Saturday, December 4, 2021

వాహనవిలాపం - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు దినపత్రిక - 01-02-2016 - ప్రచురితం )

 


వాహనవిలాపం 

- కర్లపాలెం హనుమంతరావు

(  ఈనాడు దినపత్రిక - 01-02-2016 - ప్రచురితం ) 


---  




వాహనవిలాపం 

*

(  ఈనాడు దినపత్రిక - ప్రచురితం ) 


అనగనగా ఓ బంద్ రోజు ... 


బైట తిరిగే పనిలేనందున రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రాంగణంలో వాహనాలన్నీ  కొలువు తీరాయి. 


బస్సు సభ ప్రారంభమయింది. 


బందులూ, ధర్నాలూ, రాస్తారోకోలు, హర్తాళ్లు - రాష్ట్రంలో ఎక్కడ ఆందోళన జరిగినా ముందు ఎర్రబస్సుల మీదే అందరూ కన్నెర్ర చేసేది ! దారినపోయే దానయ్య సైతం సందు చూసుకుని మరీ రెండు రాళ్ళేసి సరదా తీర్చుకుంటుండె !


నిజం. చిన్న దెబ్బ తగిలితే చాలు పెడబొబ్బలు పెట్టే ఈ అబ్బాయిలు, అద్దాలు పగిలితే మనకూ అంత బాధ ఉంటుందని ఎందుకర్ధం చేసుకోరు? ఎక్కడ ఎవరు ఏ పూట ఏ బందుకు పిలుపిస్తారో... ఎప్పుడు మనమీద నిప్పు రాజేస్తారోనని నిత్యం గుండెలు గుబగుబలాడి పోతున్నాయి!


బాగా చెప్పావు. అర్ధరాత్రి ఆడది రోడ్డు మీద నిర్భ యంగా నడిచినప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యమొచ్చినట్లని బాపూజీ అప్పుడెప్పుడో అన్నారుగానీ, ఇప్పుడైతే పట్టపగలు రోడ్డు మీద బస్సులు సురక్షితంగా తిరిగి నప్పుడే అసలైన స్వతంత్రమొచ్చినట్లని అనుండేవారేమోనని నా అనుమానం. మన పాట్లు  తెలుసుకోవటా నికైనా మళ్ళా ఒకసారి మహాత్ముడు భూమ్మీదకు దిగి వస్తే బాగుణ్ను!'


ఎన్నికల ముందు ఈ నేతలందరూ బస్సు యాత్రలని ఎన్ని బిల్డప్పులిస్తారో గుర్తుందా! ఇప్పుడొక్కడికీ మన డొక్కు బతుకుల గురించి ఆలోచించనే  లేకుండా పోయింది! 


నిజమే. నాయకులైవా వెళ్లేందుకు  వణికిపోయే మారు మూల పల్లె డొంకల్లోకి జంకూగొంకూ లేకుండా రోజూ వెళ్ళి వస్తుంటామే! మనం మొహం చాటేస్తే పల్లెపట్టుల్లో కోళ్లూ కొక్కొరొక్కో అని కూయటానికి బద్ధకిస్తాయి ! పిల్లకాయల్ని బళ్లకి చేర్చాలన్నా, పాలూ పెరుగూ బుట్టలూ తట్టలూ మార్కెట్లలోకి తరలించుకుపోవాలన్నా, రోగాలొస్తే పెద్దాసుపత్రులో చేరాలన్నా , సినిమాలకీ  షికార్లకీ ఆఫీసులకీ సమయానికి చేర్చటానికీ  మన ప్రగతిరథ చక్రాలే వీళ్లకి గతి! మరి మనకి ఈ దుర్గతి ఏమిటని వెళ్ళి కడిగేద్దామా .. పదండి!


