Saturday, December 4, 2021

ఇంతి విలువ ఎంచ తరమా - ఈనాడు సంపాదకీయం

 ఈనాడు - సంపాదకీయం : 

ఇంతి విలువ ఎంచ తరమా?

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 30-01 - 2011 ) 


గోమతీ తీరంలో అశ్వమేధ దీక్షితుడైన శ్రీరాములవారికి వాల్మీకి మహర్షి వెంట వస్తున్న సీతమ్మ భగీరథుడి రథాన్ని అనుసరించే సుర నదిలా తోచగా సౌమిత్రికి ఇక్ష్వాకుల యశోలక్ష్మిలా, భరతుడికి కల్లాకపటమెరుగని కన్న తల్లిలా కనిపించిందంటారు కరుణశ్రీ . పెద్దత్తగారి దృష్టిలో ఆ చిట్టితల్లి చిక్కిపోయిన తనూవల్లి,  కైకేయికి లోకులు పలు గారకులుగా కాకాయని అరచి కరచి ఏకాకిని చేసిన కోకిల, సుమిత్రకు బతుకంతా బాష్పంగా, పారిజాత పుష్పంగా పతిసేవా వ్రతాన్ని సాగిం చిన పరమసాధ్వి .  ఆ కవిభావన వెనుక ఉన్న  ఔచిత్యం స్త్రీ జన్మలోని ఔన్నత్యమే! మహాభారతమూ బోధించింది అదే. పదిమంది ప్రబోధకులకన్నా  జ్ఞానాన్ని అందించే గురువు, పదిమంది గురువుల కన్నా కర్తవ్యాన్ని బోధించే తండ్రి,  పదిమంది తండ్రులకన్నా జీవమిచ్చి  జీవితాంతం ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా సేవించి ప్రేమించే తల్లి మిన్న' అని ఆ పంచమవేదం చెబుతోంది. ఇల్లాలిగా స్త్రీ ఆదరణ కన్నతల్లినే మరపిస్తుంది . వలపులతో పతిదేవుని సేవలతో అత్తమామలను, అణకువతో అతిథులను,  ప్రేమతో బిడ్డలను అలరిస్తుంది. అంతటి సేవల భాగ్యాన్ని ప్రసాదించేది కన్యాదానం. వనాలతో , పర్వతాలతో విలసిల్లే ఈ భూమండలం మొత్తాన్ని దానమిచ్చినందువల్ల కలిగే పుణ్యఫలం సర్వాభరణ సంయుక్తమైన ఒక్క కన్యకనిచ్చినందువల్లే లభిస్తుందని మత్స్యపురాణం చెబుతోంది. అవతారమూర్తి అయినా అణువంతే పుడ తాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడనే గ్రహింపు ఉన్న వారెవరూ ఆమె సేవలకు వెలకట్టే దుస్సాహసం చేయలేరు.


