున్నాయి.

'తాను ఊరు వదిలి వెళ్లే ముందు అమ్మకు నూట నాలుగు డిగ్రీల జొరం. ఓ పూట లేస్తే ఓ పూట పడక ఆ రోజుల్లో అమ్మ వంటి తీరు. ఏడేళ్లయింది.. ఇప్పుడెట్లా ఉందో..ఏంటో!' ఆ మగతలోనే మౌళీకి ఏవేవో పిచ్చి పిచ్చి ఆలాపనలు.

గలగలా మాటలు చెవినబడుతుంటే మెలుకువొచ్చింది మౌళికి. ఆ కంచు కంఠం అమ్మదే! చీరె కొంగుతో మొగం తుడుచుకుంటూ తడికతలుపు తీస్తోన్న తల్లిని చూసి తటాలున లేచి నిలబడ్డాడు మౌళి.

చెట్టంత కొడుకు హఠాత్తుగా కట్టెదుట అట్లా నిలబడే సరికి ఆదెమ్మ మొదట్లో  నివ్వెరబోయింది. ఆనక 'నువ్వా!' అనబోయింది కానీ, ఆ షాక్ నుంచి తేరుకునే లోపే ఉక్రోషం తన్నుకొచ్చేసింది. తడిక తలుపు ధడాల్న తోసి లోపలికి దూసుకెళ్లిపోయింది.

మౌళికి ఆ క్షణంలో ఏం చెయ్యాలో తోచిందికాదు. లోపల్నుంచి తిట్ల వర్షం ఆగకుండా కురుస్తా ఉంది. 'చచ్చానో బతికానో చూడ్డానికొచ్చావా కొడకా! ఏం తక్కువ చేసాన్రా నాయనా నీకు! తండ్రిలేని బిడ్డవని గారాబం చేశా, అదీ నా తప్పు. ఊరి పిల్లోళ్లకు మల్లే వీడి మెడకూ ఓ కాడి తగిలించేసి మడిసెక్కలోకి తోసుంటే తెలిసుండేది. ఎంత కొవ్వెక్కకపోతే ఆడపిల్ల చేతిగాజులు  అట్లా నూక్కెళతావ్రా నువ్వూ! ఒంటాడదాన్ని ఊరి దిక్కుకొదిలేసి ఏడేడకో బోయి ఏందేందో ఊడబొడుస్తాడంటండీ! ఎళ్లాడూ.. ఇప్పుడేవైందంటా!  దేభ్యం మొగమేసుకుని దిగబడ్డానికి సిగ్గూ శరమూ ఉండక్కర్లా! మగ పుటక పుట్టాడూ ఎందుకూ!..'

'..ఇంకా పురాణం ఆపవే తల్లీ.. నీకు పుణ్యముంటది! మూడ్రోజుల్నుంచీ ముద్ద మింగలే. తింటానికింతేమైనా ఉంటే ముందు పెట్టవే! ఆనక నీవెన్నైనా తిట్టు.. పడ్డానికి రడీ.. అందుకనేగా నేనొచ్చిందీ!' ఆప్యాయంగా తల్లి చేతుల్ని తన  చేతుల్లోకి తీసుకోబోయాడు కొడుకు.

