ఇరుగు దిష్టి .. పొరుగు దిష్టి
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - దినపత్రిక- సంపాదకపుట - 10-04-2003 - ప్రచురితం )
ఉడయవర్లు ఐదేళ్ల కిందట అందరు కుర్రాళ్ళకు మల్లేనే వై టూకే టైములో టకటకా రెండు కంప్యూటర్ భాషలు నేర్చుకుని అమెరికా ఎగిరెళ్లిపోయినవాడే.
రోజులు బాగోలేక రెండు నెల్ల కిందటే ఇండియా తిరిగొచ్చేశాడు.
ఇక్కడి పరిస్థితులంతకన్నా అధ్యానంగా ఉన్నాయి.
స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో చాలా కంపెనీలు బలవంతంగా ఉద్యోగాలు పీకేస్తున్నాయి. కొత్తగా వస్తున్న కొద్ది ఉద్యో గాలకీ పెద్దవాళ్ళ మధ్యనే పెద్ద రద్దీగా ఉంది. బాగా నడిచే బ్యాంకుల్లాంటివి ఉన్న బోర్డులు తిప్పేస్తుండటం వల్ల అందులోని ఉద్యోగులు రోడ్లమీదకొచ్చేస్తున్నారు.
కరవు వల్ల పల్లెల్లో పనులు లేవు. వృత్తి పని చేసుకుందామంటే పెద్ద కంపెనీల ఒత్తిడి ఎక్కు నగా ఉంది. బహుళజాతి కంపెనీల ధాటికి తట్టుకోవడం మరీ కష్టంగా ఉంది.
ఉన్న ఉద్యోగాలన్నీ గవర్నమెంటు కాంట్రాక్టుకే ఇచ్చేస్తుందని తిట్టుకుంటూ కూర్చోలేదు ఉడయవర్లు.
బిల్ గేట్స్ పీల్చి వదిలిన గాలిని మూడేళ్ళపాటు పీల్చి వచ్చిన ఘటం . బ్యాంకు లోనుకు అప్లై చేశాడు.
ప్రాజెక్టు రిపోర్టు చూసి డైరెక్టర్లకు మతి పోయింది.
రోజుకు రెండు లక్షల టర్నోవర్! పది రోజుల్లో బ్రేక్ ఈవెన్!... వరల్డ్ వైడ్ మార్కెట్... పోటీలేని వ్యాపారం... వెయ్యి శాతం లాభం.. ఉంటుందంటున్నాడు.
వినటానికేదో గిరీశం లెక్చర్లాగుంది గానీ... ఎకనామిక్సన్నీ పర్ఫెక్టుగా ఉన్నాయి.
ఎండుగడ్డీ .. పాత గుడ్డలూ... కర్ర ముక్కల్తో ఇదంతా సాధ్యమా!'
‘ఇప్పటికే ఈ బిజినెస్లో బిజీగా ఉన్నాను సార్! మిమ్మల్నేమీ మోసం చేయటానికి రాలేదు. ఇరాక్ నుంచి ఆర్డర్సు న్నాయి. . చూడండివిగో! అమెరికాకీ మన సరుకే కావాలి. బ్రిటన్ నుండీ బొలీవియా వరకు.. ఓహ్.. అందరికీ తొందరే! ముందు తమకే కావాలని ఒత్తిడెక్కువగా ఉంది . కేపిటల్ కోసమే మిమ్మల్ని కలవాల్సొచ్చింది . టు సే ట్రూత్ .. విదేశీ మారక ద్రవ్యం మహా ఈజీగా వసూలయ్యే ఈ స్కీములో భాగం కావాలని చాలామంది పోటీపడుతున్నారు. లాభం పంచుకోవాల్సి వస్తుందని నేనే పస్తాయిస్తున్నా !' అన్నాడు ఉడ యవర్లు.
ఉక్కిరిబిక్కిరయిపోయారు డైరెక్ట ర్లందరూ. ఒకాయనకు మాత్రం ఇంకా అనుమానం పీకుతూనే ఉంది.
'చెత్తగడ్డికి... పాత గుడ్డలకి పాతికలక్షలా? '
' పోనీ కుండ పెంకులక్కూడా కలిపి ఇప్పించండి సార్... ఆవీ కావాలి'
'ఒకసారి ఓటికుండల ప్రదర్శన పెడితే కోటి పెంకులు దొరుకుతాయి... వాటిని కూడా కొనటమెందుకూ? ' అన్నాడాయన. ఆయన బోర్డులో ఎంప్లాయీస్ తరపు మెంబరు.
