M
ఉండేలు సుబ్బారెడ్డికి గుండెల్లో కలుక్కుమంది.
లేచెళ్ళి కాసిని
మంచినీళ్ళు తాగొచ్చి మళ్లీ పనిలో పడ్డాడు.
ఐదు నిమిషాలు గడిచాయి. మళ్ళీ గుండెల్లో కలుక్కు!
ఈ సారి కాస్త ఎక్కువగా!
నొప్పికూడా పెరుగుతున్నట్లు
అనిపిస్తోంది. కడుపు ఖాళీగా ఉన్నా గ్యాస్
ఎగదంతే గుండెల్లో పట్టేసినట్లుంటుందని ఎక్కడో
విన్నాడు.
ఫ్రిజ్ లోనుంచి ఓ అరటిపండు తీసాడు. సగం
పండుకూడా తినలేదు..
వళ్లంతా ఒహటే
ఆవిర్లు! కళ్ళు బైర్లు కమ్ముతున్నట్లనిపించి మంచంమీద
కూలబడ్డాడు.
గుండెల్లో నొప్పి తెరలు
తెరలుగా వస్తూనే ఉంది.
‘కరోనా?.. హార్ట్
ఎటాక్?!’
అనుమానంతో గుండె కొట్టుకొనే వేగం
మరింత హెచ్చింది.
ఇప్పుడేం చేయడం?
సమయానికి ఇంటి దగ్గర కూడా ఎవరూ లేరు. అందర్నీ
తానే ఊరికి తరిమేశాడు. ఏదో
పత్రిక్కి పోటీకని నవలేదో రాస్తున్నాడు. గడువు
దగ్గర పడుతోంది. ఇంట్లో
పెళ్ళాం.. చంటి పిల్లలిద్దరూ చేసే అల్లరితో..
మూడ్ స్థిరంగా ఉండటం
లేదని.. బలవంతాన భార్యని పుట్టింటికి
పంపించాడు.. వారం రోజుల తరువాత
తిరిగి తనే తీసుకు వస్తానని
వాగ్దానం చేసి మరీ.
కథ ఇప్పుడిలా తిరగబడుతుందని తనేమైనా కల కన్నాడా? ఇంతకు
ముందెప్పుడైనా ఇలా
జరిగుంటే తగు జాగ్రత్తల్లో
తానుండేవాడే కదా!
కిం కర్తవ్యం? యమకింకరులొచ్చి పడే
ముందే.. వైద్యనారాయణాస్త్రం అడ్డమేసెయ్యాలి.
డాక్టర్ల నెంబర్లకోసం వెదికితే.. ముగ్గురు
ఆపద్బాంధవుల ఫోన్ నెంబర్లు
దొరికాయి. డాక్టర్ గోవిందు, డాక్టర్
బండ కోదండం, డాక్టర్ దుర్వాసిని.
డాక్టర్ గోవిందు నెంబర్ కి రింగ్ చేసాడు ముందు.
'గోవిందో గోవింద!.. గోవిందో గోవింద!' అంటూ రింగ్ టోన్ అదే
పనిగా
మోగుతోంది. అయినా
ఉలుకూ ఉప్పురాయీ లేదు అవతలి వైపునుంచి. సెల్ కట్
చేద్దామనుకొనే లోపు ‘గుర్..
గుర్’ మంటూ గొంతు వినిపించింది.
'హలో!.. ఎవరూ?'
'డాక్టర్గారూ!.. అర్జంటర్జంట్సార్!..
గ్గుండెల్లో...
న్నొప్పిగా..వ్వుంది.. చ్చా..ల్సే..
ప్ప..ట్నుంచీ'
అవతలి వైపునుంచి బిగ్గరగా నవ్వు! 'సారీ
సార్! అందర్లాగా మీరూ నన్ను
వైద్యం చేసే డాక్టరనుకున్నారా?'
'కాదా?'
'కాదండీ బాబూ! మనది పంగనామం
విశ్వవిద్యాలయం నుంచి వచ్చి పడ్డ డాక్టరేట్.
‘బెల్లం సాగుతో అధికాదాయం
సాధించే నవీన విధానాలు’ అనే అంశంమీద పరిశోధన
చేసినందుకు..’ సుబ్బారెడ్డి ఫోన్
ఠక్కుమని కట్ చేసేసాడు. ‘ఇప్పుడా
సోదంతా వినేందుకు టైమెక్కడేడ్చిందీ?’