విదిల్చి కొట్టిందా చెయ్యిని ఆదెమ్మ ఛీత్కారంగా. 'పోరా! నన్నంటుకోబాక.. దొంగ సచ్చినోడా! వళ్లంతా మంటలు పెట్టినట్లుండాది నిన్నిట్లా చూస్తావుంటే! నువ్వు చేసి పోయిన గనకార్యానికి నా గుండెల్లో ఎన్ని అగ్గి గుండాలు రగులుకున్నాయో తెలుసంట్రా నీకు! ఊరంతటికీ న్యాయం చెప్పే మీ నాయనకు నువ్వెంత గనకీర్తి తెచ్చిపెట్టావో ఎదవా నీకెన్నడైనా తోచిందా కుంకా? నువ్వు చేసి పోయిన ఉద్ధరింపుకు ఊరంతా నా మొహానింత వుయ్యలేదంటే .. అందుక్కారణం మీ నాయన ఊరోళ్ల మజ్జె నిలబెట్టుకున్న పెద్దరికం! అట్లాంటి తండ్రికి ఇట్లాంటి బిడ్డ!' గుండెల మీద చెయ్యేసుకున్నది ఆదెమ్మ.  ఆవేశం ఆగడంలే! 'అయినా నిన్ను కాదులే అనాల్సింది! నిన్ను కన్నందుకు నన్నూ. నీకింత విషం కాక గోరుముద్దలు తినిపించాయే ఈ చేతులూ.. ముందు వీటికి కొండ్రు కాల్చి పెట్టాల వాతలు' అంటూ అమాంత మండే మండే పొయ్యిలోని కట్టెల్లో నుంచి ఓ పేడు లాగి రెండరచేతుల మీదా దబా దబా రుద్దేసుకొంటోంది ఆదెమ్మ. ఊహించని ఈ హఠాత్పరిణామానికి షాకయ్యాడు మౌళి. క్షణంలో తేరుకొని అమాంతం తల్లిని అట్లాగే చేతుల మీద ఎత్తుకునెళ్ళి బైట కనిపించే నీళ్ల తొట్టిలో దిగ్గున వదిలేశాడు.

వేడి వేడి బొబ్బల మీద అమాంతం చల్లటి నీళ్లు పడేసరికి ఆ నొప్పికి తాళలేక రంకెలేయడం మొదలెట్టింది ఆదెమ్మ. గగ్గోళ్లకు నలుగురూ చేరిపోవడంతో మౌళి రాక క్షణాల్లో ఊరంతా గుప్పుమంది.

ఆచారిగారొచ్చి రెండరచేతులకూ చందనం పట్టీలా వేసి నొప్పి తెలీకుండా రెండు అల్లోపతి బిళ్లలిచ్చిపోయే వేళకు మునిమాపు చీకట్లు దట్టంగా కమ్ముకున్నాయి.

చలికాలం కావడాన ఊరంతా ఆ సరికే  మాటుమణిగింది. మాత్రల ప్రభావంతో.. ఆదెమ్మ అట్లాగే కొట్టేసినట్లు మంచంలో పడుంది మూలుగుతా. బుడ్డి దీపం కూడా ఎక్కడుందో తెలీక చీకట్లో అట్లాగే వసారా చవుడు గోడకానుకుని ముంగిలా కూర్చుండిపోయాడు మౌళి.

ఊరిజనాలు మధ్యాహ్నం ఇంట్లో గుమికూడినప్పుడు అనుకున్న మాటలే చెవుల్లో   గింగురుమంటున్నాయింకా. ‘ఆదెమ్మ బతుకు హాయిగా వెళ్లమారిపోతావుంది ఇప్పటి దాకా. ఇదిగో శనీశ్శెరుడు..  దాపురించాడు! మొదట్రోజే  రామాయణం మొదలూ!..'

తల్లికిట్లా అయిందని తెలవగానే చూడ్డానికని వచ్చిన వెంకట్రావ్ మేష్టారు అన్నమాటలు ములుగర్ర కన్నా ఎక్కువగా పొడుస్తున్నాయ్ 'ఏడేళ్ల కిందటి  రోగిష్టి తల్లి కాదురా ఇప్పుడు మీయమ్మ! నువ్విల్లొదిలి పోతే నెల్రోజులు మంచం పట్టింది. అట్లాగే  పోతుందనుకున్నామందరం. తిప్పుకుంది. ఇప్పుడు ఊరంతటికీ నీ తల్లే తల్లి. ఊరు కోసం  మళ్లీ మీ నాన్నయింది మళ్లీ. ద్వాక్రాలనీ, అవనీ, ఇవనీ ఆడంగులందరికి మీ అమ్మేరా ఇప్పుడు అండా.. దండా! యానాదయ్య సారాయంగడి మూతేయించిందాకా ఆదెమ్మ కంటిరెప్ప మూతపడితే ఒట్టు. నీకేం తెలుస్తాయీ ఇట్లాంటి కథలన్నీ? నీ సినిమా కథల కన్నా ఎంతో ఉత్తేజం రగిలిస్తాయివి జనాలల్లో! చిలకలయ్యకు చెరువును పూడ్చేసి పేకాట క్లబ్బు కట్టాలని చాలా రోజుల్నుంచి మాలావు యావ.  దాన్నెట్లాగయినా ఆపించాలని కోర్ట్ల చుట్టూ తిరుగుతా ఉంది మీ అమ్మ ఈ వయసులో ఓపిగ్గా! ఎన్నికలొస్తోన్నాయిరా.. నీకు తెలుసునో లేదో! బలిసిన మోతుబర్లంతా కక్ష కట్టున్నారు ఊరి బక్క జనం మీద. వాళ్ల తరుఫున  ఎదురొడ్డి నిలబడి పోరాడే శక్తి ఒక్క  ఆదెమ్మకే   అనుకుంటున్నదిప్పుడు ఊరంతా. ఇదిగో ఇంతలో నువ్వూడిపడ్డావు. మొదట్రోజే ఇంత భాగోతమయింది! ముందు ముందింకెన్ని కురుక్షేత్రాలు చూడాల్నోనని  జనాలకు భయం పట్టుకుందిరా ఇప్పుడు' అంటూ నిష్ఠురాలింకా చాలానే పోయారు వెంకట్రావు మేష్టారు.

