సాహిత్యం :
ఆనందలహరి
– కర్లపాలెం హనుమంతలావు
( ఈనాడు - ఆదివారం - సంపాదకీయం )
మనుచరిత్ర వరూధిని నుంచీ సముఖం కృష్ణప్ప అహల్యా సంక్రందనం కథానాయిక చెలికత్తె దాకా... అందరికీ ఆనందమంటే - అదేదో వంటి నుంచీ పుట్టే పరబ్రహ్మ స్వరూపం! ' ఎందే డెందము కందళించు రహిచే - అందే ఆనందో బ్రహ్మం ' వరూధినికి. అహల్య సహేలికీ 'ఎందును సంచరింపక అఖిలేంద్రియముల్ సుఖమొందు* అట్టి బుద్ధి కగోచరమైన ఆనందమే పరమానందం. తార అతి చొరవతో మనసు చెదిరిన శశాంకుడూ ప్రారంభంలో పరకాంత అని కొంత, అధర్మమని కొంత చింత పడ్డా చివరికి దేహరుచికే దాసోహమన్నాడు. అడిదం సూరపరాజు' కవిజనరంజనం' కథానాయకి చంద్రమతి శోభనం గదిలో కడుగు పెట్టే వేళ చెలికత్తెలకు బహుపరాకులు చెప్పవలసిన పరిస్థితి. మొగుడు మునిపంట నొక్కగానే మొగమలు అప్పుకునే అంతటి లజ్జావతీ ఆరు మాసాలు ముగియ కుండానే అతగాడు అడిగీ అడగక ముందే తియ్యని మోవి నందించే గడసరితనానికలవాటు పడింది! ఇదంతా పడుచుతనపు పరవళ్ళ ఉరవళ్లు అని సరిపుచ్చు కుంటే సరిపోతుందా? మరి రఘునాథ నాయకుడి 'శృంగార సావిత్రి' విశ్వామిత్రుడి వ్యధో? మద్ర దేశాధిపతి ఉగ్రదీక్షను భంగం చేయాలని బదరికావనానికి బయలుదేరిన మేనక వెనుక ' అకట ! నీవు నన్ను విడవాడి చనం బదమెట్టు లాడు? ' నంటూ అంతటి జితేంద్రియుడు గోడు గోడు మంటూ వెంట బడ్డాడే! ఆనందం ఒక అర్థవమయితే అందులో ఒక్కొక్కరిది ఒక్కో తరహా మునక. రసరమ్య కావ్యం రాయమని రాయలడిగినప్పుడు పెద్దనామాత్యుడి వంటి పెద్ద మనిషే 'నిరుపహతిస్థలం, రమణీయ ప్రియదూతిక చేతి కప్పుర విడెం, ఆత్మకింపయిన భోజనం, ఊయల మంచం వంటి భోగాలు లేనిదే ఊరక కృతులు రాయడం అశక్యమనేశాడు. మరి మామూలు మనిషికి ఆనందమంటే భౌతిక సుఖాలభోగమని మాత్రమే అనిపించదా?!
నిజానికి ఆనందానికీ భౌతిక సుఖాలకీ అసలు సంబంధమనేది ఉందా?
ఆనంద కానన కాశీనాథుడు ఒక బికారి. సిలువ మేకులకు వేలాడే క్రీస్తు పెదవుల మీద చలువ నవ్వులు ఏ ఆనందానికి ప్రతీకలు?! ఆనందమంటే కేవలం భౌతిక భోగానుభవం అనే భావన బలంగా ఉన్నంత కాలం భిక్షాపాత్ర ధరించిన బుద్ధభగవానుని వదనంలోని ఆ ప్రశాంత చింతన అర్థం కాదు. చిదానంద స్వరూపంగా సదా మనం సంభావించే ఏ భగవదవతారమూ భూమి పై సుఖపడిన దాఖాలాలు లేవు - అంటున్నారు స్వామి సుఖబోధానంద. లోకాదర్శం కోసం చివరికి జానికినయినా సంతో షంగా పరిత్యజిస్తానని ఆచరించి చూపిన పత్నీ వ్రతుడు అందరి మన్ననలు పొందిన మర్యాదరాముడు. రాజసూయయాగ వేళ అతిథి అభ్యాగతుల ఎంగిలి విస్తరాకులను గోవర్ధనోద్ధరణమంత సంబరంగా ఎత్తి పారవేసిన ప్రక్షాళకుడు గోవిందుడు. అన్నమయ్యని బాలాజీ ఎవరి బలవంతాన పల్లకీలో మోసుకెళ్ళాడు?! తామరాకు మీది నీటి బొట్టు తత్త్వం నాకత్యంత ప్రియపాత్రం - అనిగీతలో భగవానునువాచ. ఆనందం... భౌతిక సుఖాలు పాలూ నీరూ వంటివి. నీటిలో నేరుగా కలిస్తే పలుచనయే పాలు పెరుగయి మధనకు గురయి వెన్న ముద్దగా మారితే ఏ నీరూ ఏమీ చేయలేదు. పెరుగుగా మారటానికి పాలకు పెట్టే 'తోడే' ఆనందం అంటారు మాతా అమృతానందమయి. ఒక కొత్త ముఖాన్ని చూడకుండా | ఒక కొత్త సుఖాన్ని చవి చూడకుండా | నారోజుమరణిస్తే | నేను బ్రతికి వున్నట్లా ? ' అని ఓ ఆధునిక కవి అంతర్మధనం. మనసుతో పాటు మన పరిసరాలకూ సరిసమానంగా సంతోషాన్ని పంచేదే అసలైన ఆనందం. అది ఉండేది పైనో, పక్కనో, పక్కలోనో కాదు. కస్తూరి మృగం దేహ పరిమళంలాగా అది పుట్టు కొచ్చేది మనలోని మంచి భావనలలో నుంచే! మనిషి ఆ పరిమళమృగంగా అనందిమనే చందనం కోసం మూల మూలలా వెదుకులాడుకోవడమే ఈనాటి అన్ని అశాంతులకు మూలకారణం.
వేసారిన మోహము దేనిపై ? - క్షీర జలనిధి నీలోనే ఉండగ, అరవి దీపము లోన ఉండగ' అని మన భావకవి కృష్ణశాస్త్రిలా కులాసాగా పాడుకునే ఆ తాతల తరం నుంచి అనందానికి అసలైన అర్థం ఆధునికులూ తెలుసుకుంటే అదే బ్రహ్మాండంలో లభించే అసలుసిసలు ఆనందో బ్రహ్మం .
***
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ఆదివారం - సంపాదకీయం )
No comments:
Post a Comment