బాగా చెప్పావు. నా దేశం, నా రాష్ట్రం, నా జిల్లా, నా మండలం  అంటూ తేడాలు  పెరిగిపోతున్న ఈ కలికా లంలో అన్ని వర్గాలనూ ఒకే దిక్కుకేసి నడిపించే అసలై న మార్గనిర్దేశకులం మనం. అడిగినా అమ్మయినా పెట్టడానికి తటపటాయించే ఈ కరవు రోజుల్లో చెయ్యూపీ ఊపగానే  రయ్యిమనిపోయే మనం ఠపీమని ఆగి లిఫ్టిస్తున్నామే! మనకే ఎందుకో ఈ అష్టకష్టాలు? 


అవును. ఎక్కడో ఆస్ట్రేలియాలో మన పిల్లల  మీద దాడులు జరుగుతున్నాయని  తల్లడిల్లే  మీడియాసైతం  ఇక్కడ మనమీద ఇలా వాళ్ల కళ్లెదుటే నిత్యం దాడులు జరుగుతున్నా నోరెందుకు మెదపడం లేదో అంతుపట్టదు! ఆడ బిడ్డల మీద యాసిడ్ దాడులకు తెగబడే రౌడీలను  ఎన్ కౌంటర్లు చేసే  పోలీసులూ బస్సుల మీద ఇలా అక్కసు చూపేవాళ్ల పై  పెట్టీ కేసులు పెట్టేందుకూ  'ఐపీసీ'లో సెక్షన్లేవీ  లేనట్లు చేతులు కట్టేసుకున్నారు...!


పక్క మనిషి బాగుపడుతుంటే రెక్క పుచ్చుకు వెనక్కి లాగే మత్సర జనాభా పెరిగిపోతున్న ఈ జమానాలో, ఏ లాభం చూసుకో కుండా బస్సెక్కిన ప్రతి మానవుణ్ని 'పదండి ముందుకు' అంటూ  తీసుకెళ్లే మంచి వాతావరణం ఈ కాలంలో మన బస్సుల్లో మించి మచ్చుకైనా మరింకెక్కడైనా కనిపిస్తుందా ? 


దశాబ్దాలుగా ఆడవారి దశ తిరిగే   బిల్లులను  చట్టాలు  చేయమంటే నేతలు  దిక్కులు చూస్తున్నారు  . ఆ ఆకాశంలోని సగానికి మనమెప్పుడో ప్రత్యేకమైన  సీట్లు కేటాయించాం . రైట్ రైట్ అనటమేతప్పించి  'రాంగ్' అనే మాటే మన కండక్టర్ల నోట రాదు కదా! పదండి వెళ్లి ఆ దేవుడినే అడుగుదాం! 


ఎంత నాస్తికుడైనా  ఎర్ర బస్సు ఎక్కాడంటే అనుక్షణం  ఆ నారాయణుణ స్మరణ తప్పదు కదా  !  మనం చేయించే ప్రయాణాల  పుణ్యానికా... గూండాల  చేతుల్లో మన కిన్ని శిక్షలు ! అడగాల్సిందే  ఆ దేవుణ్ణి ఇప్పుడైనా! 


అడుగుదాం  సరే. మీకేం కావాలి అని ఆ దేవుడు ఎదురడిగితే ? బదులేమిచెప్పాలో మనం కూడా ముందే ఒక మాట అనుకోవాలి  కదా! వట్టి ఎర్ర  జండా ఊపుకొంటూ పోతే సరా... ఎజెండా కూడా  ఉండాలిగా? 


 నిజమే...!ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి . ఎలాగూ మన తెలుగు శకటాల కెవరూ కవరేజి ఇవ్యరు  . అద్దాలు పగిలిన బస్సులు, కాలి బూడిదైపోయిన మన బతుకులనైనా దేశాధ్యక్షుడి  ముందు కవాతుకు అనుమతిస్తే దేశ వ్యాప్తంగా  మన దౌర్భాగ్యం హెడ్ లైన్ల కెక్కే స్తుంది . ఆ వేడుకలకైనా రూటు క్లియర్ చెయ్యమని వేడుకుందాం .. పదండి ! 

***

--- 


- కర్లపాలెం హనుమంతరావు

(  ఈనాడు దినపత్రిక - 01-02-2016 - ప్రచురితం ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...