'చెప్పాపెట్టకుండా ఆ రోజట్లా ఇల్లొదిలి మాయమై బాధపెట్టాడు తల్లిని. అడగా పెట్టకుండా ఇప్పుడిట్లా  తిరిగొచ్చి   ఆ నొప్పిని రెట్టింపు చేస్తున్నాడా? తన వల్ల తల్లికి ఎప్పుడూ దుఃఖమేనా?   అప్పుడంటే  తెలీక చేసిన తప్పది. ఇప్పుడిహ తెలిసి తెలిసీ తప్పిదం చేస్తే ఎట్లా? బతికున్నన్ని నాళ్లూ అమ్మకు రవ్వంతైనా లాభం కలిగించని తాను.. కనీసం చచ్చయినా ఏదో ఓ ప్రయోజనం సాధించి పెట్టాలి!   ఎక్కడి దాకానో  పోయి ఏ ఏట్లోనో పడి చావడమెందుకు?  ఆ చావేదో ఊరి జనాల ముందు ఇక్కడే ముగించుకుంటే పాయ1  అమ్మకు ఆ సానుభూతు ఓట్లన్నా ప్లస్సవచ్చు' ఉత్సాహమొచ్చింది మౌళికి అంత నీరసంలో కూడా.

చీకటి గుడిసెలోకి పాక్కుంటూ వెళ్లి అతి కష్టం మీద అగ్గిపెట్టె వెతికి పట్టుకున్నాడు.  బుడ్డి దీపం వెలిగించి ఆ మసక వెల్తురులోనే కుండలోని అన్నం కరళ్లు రెండు కంచంలో పెట్టుకుని కనిపించిన ఆదరువుతో కలిపి ఓ రెండు   ముద్దలు మింగాననిపించాడు. మంచి నీళ్లు రెండు లోటాలు పట్టించేసరికి ఆత్మారాముడు కొంత శాంతించాడు . ఏడేళ్ల కిందట తాను  దొంగిలించిన రజని బంగారు గాజులు తల్లి తలగడ కిందకు తోసి ఆమె  మొహాన్నోసారి ఆప్యాయంగా చూసి తటాలున బైటకొచ్చేశాడు మౌళి.

 

చీకట్లో చూడక కాలు నిద్రలో ఉన్న బర్రె డొక్కలో  పడింది. అది బాధతో  చేసిన అలికిడికి తల్లి లేవక ముందే కంప కంచెతలుపు గభాలున లాగి ఒక్కుదుటున రోడ్డు మీదకొచ్చి పడ్డాడు మౌళి.

చలిగాలికి ఊరంతా అప్పటికే ముడుచుకుని పడుకునుండిపోయి ఉంది. బజారులో నరసంచారం లేదు. మెయిన్ రోడ్డు గుండానే శివాలయం వెనకున్న గోపాలం బావి గట్టుకు చేరుకున్నాడతగాడు.

బావిలోకి తొంగిచూస్తే చీకటి మినహా మరేమీ కనిపించింది కాదు . తన జీవితానికి నకలుగానే ఉందా చీకటి కూడా! ఏడేళ్ల కిందట ఈ చీకటి గహ్వరమే తన అనుంగు స్నేహితురాలు రజనిని ఆవురావురుమని మింగేసింది.

