ఇల్లే ఒక పార్లమెంట్
- కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు సంపాదకీయ పుట ప్రచురణ)
‘ఇల్లొక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనుకుంటే ఇంటాయన ప్రసిడెంటా? ప్రధానమంత్రా?’
‘పాకిస్తానయితే ప్రధానమంత్రి.. ఇండియా ఐతే ప్రెసిడెంట్ అనుకోరాదూ?శ్రీమతి లండన్లో మాదిరి ప్రధాన మంత్ర్ర్రిగా పవర్ ఫుల్ గా ఉంటేనే ఉంటేనే ఇంటికి, మగాడి వంటికి మంచిదని నా అభిప్రాయం' అంది చెంచులక్ష్మి.
చెంచులక్ష్మి పత్రికలలో స్త్రీల పక్షం వహించి ఘాటుగా రాస్తుంటుంది. హైదరాబాద్ లో మా ఆడపడుచుగారింటికి వెళ్లినప్పుడు ఆవిడ వాళ్ల ఫ్లాట్స్ లోనే ఉంటుందని తెలిసి ఒక మధ్యాహ్నం పూట మా ఆడపడుచుతో కలసి చూడ్డానికి వెళ్లాను. చెంచులక్ష్మి బాగా రాయటమే కాదు.. బాగా మాట్లాడుతుంది కూడా. ఇంటిని పార్లమెంటనడంలోనే గొప్ప పాయింట్ లాగిందావిడ.
'… ఎగువ సభ సభాపతిలా మామగారు, దిగువ సభ ప్రతిపక్షంలా అత్తగారు ప్రతి ఇంట్లోనూ ఉంటారు మామూలే అది . పిల్లలు రకరకాల రాజకీయ పార్టీలు. ఇరుగుపొరుగువారు చైనా పాకిస్తాన్ లాంటి వాళ్లు. మిత్రబృందాలు కల్చరల్ ఎక్ఛేంజికి వస్తుంటారు. వీళ్లందర్నీ పర్యవేక్షించాల్సిన వాళ్లం మాత్రం మనమే కదా చివరికి !'
'లెక్చర్ పిచ్చగా ఉంది. ప్రొసీడ్' అని ఎగదోసింది మా ఆడపడుచు ఆనందం తట్టుకోలేక చప్పట్లు కొడుతూ. ట్రెజరీ పక్షాల వాళ్లు ప్రధాని మాట్లాడినప్పుడు మధ్య మధ్యలో బల్లలు బాదేస్తారే .. ఆ మోడల్లో. డైనింగ్ టేబుల్ మీద మోదేస్తూ ఈవిడ ఇలా ప్రోత్సహించడంలో ఇద్దరి మధ్యా ఏదైనా లోపాయికారి ఒప్పందంలాంటివి ఏమన్నా ఉన్నాయేమో! అని నాకు అనుమానం మొదలయిన మాట నిజం సుమా!
చెంచులక్ష్మి రెచ్చిపోతూ 'ఇంట్లో ఏ ప్రాబ్లమొచ్చినా డైనింగ్ టేబుల్ దగ్గర చర్చకు వచ్చి తీరాల్సిందే ఏ కొంపలో అయినా. దాన్నే మేం ముద్దుగా రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ అని పిలుచుకుంటుంటాం ఇంట్లో. మేటరెంత కాన్ఫిడెన్సయినా సరే, ఎట్లా లీకవుతుందో తెలీదు .. మాకన్నా ముందు పక్కింట్లో చర్చ మొదలయిపోతుంది ఈ మధ్య ఈ అపార్ట్ మెంట్స్ లో.
'స్వగృహ రహస్యాలను పొరుగిళ్లకు చేరవేసే కోవర్టులు ప్రతీ ఇళ్లలోనూ ఏదో రూపంలో ఉంటారులే’ అని గునిసింది మా ఆడపడుచు నా వంక చూపులు సాధ్యమైనంత వరకు పడకుండా జాగ్రత్త పడుతూ. ఆవిడగారి నిందార్థాలు బహుశా మా అమ్మ మీద అయివుంటాయని అర్థమయింది.
