ఈనాడు - సంపాదకీయం
అష్టమ స్వరం
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సంపాదకీయం - 06 - 04 - 2012)
సృష్టి ప్రారంభంలో ఓ సాయం సంజెవేళ కైలాస శిఖరంమీద ఓ వంక వాణి మాణిక్య వీణారవం, మరోవంక మహేంద్రుని వేణుగానం, ఇంకో దిక్కున విధాత తాళవాదనం, చెంతనే శ్రీలక్ష్మి గానాలాపన, తదనుగుణంగా మహావిష్ణు మృదంగ తాడన, దైవ నేపథ్య సంగీత సహకారంతో సాగే ఆనందతాండవం మధ్య అలుపుతీత కోసం క్షణకాలం ఆగిన నెలతాలుపు(శివుడు) నాసికా పుటాలనుంచి అవతరించినవే చతుర్వేదాలు! అందులోని సామవేదం ఉపాంగంగా ఆవిర్భవించి గాంధర్వంగా గణుతికెక్కిన స్వరశాస్త్రమే సంగీతం!
పరమపురుషుడైన మహేశ్వరుడి సంకల్పం సంగీతమైతే, ఆ సామగాన జనిత భావానికి సప్త స్వరాలనందించి సహకరించింది ప్రకృతే' అంటారు స్వరమేళ కళా నిధి రామామాత్యులు. కృతుల అభ్యాస ఆరంభంలో సంగీత విద్యా ర్థులు ఆలపించే తొలి పిళ్ళారి(వినాయకుడు) గీతరాగం ఆరోహణ అవరోహణలు రెండింటిలో ముందుండే స(షడ్జమ) స్వరానికి నెమలి క్రీంకారమే స్పూర్తి.
కైలాస సానువుల్లో ప్రతిధ్వనించే నందీశ్వరుడి కంఠారావమే 'రిషభంగా స్థిరపడినా 'రె' స్వరం.
వేటూరివారి ఓ పాట చరణంలోలాగా 'మురళి వనాంతాల విరియు వసంతాల' చిగురించే మోహన గాంధారంలోని ముఖ్య 'గ' కార స్వరానికి మాతృక మేష రవమే.
బృహదారణ్యకోపనిషత్ ప్రకారం గాంధార స్వర నాదమే సామగానానికి ఊపిరి. మోక్ష లక్ష్మీదేవి గోపుర శిఖర కలశంవంటి హిందోళ మధ్యమం (మకర స్వరం) పుట్టింది క్రౌంచపక్షి గళం నుంచే.
శంకరుడికి పరమ ప్రీతికరమైన హిందోళాన్ని కూతురు సంకరం చేసి నందుకు ఆందోళన చెందుతుంది 'శంకరాభరణం'లోని ముఖ్యపాత్ర. కోకిలమ్మ అందించిన కుహుకుహూలే సప్తస్వరాల్లో సంధించిన పంచమ ' ప' స్వరానికి ప్రేరితం.
ఆరో స్వరాక్షరం 'ద ' కారం (దైవతం) గుర్రపు సకిలింతలోనుంచి పుట్టినట్లు చెబుతారు.
నిషాదంలోని ప్రధాన ధ్వని 'ని' గజ ఘీంకార జనితం.
చంటిబిడ్డలో రామచంద్రుణ్ని చూసుకుంటూ కన్నతల్లి పాడే ' రామా లాలీ... మేఘశ్యామ లాలీ' జోలపాటలో జాలువారేదంతా వాత్సల్య' రాగమే ' .
కంటి దీపంవంటి కూతురు పెళ్ళిచేసి అత్తవారింటికి అంపకాలు పెట్టేవేళ 'సెలవిస్తి మాయమ్మ సెలవిచ్చినాము/ చెలగి మీ అత్తింట్లో బుద్ధిగలిగుండు' అంటూ కన్నవారు కన్నీటితో మప్పే సుద్దు లనిండా వినిపించేది వియోగ ' రాగం' .
మునిమాపులో మధురానగరి దారికాచి కొంగుపట్టి గోలచేసే గోపాలదేవుణ్ని మందలిస్తూ సాగే నెర బాణీలనిండా సరసంగా తొంగి చూసేది సరాగ ' రాగం' .