పదమూడేళ్ల రజని తన  తోడును బాగా ఇష్టపడ్డం..  మేష్టారూ నమ్మి రజని ఎక్కడికెళ్ళినా  తననే తోడిచ్చి నిశ్చింతగా పంపించడం.. అవన్నీ గుర్తుకొచ్చాయి మళ్లీ మౌళీకిప్పుడు.

రోజుట్లానే ఆ రోజూ  రజని దైవదర్శనానికని వచ్చి గోపాలం బావి గట్టు మీదెక్కి కూర్చుని ముచ్చట్లే ప్రపంచంగా కేరింతలు కొట్టేస్తోంది తనతో కలసి. తన దృష్టంతా  ఆమె ముంజేతి  బంగారు గాజుల మీదనే. వాటితో భాగ్యనగరం చెక్కెయ్యాలని ప్లాను. బంగారు గాజులు   గుంజుకునే  కంగారులో స్నెహితురాలు  అప్పుడెట్లా నీళ్లలోకి జారిపడిపోయిందో ఇప్పటికీ అర్థం కాని చిక్కు ప్రశ్నే!

తనూ ఇప్పుడు అట్లాగే బావి నీళ్లలోకి జారిపోవాలి ముందు. తెల్లారక ముందే నీళ్ల కోసమొచ్చే జనాల కళ్లబడే తన విగత శరీరమే..  'బిడ్డను పోగొట్టుకున్న తల్లి' ముద్రతో  ఎన్నికల్లో అమ్మను అఖండ విజయం తెచ్చిపెట్టేది.  బతికుండి ఎన్నడూ తల్లికి సాయమందించని  తనకు కనీసం చచ్చిన తరువాతైనా  ఆ లోటు పూరించుకునే అవకాశం దక్కినందుకు చచ్చే అనందంగా ఉంది.. అనుకున్నాడు మౌళి అర్థంపర్థంలేని భావోద్వేగంలో పడి కొట్టుకుపోతున్న కారణంగా.  

గుడి వంకో సారి, ఇల్లున్న వీధి వంకో సారి చూసి రజనిని తలుచుకుని, అమ్మని తల్చుకుంటూ చేంతాడు కట్టిన కాలితో అదే తాడు చుట్టి బావి వర మీద ముందే పెట్టుకునున్న బండరాయిని  గట్టు మీద నిలబడి కాలిబంతిలా తిన్నగా బావిలోకి తన్నేశాడు.. మౌళి!

---

మౌళి కళ్లు తెరిపిడి పడేసరికి మొహంలో మొహం పెట్టి కన్నీళ్ల  తెరల గుండా రెప్పయినా కొట్టకుండా ఆబగా  చూస్తోన్నది తల్లి ఆదెమ్మ! చుట్టూ గుమికూడి ఉన్న జనం! తన  చావు ప్రయాస విఫలమయిందని అర్థమవడానికి ఆట్టే కాలం పట్టలేదు మౌళికి.  సిగ్గుపడి తల పక్కకు తిప్పేసుకున్నాడతగాడు.

'ఇప్పుడు సిగ్గుపడి ఏం లాభమంటా? ఆ ఇంగితం దూకే ముందుండాల! ఊరికి మీ నాయన ఇచ్చిపోయిన వరాలలో చివరికి మిగిలింది  'గోపాలం బావి' ఒక్కటే! దీన్నీ ఊరికి కాకుండా చేయాలనేనా నీ కిక్కడ దాకా వచ్చి  చావాలనే దుర్బుద్ధి పుట్టింది!'  ఆదెమ్మ మాటల్లోకి అదే పదును వచ్చిపడింది మళ్లీ. 

'ఇప్పుడా మాటలన్నీ అవసరమా ఆదెమ్మా!' పెద్దరికంతో అడ్డుకోబోయారు వెంకట్రావు మేష్టారు.

'అవుసరమే సారూ! అక్కడ ఆ ఛండాలప్పని చేయబట్టి కాదూ  ఇక్కడి కొచ్చి  వీడిట్లాంటి చావు చావాలనుకోడం?  వీడిప్పుడు ఇందులో పడి చస్తే  నీళ్లు మైలపడ్డాయని సాకు చూబెట్టి బావిని పూడ్పించెయ్యరా త్రాష్టులంతా కల్సి! ఆ గ్యానం లేనప్పుడు  వీడికీ ఇగ ఆ త్రాష్టులకూ తేడా ఏముండాదంట?'