'మేటర్ మరీ సీరియస్సయితే ఉభయసభలనూ సమావేశపరచి లోతుగా చర్చించ వలసిన అవసరం ఉంటుంది. మా అమ్మాయి ఈ మధ్య రాత్రుళ్లలో వీరప్పన్ ను గురించి ఒహటే కలవరిస్తోంది. దీం దుంపతెగ! పోయి పోయి ఆ దుంగల దొంగ వెధవ వలలో పడిందేమిటి చెప్మా' అని మా వారు ఉప్మా తింటున్న ప్రతి పరగడుపునా కన్నీళ్లు పెట్టుకొనే సీను చూసి చూసి నాకూ ఝడుపు జొరం పట్టుకుంటుందేమోనని అనుమానం మొదలయింది. ఒక రోజు పిల్లదాన్ని పట్టుకుని గట్టిగా నిలదీస్తే నిలువుగుడ్లు పడిపోయాయి పాపం పసిదానికి. ఆ బూచాడికి బారెడు మీసాలు మొలుస్తుంటాయి కదా! రెండేపులా గుమ్మడికాయలు నిలబెట్టినా లొంగనంత ధృఢంగా ఉంటాయి. ఏ చందనం తైలం వాడుతున్నాడో చచ్చినోడు .. కనుక్కోడమెట్లా అని అలోచిస్తూ పడుకుంటున్నానే మమ్మీ! నేరుగా నిద్రలోకే వచ్చి ఆ ఒక్కటి తప్ప మిగతా ముచ్చట్లన్నీ చెప్పి చస్తున్నాడు' అని బావురుమనేసింది. నమ్మక చస్తామా?
'దేశమో వంక తగలడి చస్తోంటే మీసాలకు రాసుకునే సంపెంగ నూనె వివరాలంత అవసరమా దీనికి?' అని మా మగాయన గెంతులేస్తుంటే నేనే గుడ్లురుమి ఎట్లాగో అదుపులో పెట్టా!'
'ఈ కాలం పిల్లకాయలను గురించి ఈ మగాళ్లకేం తెలుసు. కెరీర్ ఓరియెంటెడే కాని.. కాలేజీకి తీసుకెళ్లే కేరేజి ఎలా సర్దుకు చావాలో కూడా కోర్సులో చేరితే తప్ప బుర్రకెక్కని మట్టిముద్దలు. పిల్లల్ని అట్లా పెచుతున్న పాపం నిజానికి మన పేరెంట్సుదే! సరే! మీ మైనస్సును గురించి చెప్పావు. మరి ప్లస్సును గురించి కూడా మా ఆడపడుచుచెవిలో వెయ్యి!' అంది మా ఆడపడుచు.
'యూ మీన్ .. మా అబ్బాయా? అబ్బాయిల్ని ప్లస్సులు, అమ్మాయిల్ని మైనసులు అనుకుని పెంచడానికి మనమేమన్నా సంసారాలని వ్యాపారాలకు మల్లే నడుపుతున్నామా?డెబిటైనా, క్రెడిటైనా రెండు సైడ్లు చివర్లో సమంగా ఉంటేనే అది సరైన బ్యాలన్స్ షీట్ అవుతుందని మా వారెప్పుడూ అదేదో వాళ్ల బ్యాంకు గోలలో ఘోషిస్తుంటారు. నిజం చెప్పాలంటే మా వాడో పెద్ద వాజపేయి. మేథావే గానీ, ఏదీ ఇతమిత్థమని ఒక పట్టాన తెమల్చడు. మొన్నటికి మొన్న పరీక్షలని తెల్లార్లూ చదివి చదివి తీరా పరీక్ష హాలు కెళ్లి తెల్లకాగితం ఇచ్చొచ్చాడు. 'రాయడానికి మరీ అంత బద్ధకమేంట్రా వెధవా?' అని గట్టిగా నిలదీస్తే ' ఈ కింది దానిలో ఏదేని రెండిటికి మాత్రమే సమాధానం వ్రాయుడు!' అని రాసుందట. 'టూ ఓ క్లాక్ దాకా కూర్చునే ఓపిక లేక తిరిగొచ్చేసాను మమ్మీ!' అని దిక్కుమాలిన జవాబు. పిల్లల్ని ఇట్లా చెడగొట్టింది వాళ్ల డాడీ గారాబమే!'