శాస్త్రీయం, జానపద, పాశ్చాత్యం- ధోరణి ఏదైనా దారులు తీసేది మాత్రం బ్రహ్మానంద సామ్రాజ్యానికే 'మూలాధారజ నాద మెరుగుటె ముదమగు మోక్షమురా ఓ మనసా!' అని గదా త్యాగరాజ స్వామివారి రాగహృదయ ప్రబోధం. వస్తు వైవిధ్యంతో సృజించిన వేలాది గీతాల స్వతంత్ర రాగశైలి 'రవీంద్ర సంగీత్' మీద సంప్రదాయవాదులు రేపిన దుమారం మీద రవీంద్రుడు ఇచ్చిన సమాధానంలోనే సంగీత సామ్రాజ్య ఎల్లల లేమి తేటతెల్ల మవుతుంది . అవధులు లేనిది నాదప్రపంచం. కంచెలు కట్టేపని అవివేకం. చిరకాలం మన్ను తుందో... చిత్తుకాగితం పడవలా తడిసి మునుగుతుందో తేల్చేది కాల ప్రవాహమే గదా!' అంటారా రాగరుషి. పుణ్యజ్యోతి, పూర్ణగగన, మధు రహేరి, సకలభువన' అంటూ కొన్ని పదుల మధుర కంఠాలు ఎలుగెత్తి పాడే రవీంద్రుడి గీతాలు నిజానికి చర్చి ఘంటారావాలంత ఉత్తేజితంగా ఉంటాయి. మంచి సంగీతానికి మరణమెందుకుంటుందీ!
సంగీతానికేదో సూదంటురాయి లక్షణం లేకపోయుంటే, బ్రౌన్ దొరంతటివాడు నెలలపాటు కుమార రాముని కథల వంటివి చెప్పిం చుకొనేందుకు అడవి మనుషులను సొంత భవనంలో ఎందుకు ఉంచుకుంటాడు! సీమపాలనకు ప్రతినిధిగా వచ్చిన బోయల్ దొర స్వరశాస్త్రం ఆయువుపట్లు తెలుసుకోవడానికి రాత్రిళ్లు పల్లెపట్టుల్లో తిరిగేవాడు. బెంగాలీ కొండ సంగీతాన్ని, భోజ్ పురీ పల్లెరాగాల్ని, పంజాబీల వీరగీతాలను , బీహారీ అడవి పాటలను శ్రమించి సేకరించిన నాదప్రియులలో నాటి జిల్లా మేజిస్ట్రేటు హ్యూజ్ ప్రేయర్నుంచి కోల్, ఆర్.సి.టెం ఫుల్, సర్ జార్జి గ్రియర్సన్ వంటి తెల్లదొరల దాకా కొల్లలు.
పశువు నుంచి శిశువుదాకా రాగానికి లోబడని జీవి ఉండదు. రాగానికి రాళ్లు కరిగించే లక్షణం ఉందో లేదోగానీ, రాయివంటి కసాయి గుండెల్ని నీరు చేసే గుణం మాత్రం ఉంది. అమృతవర్షిణి రాగం ఆలపిస్తే మేఘాలు మురిసి కురుస్తాయని మన విశ్వాసం. సర్వకళల్లో గానం ప్రాముఖ్యమేమిటో పానుగంటి లక్ష్మీ నరసింహం మాలతీ మాధవం లోని ఒక పద్యంలో హృద్యంగా తెలియజెప్పారు. 'మానసికంగానే కాదు శారీరకంగా సైతం రసప్రయోగంవల్ల కలిగే ప్రయోజనాలు అశేషం' అంటారు గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య. చిన్న చిన్న శస్త్ర చికిత్సలప్పుడు సంగీతం వినడంవల్ల ఆందోళనలు తగ్గుతున్నట్లు ఆక్స్ ఫర్డ్ లోని జాన్ ర్యాడ్ క్లిఫ్ ఆసుపత్రి వైద్యులు కొత్తగా నిర్ధారించారు.
శరీరంలోని ఏదో ఒక భాగానికి మాత్రమే మత్తుమందిచ్చి శస్త్ర చికిత్స చేసేటప్పుడు రోగులకు ఇష్టమైన సంగీతం వినిపిస్తే మెలకువలోనూ ప్రశాంతంగా స్పందిస్తున్నారట. నొప్పిని బాగా తట్టుకోవటానికి, త్వరితంగా కోలుకోవటానికి సంగీతం సంజీవనిలాగా పనిచేయటం శుభ పరిణామం' అంటున్నారు అధ్యయన బృందం నేత డాక్టర్ హజీమ్ సదిదీన్.
అద్వైత సిద్ధికే కాదు, ఆరోగ్య లబ్ధికీ గానం ఒక సోపానంగా మారడం నాదప్రియులందరికీ మోదదాయకం. సప్తస్వరాలకు ఆరోగ్య స్వరం జతకూడటం- బ్రహ్మానందం అనే అందలాన్ని అందుకోవడానికి అందివచ్చిన అష్టమ స్వరం.
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సంపాదకీయం - 06 - 04 - 2012 )
No comments:
Post a Comment