'ఇక వూరుకో అత్తమ్మా! మౌళిని గురించి మరీ అంత అన్యాయంగా మాట్లాడద్దు!' అడ్డుపడింది అక్కడే ఉన్న ఓ అమ్మాయి.  'పొరపాట్లు జరగడం సహజం  ఎవరికైనా. తప్పు తెలుసుకుని మన్నించాలని కాళ్లట్టుకోడానికొచ్చాడు నీ కొడుకు. అదే గొప్ప ఈ రోజుల్లో! జరిగినవాటన్నిటికీ మౌళి ఎంత బాధ పడతున్నాడో నాకు తెలుసు' 

ఏడేళ్ల కిందట తనతో  చివరి సారి బావి గట్టు మీద కూర్చుని కాళ్లాడించుకుంటూ కులాసాగా కబుర్లు చెప్పిన స్నేహితురాలు రజని ఆమె! 

నివ్వెరపోయాడు మౌళి  చందమామ లేని  ఆకాశంలా  బోసిపోత్తున్న ఆమె నుదురు చూసి. మాంగల్య సౌభాగ్యానికి అమె దూరమైనట్లు అర్థమవడానికి ఆట్టే సమయం పట్టింది కాదు .

రజనిని ఆనుకుని తడిసిన బట్టలతో వజవజా వణుకుతూ నిలబడున్నాడో బుడ్డోడు. పరీక్షగా  చూస్తే గుర్తుకొచ్చింది.. నిన్న చిన్నగంజాం రైలుస్టేషనులో అమృతం తాగించిన బాలజగన్మోహనుడు ఈ భడవానే! వీడికి రజని  పోలికలు ఉండబట్టే ఎక్కడో చూసినట్లనిపించింది నిన్న.

---

'బావి నీళ్ల కోసం నేనూ బాలూ తెల్లారగట్లే చెరువు దగ్గరికొచ్చాం.. మౌళీ! లోపల్నుంచీ మూలుగులు వినిపిస్తా ఉంటే వీడిని దింపించా..' అంది రజని ఇంటి దగ్గర.

'ఈ బుడ్డోడు కనక ఆ సాహసం చేయకపోయుంటే నువ్వు ఇక్కడా ఆ హైదరాబాదుకు మల్లే..' వెటకారం చేయబోయింది ఆదెమ్మ! అడ్డుకుంది రజని 'అందరూ  అనుకుంటున్నట్లు మౌళీ తెలిసి ఏమీ తప్పు  చెయ్యలేదత్తమ్మా  ఎక్కడా! ఒక అమ్మాయిని రక్షించ గలిగే స్థితిలో ఉండీ తనా పని చేయలేదన్న దిగులుతో కుమలడమే తప్పించి. ఆ బెంగలోనే నిన్ను చూడాలని ఇక్కడిదాకా పరుగెత్తికొచ్చింది.నువ్వేమో... '

'ఇంతలా వెనకేసుకొస్తున్నావేంటి తల్లో! అంతా నీకే తెల్సన్నట్లు ..' ఆదెమ్మ కోపం ఇంకా తగ్గనే లేదు.

'తెలుసు అత్తమ్మా! మౌళి నీకని రాసిన ఉత్తరం నేనే చించి చదువుకుంది ముందు! అందుకే వీడిక్కడికొచ్చి ఏదో చేసుకోబోతున్నాడన్న అనుమానం వచ్చింది. నేనే మా బుడ్డోడిని ఓ కంట కనిపెట్టి ఉండమని పురమాయించా!' అంది పిల్లవాడిని చూపిస్తూ.

రజనికి మాష్టారు చేసిన సంబంధం మంచిది కాదని చేసిన తరువాత గాని తెలిసిరాలేదుట. బిడ్డ పుట్టిన తరువాత తాగుడు మరీ ఎక్కువై లివర్ జబ్బుతో పోయాట్ట రజని మొగుడు. అతగాడి బ్రాంచ్ - పోస్టాఫీస్ పని రజనీ పరమయిందందుకే ఇప్పుడు. కాబట్టే మౌళి ఉత్తరం ఆమెకు ముందుగా చదివే అవకాశం కలిగింది.