'పవరంతా ఈవిడ చేతిలో పెట్టేసుకుని అప్పోజిషన్ వాళ్లను పి.యం తిట్టినట్లు ఎట్లా తిడుతుందో చూసావా మహాతల్లి! ' అంటూ నా చెవిలో గుసగుసలు పోయింది మా ఆడపడుచు, ఆవిణ్ణి అట్లా పక్కకు పోనిచ్చి.
'అన్నయ్యగారు ఓన్లీ ప్రెసిడెంట్ లాంటి వాళ్లని నువ్వే అన్నట్లు గుర్తు' అ ని మళ్లీ రెచ్చగొట్టే పని మొదలుపెట్టింది మా ఆడపడుచు. '
'ఆడది మొగుడు అడుగుజాడల్లో నడిచి తీరాలని కదండీ మన శాస్త్రాల నుంచి తెలుగు సినిమాల వరకు అన్నీ ఘోషిస్తున్నది' అని అడిగాను అక్కడికి నేనూ కొద్దిగా లేని ధైర్యం కూడగట్టుకొని.
'మొగుడు అడుగుజాడల్లో నడిస్తే మన దేశంలో ముప్పావు వంతు మంది ఆడవాళ్లు ఏ బారుల్లోనో, పేకాట క్లబ్బుల్లోనో తేలుండేవాళ్లు.' అని గుర్రుమందావిడ.
'నీ తీరు చూస్తుంటే నువ్వింట్లో మీ వారి మీద వార్ గ్రూప్ మాదిరి కార్యకలాపాలు సాగిస్తున్నట్లుందే! ఇట్లా అయితే అన్నయ్యగారెప్పుడో 'భాబా’ సంఘంలో చేరిపోతారేమో వదినా! ముందది చూసుకో!' అంది మా ఆడపడుచు.
'భాబా సంఘమా? అంటే?'
'భార్యా బాధితుల సంఘం'
'తలకిందులుగా నడిస్తే నవ్వొస్తుంది కదా అని మగాళ్లే ఇలాంటి తలతిక్క సంఘాలు పెట్టి మన పరువు తీసేది. పత్రికల్లో వచ్చే అప్పడాల కార్ట్యూన్లన్నీ మన ఆడవాళ్ల ఇమేజీని నెగటివ్ గా చూపిస్తున్నాయని నేనంటాను. మనం ఆకాశంలో సగం అంటారు కానీ.. మూడో వంతు వాటా ఇవ్వడానిక్కూడా ఎన్నేసి నాటకాలు ఆడుతున్నారో చూడు! పేరుకెన్ని రిజర్వేషనులుంటే ఏమి? అవన్నీ మొగాడు ఆడదాని ముసుగులో వేసే వేషాలే! హక్కులు దేబిరించి తెచ్చుకుంటే వచ్చిపడేవా? పోరాడి గెల్చుకునేవి. రాజకీయలనగానే మనకు ఒక్క ఇందిరమ్మ పేరు మాత్రమే ఎందుకు గుర్తుకురావాలి? జయలలితో, మాయావతో, మమతమ్మ బెనర్జీనో, ఇలా ఏవో ఓ పుంజీడు పేర్లు మాత్రమే పలుకుతున్నామంటే మనమెంత వెనకబడి ఉన్నామో అర్థంచేసుకోవాలి? 'అర్థరాత్రి పూటయినా ఆడదిస్వతంత్రంగా బైట తిరగ్గలిగే రోజు వచ్చినప్పుడే మనకు నిజమైన్న స్వాతంత్ర్య్యమొచ్చినట్లని బాపూజీ అన్నాడంటే, 'ఆడది అసలు అర్థరాత్రిళ్లు బైటెందుకు తిరగడం' అనేసే మాగాళ్లు.పొట్టపగిలిపోయేటట్లు అదో జోకన్నట్లు నవ్వి చచ్చే జోకరుగాళ్లు ఉన్నారంటే ఆ తప్పెవరిది? 'మగాడు ఎందుకు తిరుగుతున్నాడో అందుకు' అని ఆడది తెగించి జవాబు చెప్పినప్పుడు కదా మనకు నిజంగా స్వతంత్రం వచ్చినట్లు గుర్తు!' అంది చెంచులక్ష్మి ఆవేశంగా.