రెండో నెంబరుకి డయల్ చేసాడీసారి. అదృష్టం..
నెంబర్ వెంటనే కలసింది.
'యస్ ప్లీజ్! ఎవరూ? ఏం కావాలి?'
'ఉండేలు సుబ్బారెడ్డి ఉన్న
పరిస్థితినంతా గుండెలవిసిపోయేలా వివరించాడు.
ఆసాంతం తాపీగా విని.. ఓ సుదీర్ఘ
ఉచ్ఛ్వాసం తీసుకొని మరీ 'సారీ!
మిత్రమా! వైద్యం.. వంకాయ.. మన లైను కాదు. నా
డాక్టర్ పట్టా తెలుగు
సాహిత్యానికి సంబంధించింది బ్రో!
‘ప్రాచీనకాలంలో జంతువుల జీవన
విధానాలు.. ప్రబంధ సాహిత్యంలో వాటి ప్రధాన పాత్ర'
అనే అంశం మీద కుంభకోణం
విద్యాపీఠం వారిచ్చిన స్నాతకోత్సవానంతర పట్టా!
‘బండ కోదండం’ అన్న పేరు
విన్న తరువాతైనా మీకు నా గురించి అర్థం
కాకపోవడం విచారకరం..' ఉండేలు
సుబ్బారెడ్డికీ సారి పెద్ద బండరాయితో
బాదేసినట్లు
గుండెలు
కలుక్కుమన్నాయి. ఫోన్ కట్
చేసేసాడు.
మిగిలిందిక డాక్టర్ దుర్వాసిని. సమయం
చూస్తే అర్థరాత్రి దాటి అర్థ
గంటయింది. న్యూసెన్సు కేసనుకొని న్యూసెన్సు
చేసేస్తేనో!
సంకోచిస్తూనే
నెంబర్ రింగ్ చేసాడు సుబ్బారెడ్డి
మార్గాంతరం లేక.
చాలాసేపు చడీ చప్పుడు లేదు..
ఊరికే రింగవడం మినహాయించి! అదే పనిగా
ప్రయత్నించిన మీదట అవతలి
వైపు నుంచి రెస్పాన్స్ వచ్చిందీసారి!
ఎత్తుకోవడం ఎత్తుకోవడమే సూరేకాంతం గొంతులో
సూరేకారం పోసినంత రౌద్రం!
సుబ్బారెడ్డి గుండె దుస్థితి వివరణ నివేదిక సమర్పించడం సగం కూడా కాలేదు
అవతలి వైపు శాల్తీ కాళికాదేవి
అవతారమే ఎత్తేసింది.
'ఎవడ్రా నువ్వు? నీకసలు బుద్ధుందిట్రా? ఇంతర్థ రాత్రి పూటా వెధవా..
కాల్
చేసేది? కాలూ చెయ్యీ తీసేయిస్తానొరేయ్! ఇవతలున్నది ఓన్లీ లేడీసనుకోకు!
ఎక్కడ్రా నీ ఇంటడ్రస్సు? ఏవిఁట్రా
నీ ఒరిజినల్ ప్లాటు? నువ్వవసలు
పేషెంటేవన్న గ్యారంటీ ఏంటంట? నిజంగా
నీది గుండెనొప్పేనని రుజువేంటి?
నొప్పుంటే మాత్రం నువ్ కాల్ చేసుకోవాల్సింది ఏ
ఆసుపత్రికో..
అంబులెన్సుకో! నేరుగా ఇలా
ఇళ్ళమీదకొచ్చి పడతారట్రా స్కౌండ్రల్స్?
పెట్టేయ్ ఫోన్! మళ్లీ నా సెల్ రింగయిందా నీకు ‘దిశ’ పోలీస్ స్టేషన్
సెల్లే గతి! నీ కొంపకు పోలీసుల్ని పంపిస్తా..
బీ కేర్ ఫుల్!'
ఠక్కుమని
ఫోన్ కట్టయి పోయింది.