 వేణ్ణీళ్లకు చన్నీళ్లుగా శని ఆదివారాలలో తన పిల్లవాడిని ఇట్లా స్టేషన్లో మంచినీళ్ళు అమ్మించే పనికి రజని ప్రోత్సహించడం వెంకట్రావు మేష్టారి శిక్షణలో అబ్బిన  సంస్కారం వల్లనే. 

 వాడి  సాదర ఖర్చులకన్నా ఇట్లా సంపాదించుకోమని నేనే ప్రోత్సహిస్తున్నా మౌళీ! వీడిదేముంది గానీ,  ఈ ఊళ్లో చాలా మంది మీ నాయన గోపాలం బావి ప్రసాదించే అమృతం మీదనే అధారపడి జీవనం సాగిస్తున్నారు. తెలుసా నీకు!  నువ్వా బావినే నీ అఘాయిత్యానికి లక్ష్యంగా ఎంచుకుంటివి.. తెలీక! అందుకే అత్తమ్మకు  అంత కోపం తన్నుకొచ్చింది! అత్తమ్మిప్పుడు ఊరి మనిషి' అని సర్దిచెప్పింది రజని.  

 అమ్మ  చెప్పిన మీదట  మౌళీనే స్వయంగా  బంగారు గాజులు తిరిగిస్తూ   క్షమాపణలు అడిగినప్పుడూ మందలిస్తూ అట్లాగే పెద్దరికం చూపించింది రజని  'ఛఁ.. ఛఁ! నువ్వు  నా లైఫ్ లో మా నాన్న తరువాత అంత  క్లోజెస్ట్ ఫ్రెండువిరా! నాకు క్షమాపణలు  చెప్పడేమేంటి నాన్సెన్స్ కాకపోతే!  రియల్ లైఫేమన్నా నువ్విష్ట పడే రీల్ లైఫా?  నువ్విచ్చినా నాకు ఈ బంగారు గాజులు పెట్టెలో పెట్టి పూజించుకోడానికి తప్ప మరెందుకూ పనికిరావు కానీ, ఒక పని చేద్దాముట్రా మౌళీ  ఇద్దరం కలసి! అత్తమ్మ ఆధ్వర్యంలో మట్టి చట్లు ఎట్లాగూ తయారవుతున్నాయి ఊళ్లో!  బైటకు కదల్లేని ఆడంగులు.. వికలాంగులు వాటి ద్వారానే నాలుగు రాళ్లు కళ్ల చూస్తున్నారీ మధ్యన  ఊళ్లో! వాళ్ల వస్తువులను ఓపెన్ మార్కెట్లకు పరిచయం చేసే  ఉపాయేలేమైనా ఉన్నాయేమో.. ఎక్స్ప్లోర్ చేద్దామా ఓ మార్కెటింగ్ ఏజెన్సీలాంటిది ఏదైనా పెట్టి.'

మట్టి ముంతల్లో నిలవుంచిన నూతి నీళ్లు తాగితే ఎక్కడి మొండి రోగాలైనా లొంగివస్తాయ్ కూడా!' అన్నారు అక్కడే ఉన్న ఆచారిగారు కూడా.  

'నువు చెపితే ఈ మొండాడు  వింటాడమ్మా! అట్లాగైనా వీడు మళ్లీ ఓ దారిలో పడితే నాకన్నా మించి సంబరపడేదింకెవరు తల్లీ!' అని కన్నీళ్ళు పెట్టుకుంది ఆదెమ్మ చాలా రోజుల తరువాత కొడుకును ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని.

'శుభం. అయ్యలాగా ఓ మంచి నీళ్ల నుయ్యి తవ్వించలేకపోయినా ఆ నూతిలోని అమృతజలతో బిడ్డ నలుగురి నాలుకలు తడపబోతున్నాడన్న మాట. ఆశీస్సులు చిరంజీవులు ఇద్దరికీ' అన్నారు అక్కడే ఉండి అంతా వింటున్న వెంకట్రావ్ మేష్టారు.  

-కర్లపాలెం హనుమంతరావు

(రచన మాసపత్రికలో ప్రచురితం)


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...