మేటర్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నా ఆవిడగారి ఆందోళన అర్థం చేసుకోదగ్గదే! ఎమోషన్లో పదాలేవో అటూ ఇటూ పడతాయి. అది కాదు; విషయం ప్రధానం. రిజర్వడ్ చైర్లకు ఎన్నికైన ఆడవాళ్లలో ఎక్కువ భాగం ఆయా మొగుళ్ల చేతిలో కీలుబొమ్మలుగా పనిచేస్తున్నారని ఒకానొక ప్రముఖ దినపత్రికలో ఆవిడ రాసిన వ్యాసం చదివిన రోజు నుంచి మా ఊరి మహిళామండలి సభ్యురాళ్లందరికీ ఆవిడంటే తగని అభిమానం పుట్టుకొచ్చినమాట నిజం. ఒకసారి చెంచులక్ష్మిగారిని మా ఊరు తీసుకెళ్లి సభ పెట్టిస్తే నాకు మంచి క్రెడిట్ దక్కుతుంది. ఆ విషయమే అడగడానికి అసలు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా. నా ఆహ్వానం విన్న మీదట నవ్వుతూ 'దాందేముందండీ! మా వారెప్పుడు ఖాళీగా ఉంటారో కనుక్కొని చెబుతాను. ఇద్దరికీ టిక్కెట్లు బుక్ చెయ్యాల్సుంటుంది మరి! ఒక్కదాన్నే అంత దూరం ప్రయాణమంటే ఏమంటారో మరి.. రోజులు అసలే బాగా లేవు కూడా !' అంటూ లేచి నిలబడింది!
'మమ్మీ! ఇంకెత సేపే! డాడీ నిన్ను టిక్కెట్లు తీసుకోమన్నాడు. లేడీస్ క్యూలో అయితే రష్ తక్కువగా ఉంటుందట!' అంటూ పుత్రరత్నం సెల్ చేతిలో పట్టుకుని పరుగెత్తుకుంటు వచ్చేసాడు.
'సినిమాకా?' అని అడిగింది మా ఆడపడుచు. 'అవును ఏడుపు టీవీలు చూడలేక పిక్చర్కే ప్లాన్ చేసారు మా వారు. సీరియల్ అయితే మళ్లీ రేపు కూడా వస్తుందిగా. అందునా మగాళ్లు అడిగినప్పుడు కాదంటే ఇల్లో పార్లమెంట్ అయిపోతుంది' అని హడావుడిగా లోపలికి పరుగెత్తింది. తయారవడానికి కాబోలు !
'ఏం సినిమారా.. చిన్నా?' అని మా ఆడపడుచు అడిగిన ప్రశ్నకు ' రేణుకాదేవి మాహాత్యం' అనేసాడు అభం శుభం తెలియని ఆ ఇంటి పార్లమెంట్ నామినేటెడ్ మెంబర్ భడవా !
-కర్లపాలెం హనుమంతరావు
31 -08 -2020
***
(ఇల్లే పార్లమెంట్ - పేరుతో ఈనాడు దినపత్రిక 17 -02 -2003 లో ప్రచురితం)
No comments:
Post a Comment