ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం
యాత్రా రాజకీయాలు
రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - గల్పిక- తేదీ లేదు )
బాబ్లీని చూడాలని మందితో అన్నేసి బస్సుల్లో అలా పొలోమని దండ యాత్రలా పోవడం దండగ్గదా బాబాయ్! ఏ చీకటి మాటునో చటుక్కుమని ఆ ప్రాజెక్టు ఫొటోలు నాలుగు కొట్టుకొచ్చి నలుగుర్లో పెట్టిఉంటే గుట్టు బైటపడకుండా ఉంటుందా? ఇప్పుడేమో అంతా రాజకీయమని ఆడిపోసుకుంటున్నారు.
మరట్లా ఆడిపోసుకునేవాళ్ల మాజీ మహానేతా అధికారప క్షంలో లేనప్పుడు గుట్టుగా ఓ చెట్టుకిందో మఠం వేసుకుని కూర్చొని జనాల బాధలు వినే సావకాశమున్నా మరెందుక ని.. అలా పాదయాత్రంటూ అన్నేసి మైళ్ళు ఎండల్లో పడి చెడతిరిగింది ? అది రాజకీయం కాక ప్రజాసేవా? పదవులు దక్కటానికి పాదయాత్రో, రథయాత్రో, బస్సు యాత్రో ... ఏదో ఒక ప్రజాపథం పేరు పెట్టుకుని దేశం నాలుగు చెరగులా తిరిగిరావాలని... ఆనాడే అద్వానీ అందరికీ ఓ దగ్గరి దారి చూపించారు నాయనా! శాంతియాత్రో, సౌహార్ధ యాత్రో, ఓదా ర్పుయాత్రో... పేరేదైతేనేంగానీ- అన్ని యాత్రలూ పెళ్లిలో వరుడు కన్యాదానం అందుకునేముందు చేసే ఉత్తుత్తి కాశీయాత్రలవంటివేనని ఇవాళ రాష్ట్రంలో చంటి పిల్లాడినడిగినా చటుక్కున చెప్పేస్తాడు. ఇప్పుడు ఇక్కడే కాదు... దేశమంతటా నడుస్తున్నది ఈ టూరు రాజకీయాలే తెలుసా!
నిజమే బాబాయ్. పొరుగురాష్ట్రం కర్ణాటకలోనూ గాలి సోదరుల గనులగోలకు నిరసనగా చెయ్యిగుర్తు వాళ్ల పెద్దయెత్తున పాదయాత్రలు ప్రారంభించారు. నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర కూడా జనం మధ్యకొచ్చి తిరగాలని తెగ మోజు పడుతున్నారు. ఇవన్నీ టూరు రాజకీయాల జాబితా కిందకే వస్తాయా?
దేవుడికి జరిగే అన్యాయాలను ఆ దేవదేవుడికే విన్న వించుకోటానికి నిజంగానే భక్తజీవుడు మెట్ల మీదట్లా ఆరాటపడుతూ పొర్లుదండాల యాత్ర పెట్టుకున్నాడంటే నమ్మాలంటావా? దేవుడి బాధలే అలాగుంటే... ఓటరు దేవుడి బాధలెలా ఉండాలి? ఆ రాజీవపుత్రుడు అన్నేసి ఏళ్లబట్టి కుదురూ కుమ్మూ లేకుండా ఆసులో కండెలాగా దేశమంతా పడి గుట్టుచప్పుడు కాకుండా అట్లా చెడతిరగటం వెనకున్న 'గుట్టు'లో అసలే రాజకీయమూ లేనే లేదంటావా? ఏ రాజ కీయాలూ లేకపోతే ఎవరైనా ఎందుకురా అంతలా యాతనపడుతూ దేశదిమ్మర్లలాగా తిరుగుతారు?!
నువ్వు మరీ బాబాయ్! తననూ తనవారినీ దేశద్రోహులనుంచి కాపాడుకోవడానికి మావోసేటుంగ్ మహా యాత్ర చేశాడు. దక్షిణాఫ్రికానుంచి దిగీదిగగానే మన మహాత్మాగాంధీ దేశయాత్ర పెట్టుకున్నాడు. అవన్నీ రాజ కీయాలేనా ఏమిటి?
మరి కాకపోతే ఆ మహానుభావుల లక్ష్యాలకు మన మహానుభావుల లక్ష్యాలకు లక్షణాల్లో యక్షులకూ రాక్షసులకూ ఉన్నంత తేడా . అసలు గణాధిపత్యంకోసం వినాయ కుడు, కుమారస్వామిల మధ్య భూప్రదక్షిణాల పోటీ పెట్టినప్పుడే ఈ యాత్రా రాజకీయాలకు బీజం పడిందిరా అబ్బాయ్ ! పవర్ కోసం చేసే యాత్రల శక్తి ఆమ్మో... గద్దె దిగినవాళ్ళకు రోడ్డు ఎక్కడం తప్ప మరో దగ్గరి దారి లేనేలేదు.'