సుబ్బారెడ్డిట్లా నేరుగా
ఇట్లా డాక్టర్లనే తగులుకోడానికి కారణం
లేకపోలేదు. రాతకోసం ప్రశాంతత
కావాలని వేధిస్తుంటే ఫ్రెండువెధవ తననీ
అడ్రసు తెలీని అజ్ఞాతంలో వదిలేసి
పోయాడు రాత్రి. మళ్లీ తెల్లారి
వాడొస్తేగానీ.. తానున్నది ఎక్కడో.. చిరునామా
ఏంటో
తెల్సిచావదు!
ఈ బిల్డింగుకి పేరుకో వాచ్ మెన్ ఉన్నా.. అతగాడెక్కడో
ఫుల్లుగా
మందుగొట్టి గొడ్డులా పడున్నాడు.
తనదగ్గర సమయానికే ఆసుపత్రుల నెంబర్లూ
ఉంచుకోలేదు. ఇప్పటిదాకా ఇట్లాంటి అవసరమేదీ పడక.
ఉన్న మూడు నెంబర్లూ
బెడిసి కొట్టేసాయి. ఇప్పుడేం గతి?!
పాలుపోవడం లేదు సుబ్బారెడ్డికి. అంతకంతకూ
గుండెల్లో నొప్పి ఎక్కువై
పోతోంది. చెమటలూ ధారాపాతంగా కారిపోతున్నాయి.
అక్కడికీ
నొప్పి నుంచి
దృష్టి మళ్ళించుకోడానికి సెల్ ఫోన్లోని న్యూస్ ఛానెలేదో ఆన్ చేసాడు.
ఐటి దాడులకు సంబంధించిన వార్తలేవో వెల్లువలా
వచ్చిపడుతున్నాయ్! కేంద్ర
పన్నుల శాఖవాళ్లకు ఉన్నట్లుండి పూనకం వచ్చినట్లుంది.
ఆర్థిక అక్రమాల
ప్రక్షాళన కార్యక్రమేదో పెట్టుకున్నట్లు..
బ్రీఫ్ కేసుల్తో సహా సార్ల
దండు రెండు తెలుగు రాష్ట్రాల
మీదా వచ్చిపడింది. దాడుల్లో దొరికింది
ముష్టి రెండువేల కొత్త రూపాయనోటు ఒక్కటీ!
వాళ్లిచ్చిపోయిన పంచనామాలో
ఎంచేతనో అంకె పక్కన అక్షరాలు సరిగ్గా
అచ్చయ్యాయి కాదు. ఆ అచ్చు తప్పును
నేతలంతా తమకొచ్చిన పరిజ్ఞానంతో పూర్తి చేయడంతో
తెలుగు నేతల అక్రమార్జనల
ఖాతాలు లక్ష నుండి కోట్లకు ఉబ్బిపోయాయ్ సందు
దొరికిందే
తడవుగా!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిలబడ్డ ట్రంప్
ప్రచారానికి సంబంధించిన
వార్తలేవో ధారాపాతంగా వచ్చి పడ్తున్నాయి. ట్రంపు
మహాశయుడు శత్రువర్గం
మీద పడి అడ్డమైన కారు కూతలూ అడ్డూ
ఆపూ లేకుండా కూసేస్తున్నాడు! అదే
స్థాయిలో అవతలి వైపు నుంచీ తగ్గకుండా భాషా
ప్రయోగాలు !
మామూలు సమయాల్లో అయితే మనిషన్నవాడికి
రాజకీయాలమీద విరక్తి పుట్టించే
దుర్భాషలు అవన్నీ. కానీ.. కష్టాల్లో ఉన్న
సుబ్బారెడ్డికి మాత్రం
హఠాత్తుగా తారక మంత్రం
దొరికినట్లయింది. మెరుపులాంటి ఆలోచనలతో అతగాడు
సెల్ ఫోన్ అందుకున్నాడు.
మళ్లీ డాక్టర్ దుర్వాసిని బెడ్
రూంలోని సెల్ మొరుగుడు మొదలు పెట్టింది
అదే పనిగా. ఎన్ని సార్లు నోరుమూసేసినా
మళ్లీ మళ్లీ మొరుగుతుండటంతో
దుర్వాసనమ్మగారి పక్కనే పక్కలో గుర్రుకొడుతున్న మొగుడుగారు
గయ్యిమని
లేచారు మేడమ్ గారిమీద 'మీ
ఆసుపత్రి నుంచీ యమర్జెన్సీ కాలేమో! అటెండవకపోతే
ఎట్లా? ఆనక సమస్యలొచ్చి పడితే
సర్ధిపెట్టలేక చచ్చేది నేనేగా! ముందా ఫోన్
చూడు!' అంటూ.