ఆడజన్మ ఎంతో అమూల్యమైనది. అందువల్లే బ్రహ్మ ఎంతో శ్రమించి ఆ లావణ్యవతిని సృష్టించాడన్న నీతిశ్లోకం చమత్కారంగా తోచినా తరచి చూస్తే ఎంతో నిజము ఉన్నది . 'నా బతుకు దైనందినపు భోజనరుచివి/నా యదృష్టపు తాళ్ళకొనల వైచుకున్న ముడివి నీవు' అంటూ ఆధునిక యుగంలో సైతం తిలక్ వంటి కవులు పలవ రించారు మరి! దీనికంతా  మగవారి భావనలో మగువస్థానం పది లంగా ఉండటమే కారణమనే   వాదనా కద్దు. సోదరసేవ నెపంతో కట్టుకున్న ఇల్లాలిని ఏళ్ల తరబడి అంతఃపుర అనివార్య నిద్రలకు వదిలేసిన వారున్నారు. ప్రజాభీష్టం కోసమేనంటూ అగ్నిపునీత అయిన ధర్మపత్నిని కానల పాలుచేసిన మర్యాదాపురుషోత్తముల గురించీ  చదువుకున్నాం. తన సత్యవ్రతం కోసం తాళికట్టిన భార్యను నడిబజారులో విక్రయించిన హరిశ్చంద్రులున్న చరిత్ర. . పోయిన భాగ్యాన్ని తిరిగి రాబట్టుకొనేటందుకు జీవిత భాగస్వామిని జూదంలో పణంగా పెట్టిన ధర్మజుల సంగే తిమిటో! పితృవాక్యపాలన పేరుతో కన్నతల్లి తలనే తెగనరక సాహసించిన అవతారమూర్తుల కథలా తెలుసు. కాసుకు లోనై తల్లీదండ్రీ/ నెనరూ న్యాయం విడనాడి పుత్తడిబొమ్మ పూర్ణమ నొక / ముదుసలి మొగుడికి ముడివేసిన హృదయ విదారక కథా మరచిపోలేనిది. భర్త అంటే భార్యతో కలసి  ఏడు అడుగులు వేసే వేళ  ఆహారం, బలం, పవిత్రకార్యం, సౌభాగ్యం, పశువృద్ధి, రుతుసంపద, సత్సంతాన సాధనల్లో తోడూనీడగా నడుస్తానని సప్తవదినాడు ఆమెకు బాసలు చేస్తేనే కాదు  మగడు. వాటిని  చిత్తశుద్ధితో మనసా వాచా కర్మణా కట్టుబాటుగా  చాటుకునేవాడే నిజమైన చెలికాడు.  ' మగవాడి మనసులోని మహా బోధి వృక్షం ఆడదానిమీద ఏనాడో కూలిపడింది' అని మగువలు ఆవేదన చెందే దుస్థితి రాకూడదన్నది ఆశావాదం. ' ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం'  అన్నదే నేటి నిజం. ''నా నొసళ్ళమీద పురుషచేతి రాతలు గుర్తులు ఏ ఎరైజర్లు, రిమూవర్లు తుడవలేని తరతరాల శాసనాలు' అనేది నిన్నటి నిస్పృహ. 'మనమంటే 34, 24, 35 కొలతలమైనచోట/ దైహిక సౌందర్యపిపాసే మన సమస్త జీవిత లక్ష్యాన్ని చేసిన చోట/ ఎంత హింస అనుభవిస్తున్నామో కదా!' అనేది నేటిస్పృహ. 'మనుగడకు అందం అనివార్యమైనచోట ఈ జీవితాన్నే ద్వేషిద్దాం!' అనే దృక్పథం రాత్రికి రాత్రే మొగ్గ తొడిగింది కాదు. దాని వెనుక - ఫ్రెంచి విప్లవం నాటినుంచీ స్త్రీల హక్కులకోసం ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న పెద్ద ఉద్యమ చరిత్ర ఉంది. తన మీద తన హక్కుకోసం నేటి యువతి పోరాడుతోంది. కుటుంబ పుట్టుపూర్వోత్తరాలపై శాస్త్రీయ అధ్య యనం చేసిన ఏంగెల్స్- వర్గ సమాజంలోని స్త్రీలపట్ల పురుష పీడనను ప్రస్తావిస్తూ ఇంటి చాకిరిని విశ్లేషించారు. ఇప్పుడు ఐక్యరా జ్యసమితి లాంటివీ సమాజ నిర్మాణంతోపాటు గృహ నిర్వహ ణలోనూ స్త్రీలు అందించే సేవలకు విలువ నిర్ధారించే పనిలో ఉన్నాయి. కార్యేషు దాసీ, కరణేషు మంత్రి, శయనేషు రంభా, భోజ్యేషు మాతా అని చిరకాలం మహిళ నెత్తిన పెట్టింది తగరపు కిరీటాలే. ఆమె అందించే రకరకాల సేవలకు మూల్యం మదింపు వేస్తే? ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక వివాహిత దుర్మరణం కేసులో సర్వోన్నత న్యాయస్థానం - అదే చెప్పింది. మహిళ సంబంధీకులకు నష్టపరిహారం ఎలా ఎంత ముట్టుజెప్పాలో నిర్దేశించిన విశిష్ట తీర్చది. ఇంటిచాకిరి చేసే ఇంతి సేవలకు ఇంతవరకు సరైన విలువ లెక్కింపు విధానం రూపొందించనందుకు వాహనాల చట్టాన్ని కోర్టు తప్పుపట్టింది. ఆ లోపాన్ని వెంటనే సరిదిద్దుకోవాల్సిందిగా పార్లమెంటుకు సూచించింది. 'ఆకాశంలో సగంగా ఉన్నా అవకా శాలు మాకు గుండుసున్నా! మేం పాలిచ్చి పెంచిన జనంలో సగ మమ్మల్ని విభజించి పాలించటం దారుణం' అన్న అమ్మ బాధన అందరూ అర్ధం చేసుకోవాలి. ఆడదైపుట్టే కన్నా అడవిలో మా పుట్టడం మేలన్న నిర్వేదాన్ని తుడిచిపెట్టాలి. అలాంటి పరివర్తన సర్వోన్నత నిర్దేశం మొదటిమెట్టు కావాలి!


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 30-01 - 2011 ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...