నికార్సయిన త్యాగధనులు కాకిగుంపులో కోకిల మాదిరిగా రాజకీయాల్లో ఏకాకులవుతారు నాయనా! ఎండుకట్టెలు , మట్టిబెడ్డలు, దుమ్మూధూళి దేనికైనా పనికిరావచ్చేమోగానీ- పదవిలేనివాడు కట్టి విడిచిన బట్టకన్నా కనాకష్టమని పెద్దవాళ్లు ఎప్పటినుంచో చెప్పు కొస్తున్నారు . పదవి పోయిన వాడిని, వాడిపోయిన పూవును ఎవరు భరిస్తారు. . ధరిస్తారు చెప్పు? కాలూ చెయ్యీ సరిగ్గా ఆడక పోయినా గద్దె దిగిపోవాలని కోరుకోవడం తప్పు . ఒక్క కైకేయి మనసును మళ్లించటానికే మంధరకు రెండు నిండు వారాలు పట్టిందని రామాయణం చెబుతోంది. ఎంతమంది మంధరల గడుసుతనం చూపించకపోతే ఇన్ని కోట్ల మంది జనం మనసులను నేతలు తమవైపు తిప్పుకోగలరు చెప్పు! వట్టి కతే చెప్పుకొంటూ పోతే ఎంత మంచి సినిమాకైనా నిద్ర ముంచుకొస్తుంది. ఫైట్లూ, పాటలూ, హీరోయిజాన్ని పెంచినట్లే- పదవిలేనివాళ్లు పాదయాత్రలు, బస్సుయా త్రలు, రథయాత్రలు అంటూ ఏవో పెట్టుకుంటూ జనంమధ్య తిరుగుతూ ఉండాలి...
నిజమే బాబాయ్! ఎన్నికలనేవి కచ్చితంగా ఇన్ని రోజులకొస్తాయని ఖాయంగా ఎవరూ చెప్పలేని పాడు రోజులు. వీలున్నప్పుడల్లా ఏ యాత్ర పేరుతోనో రోడ్డున పడటం తప్ప నేతలకు ఉత్తమమైన దారి మరొకటి లేదు
మరీ ముఖ్యంగా ప్రజాపునాదులు లేని నాయకులు వారానికొకసారైనా హస్తిన యాత్ర పెట్టుకుంటేనే అదృష్టం తిరగబడకుండా ఉంటుంది. చంద్రబాబు బాబ్లీ యాత్ర , చిరంజీవి బాలాజీ యాత్ర, జగన్ ఓదార్పు యాత్రలంటూ రాజకీయాలనుంచి రచ్చ చేసుకుంటున్నారేగానీ, రోశయ్య హస్తినయాత్రల వెనకున్న గడుసుతనాన్ని ఎవరూ గమనించటంలేదులాగుంది
నిజమే బాబాయ్! పెద్దాయనా ఈ మధ్య మన రాజకీయాలను మీరిపోయాడు. మెట్రో రైలు ప్రాజెక్టు వంకతో ఢిల్లీ రైలులో చేసిన ప్రయాణం వెనక ఏదో ఉందని నాకూ అనుమానంగా ఉంది.
తొందరలోనే మన ఆంధ్రదేశానికి ద్రాక్షసారా పరిశ్రమ తెచ్చే ఆలోచనా ఉందిరా. దాని పరిశీలనకు ఏ మహారాష్ట్రకో, కర్ణాటకకో వెళ్ళి ఏం చేస్తాడో చూస్తేగానీ- ఏ రాజకీయం సంగతి చెప్పలేం ఇప్పటికిప్పుడు. గోడ అడ్డమొస్తే వెనక్కి తగ్గటం పరాజయం. గుద్దుకుని ముందుకు పోవటం మొండితనం. దూకాలనుకోవడం దుడుకుతనం. కన్నమేయాలనుకోవడం కంతిరితనం . చుట్టు తిరిగిపోవాలనుకోవడం గడుసుతనం. ఆ భడరాయితనం పేరే రాజకీయం. అలా చుట్టూ తిరగటమే యాత్రారాజకీయం! ఇప్పుడర్ధమయిందా.. యాత్రా రాజకీయాలెందుకు పెరిగిపోతున్నాయో!
'ఇంకానా బాబాయ్! అదిగో పిన్ని దండయాత్రకు వస్తుంది నీమీదకే కాబోలు బాబాయ్! తప్పుకో.. ఇది గృహరాజకీయం!
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - గల్పిక- తేదీ లేదు )
No comments:
Post a Comment