ఈనాడు - గల్పిక- హాస్యం
రంగుల రాజకీయం
- కర్లపాలెం హనుమంతరావు .
( ఈనాడు - గల్పిక- 06-03 - 2015 )
ప్రకృతి పూర్తిగా పాలిపోయి ఈసురోమం మంటే, హుషారుగా ఉండమని రంగులు చల్లుకుంటూ రంగప్రవేశం చేసేది హోలీ
పండుగ.
కేంద్రం ఆర్థిక పద్దులదీ అదే పద్ధతి. సర్కారు శాఖలు ఆకులు రాలిన చెట్ల మాదిరి వెలా తెలబోయే వేళకు, నీళ్లడుగంటిన జలా శయాల మాదిరి సర్కారు బొక్కసాలు బోసిపోయే నాటికి ... కాసుల గలగలలు చెవికి వినిపిస్తూ దూసుకు వస్తుంది కేంద్ర బడ్జెట్.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈసారి హోలీకి ముందే రావడం దేనికి సంకేతం? రంగుల్లో సామ్యమా?
మోదీ మార్కు బడ్జెట్లో రెండు తెలుగు రాష్ట్రాలకూ చివరికి టోపీనే మిగిలింది. ప్రతి తెలుగు మొహమూ ''తెల్ల'బోయింది.
కడుపు మండిన కుర్రకారు ఎర్రజెండాలు పట్టారు. నీరసించిన ఉద్యోగులు 'నల్ల' బ్యాడ్జీలు పెట్టారు. ఒక్క బడ్జెటనే ఏముందిలే, స్థూలంగా చూస్తే రాజకీయం సమస్తం వర్ణ సంకర సంరంభం!
హోలీ రంగుల వేడుక ఒక్క పూటే. రాజకీ యాల్లో రంగుల ఆట ఏడాదంతా.
అడ్వాణీ నుంచి అదానీ దాకా , రాహుల్ బాబు నుంచి... రాందేవ్ బాబావరకు 'మరక' తప్పిం చుకోలేరు.
పండుగ గడిచే వరకు 'హోలీ' అంటూ పలకరించి రంగులు చిలకరిస్తారేమోనన్న భయంకొద్దీ పాతాళంలో దాక్కునట్టు న్నారు- రాహుల్ గాంధీ! మరక పడటానికి మనిషి కనపడాలా? మదర్ థెరిసా ఏ చట్టసభలో ఉన్నారని ఆమెపై మతం మార్పిడి రంగులు పిచికారీలతో చిమ్ముతున్నారు!
రాళ్లు విసురుకునే శత్రువులు సైతం రంగులు చల్లుకునే సౌహర్ద పర్వం హోలీ అంటారా... అంతకన్నా హోలీకార్యం కదా రాజకీయం!
హోలీ పిల్లలకు మాత్రమే సంబరం కావచ్చు. రాజ కీయం పెద్దలకు కూడా పెద్ద సరదా తీర్చే క్షేత్రం.
హోలీలో రంగులు కేవలం 'ఆట'కే పరిమితం. రాజకీయాల్లో 'రంగులు' ఆటపట్టించడానికి వాటంగా ఉండేవి.
ఒక్క ఈ రంగుల పండుగ రోజునే దత్తన్న గులాబీ రంగులో మునిగి కనిపించేది. జగనన్న పచ్చరంగు అంగీలో మురి పించేది. కాస్త కష్టపడి తుడిపిస్తే ఇష్టనాయకుణ్ని గుర్తుప ట్టడం కష్టంకాబోదు పండగ మర్నాడు!.
మరీచి మహర్షి కనిపెట్టింది కేవలం ఏడు రంగుల్నే. హోలీలో వాడేవి వాటికే పరిమితం. మరి మన మరీచవారసులు వాడే రంగులో? కౌరవుల కాళ్లు చేతులు కూడా ఓ మూలకు చాలవు వేళ్లు ముడిచి లెక్కించుకోవడానికి!
హోలీలో రంగుల పరమార్ధం హుషారు, వినోదం మాత్రమే. రాజకీయాల్లో రంగుల పరమార్ధం బహుళార్థకం. మూలపడ్డ పథకాలకు కొండపల్లి రంగులు వేసి బజారులోకి మళ్ళిస్తే బోలెడంత పేరు, ఆదరణ! ఎన్డీయే ఆహార పథకం యూపీయే పాత పన్నాగమేనని సోనియాజీ అభియోగం! యూపీయే ఉపాధి సాయం వాజ్ పేయీ పాపాయికి కొత్త మేకప్ కాదా అన్నది మోదీజీ ఎదురు వాదం.