భర్త హెచ్చరించరికలతో ఇహ
తప్పదన్నట్లు చిరాగ్గా లేచి సెల్ అందుకొంది
డాక్టర్ దుర్వాసనమ్మ.
…
సూపర్ స్పెషాలిటీ
ఆసుపత్రిలో ఆఖరి నిమిషంలో జరిగిన అర్జంటు చికిత్సతో
ఉండేలు సుబ్బారెడ్డి యమగండం నుండి బైటపడ్డాడు చివరికి
ఎట్లాగైతేనేం!
పోలీసులు సమయానికి వచ్చి
కలగచేసుకోక పోయుంటే ప్రముఖ రచయిత
సుబ్బారెడ్డి ఈ పాటికి పై
లోకాల్లో కూర్చుని ప్రశాంతంగా నవల పూర్తి
చేసుకునే పనిలో ఉండేవాడు. డాక్టర్ దుర్వాసిని
ఇచ్చిన అర్థరాత్రి
'న్యూసెన్ కాల్' ఫిర్యాదుని ‘దిశ’ టీం
సీరియస్ గా తీసుకోబట్టి
గుండెనొప్పితో లుంగలు చుట్టుకుపోతోన్న
సుబ్బారెడ్డిని 'సగం నిర్మాణంలో
ఉన్న ఊరి బైటి భవంతిలో గాలించి మరీ
పట్టుకొన్నారు పోలీసులు.
అత్యవసర
ఆరోగ్య పరిస్థితిని గుర్తించి.. అప్పటికప్పుడు
ఆగమేఘాలమీద పోలీసులే
దగ్గర్లో ఉన్న పెద్ద ఆసుపత్రిలో చేర్పించడం
వల్ల సుబ్బారెడ్డి కథ
సుఖాంతమైంది.
అసలు విషయం అర్థం చేసుకున్న డాక్టర్ దుర్వాసిని
సైతం న్యూసెన్సు కేసులో
మరింక ముందుకు పోదల్చుకోలేదు.
***
వాస్తవానికి మనం మెచ్చుకోవాల్సింది
సుబ్బారెడ్డిని.. అతగాడి
సమయస్ఫూర్తిని కాదు. అతగాడు
అర్థరాత్రి ఒక ఆడకూతుర్ని వేధించేందుకు
సరిపడా దుర్భాషా సాహిత్యాన్ని సమకూర్చి పెట్టిన రాజకీయ
నేతాగణాలని.
అచ్చంగా ట్రంప్ భాషే సుబ్బారెడ్డి వాడి ఉంటే ఈ కథలో ఇంత వాడి.. వేడి
పుట్టుండేవి కావు.
ఈ మధ్యన తెలుగు రాష్ట్రాలలో నిత్యం నడుస్తున్న
రాజకీయ రామరావణ యుద్ధాల
పుణ్యం. ఆ సందర్భంగా ప్రజలు ముచ్చటపడి
ఎన్నుకున్న ప్రముఖనేతలు ఆ ప్రజలకే
ముచ్చెమటమలు పట్టే రేంజిలో యమధాటీగా
పుట్టిస్తున్న దుర్భాషాసాహిత్యం!
రాజకీయనేతల్లో రాను రాను మంచీ మర్యాదలనేవి
పూర్తిగా అడుగంటిపోతున్నాయని
కదా ఆదర్శవాదులు
దురపిల్లడం! అందుకు బదులుగా నేతాగణం కష్టపడి
సృష్టిస్తున్న దుర్భాషా సాహిత్యం..
దాని ప్రయోజనాన్నికూడా గుర్తించాల్సి
అవసరం ఉందన్నదే ఈ బూతు కథ నీతి!
కథ అంటే నీతి ఉండాలని కదా
మన పెద్దలు చెబుతుండేది! ఈ ‘నీతిలేని బూతుకథ’ నీతి ఇదే!
***
No comments:
Post a Comment