' రంగు పడుద్ది' అంటూ ఓ చిత్రంలో ఎదురుపడ్డ ప్రతి బెదురుగొడ్డునూ అదిలిస్తుంటుంది. ఒక దుష్టపాత్ర. ఎవడో వచ్చి పనిగట్టుకుని పోస్తేగాని పడని రంగు మరక హోలీ పండుగది. ఎవడికివాడుగా వాడుకగా సమయ సందర్భాలనుబట్టి రంగులు వాడుకునే పద్ధతి రాజకీయా లది.
మహా నటుడైనా నటించే కాసేపే మొహంమీద రంగులు కనిపించేది . రాజకీయాల్లో నేతలు పెయింట్ డబ్బాలు కోటు జేబుల్లో పెట్టుకుని తిరిగితేనే రాణించేది.
సీతాపహరణార్థం సాధువేషం వేసిన రావణాసురుడు విమానం ఎక్కిన మరుక్షణంలోనే అసలు రూపంలోకి వచ్చేశాడు! దుర్యోధనుడు మయసభా మధ్యంలో జారిపడటం చూసిన పాంచాలి, దుఃఖం నటించడం రాక కడగండ్లపాలయింది . ఎంత మహారాజైతే మాత్రం సుఖమేముంది? శకుంతల వంటి ముద్దుగుమ్మ భార్యనంటూ వచ్చి స్వీకరించమంటే వేళకు గుర్తుకు రాలేదని వద్దు పొమ్మన్నాడేమిటి దుష్యంత మహారాజు? అదే కలియుగంలోగాని జరిగి ఉంటే- చప్పున ముఖానికంత ప్రేమ రంగు పులుముకొని వచ్చిన అవకాశాన్ని సద్విని 'యోగం చేసుకోడా నవీన దుష్యంతుడు!
ప్రసంగానికి ముందు విత్తమంత్రి మోసే తోలుపెట్టె రంగు, వేసుకునే పెట్టీకోటు రంగు మీదనే జాతీయ ఛానళ్ల కళ్లన్నీ! అదే పనిగా ప్రత్యేక ప్రసారాలు చేసేదెందుకు?
తెల్లకార్డు, గులాబీకార్డు అంటూ పౌరులకిచ్చే గుర్తింపు పత్రాలకు రంగే ప్రధానం.
నెత్తిమీద తెల్లటోపీ తప్పిస్తే, ఆమ్ ఆద్మీ నేతను గుర్తుపట్టడం ఎంత కష్టం? పచ్చ రంగు అంగీలల్లో బహిరంగంగా కనబడినంత సేపే తెదేపాలో సభ్యత్వమున్నట్లు. పచ్చ ధనం కోసం తెలంగాణ సర్కారు పడే పాట్లు, నల్లధనం కోసం కేంద్రప్రభుత్వం చేసే ఫీట్లు... రంగులతో లింకులు లేకుంటే రాజకీయాలకు రంజే ఉండదు.
ఏ రంగురాయి ధరిస్తే నాలుగురాళ్లు గుట్టుచప్పుడు కాకుండా కూడగట్టుకోవచ్చో చెప్పే రంగురాళ్ల శాస్త్రానికి రాజకీయాలలో ఎంతో గ్లామరే!
ఇంద్రధనుస్సులో ఉండేవి ఏడు రంగులే. రాజకీయాలలో నలిగే రంగులు చూసి ఊసరవెల్లైనా ఖంగు తినాల్సిందే.
హోలీ రాక సాధారణంగా ఫాల్గుణ పున్నమికే. జైట్లీ బడ్జెటు దెబ్బకు కాళరాత్రిగా మారిందీ సారి తెలుగువాడికి . మళ్ళీ వచ్చే హోలీనాటికైనా మన తెలుగు రాష్ట్రాల ఖజానాలు నిండుగా గలగలలాడాలి . అప్పడే అసలైన రంగుల పండుగ.
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - గల్పిక- 06-03 - 2015 )
No comments:
Post a Comment