' ఏరుకోవటాన్నికైనా మేన్ పవర్ కావాలిగా సార్! ఎంత హైటెక్కైనా కంప్యూటర్లెళ్ళి పెంకులేరలేవుగా! ... పోనీ పెయింట్ డబ్బాలకన్నా డబ్బు శాంక్షన్ చేయండి! '
' బొగ్గు ముక్కలు బోలెడన్ని దొరుకు తాయి. కర్రెలాగూ తగలబడుతుంది గదా...పోనీ బై ప్రొడక్టు కింద బొగ్గయినా లేదు ప్రాజెక్టు రిపోర్టులో! వయిబిల్టీ గురించి పైవాళ్లడిగితే.. '
ఉడయవర్లుకు విషయం అర్థమయింది.
ఒంటి వేలు చూపించి బైటికొచ్చాడు. డైరెక్టుగా మేనేజింగ్ డైరెక్టరుకే ఫోన్ చేశాడు బాత్రూములో నుంచి ఉడయవర్లు. అన్నీ వివరంగా మాట్లాడాడు.
' డిపాజిటర్ల డబ్బులు. కమీషన్లు పుచ్చు కుని లోన్లిచ్చే బాడీ కాదు మనది' అని అన్నాయన బైటికెళ్లి పోయింతరువాత ఉడయవర్లు లోపలికొచ్చాడు.
'కొత్త ప్రాజెక్టు. కొద్దిగా రిస్కు తీసుకుని ఇస్తున్నాం. మాట రాకుండా చూసుకోవాలం' టూ కోటి రూపాయలు శాంక్షను చేసింది మిగిలిన బాడీ.
' ఇంకో కోటి కూడా కొట్టేదే గానీ ఈ లోగా బ్యాంకు చతికిలపడింది. ' అన్నాడు ఉడయవర్లు ఇంటర్యూ చేయటానికొచ్చిన
విలేకరులతో కులాసాగా.
'దిష్టిబొమ్మలు తయారుచేసే ఫ్యాక్టరీ పెట్టాలనే ఐడియా మీకెలా వచ్చిందసలూ? ' అనడిగాడో విలేకరి.
'అమెరికా నుంచి తిరిగొచ్చిన రోజున విమానాశ్రయంలో పిల్లలు ఓడిన క్రికెట్ ఆటగాళ్ల బొమ్మలు తగలెయ్యడం చూశాను. రామ్ లీలా గ్రౌండులో ఎప్పుడో దసరాకి జరిగే సరదా ఈ దేశంలో ఏదో ఓ మూల రోజూ జరుగుతూనే ఉంటుందని పేపరు చూసే ప్రతి బురున్నవాడికీ ఈజీగా అర్థమవుతుంది.'
' పాడెలు కట్టడం.. కుండలు పగలగొట్టడం... జెండాలు తగలబెట్టడం .. లాంటి వాటికన్నా దిష్టిబొమ్మలు తగలబెట్టడం లేటెస్ట్ క్రేజీ. గుజరాత్ గోల.. ఆయోధ్యలో అల్లర్లు.. ఎన్నికల్లో కొట్లాటలు .. ఉద్యోగుల నిరసనలు , విద్యార్థుల ఉద్రేకాలు .. పార్టీల ప్రొటెస్టులు.. పోలీసు లాకప్ డెత్తులు ... ఎన్కౌంటర్లకు ఎగినెస్టుగా ర్యాలీలు. . ఉగ్రవాదుల మీద ఆగ్రహాలు.. మహిళామణుల ఆందోళనలు .. ఉద్రిక్తతలు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు . . ఇలా ఏం జరిగినా చివరికి దిష్టిబొమ్మల్ని తగలెడితేగాని తంతు పూర్తయినట్లు కాదు. మాది కొండపల్లి. మా నాయన బొమ్మలు చేసి అమ్మేవాడు. ఆ అనుభవంతో ముందు కొద్ది మొత్తంతో చిన్నగా పని ప్రారంభించా . ఇంతలో ఇరాక్ వార్ వచ్చి పడింది. వరల్డ్ వైడుగా డిమాండొచ్చింది. బుష్ బొమ్మలకున్నంత డిమాండిప్పుడు మరి దేనికీ లేదు. తొగాడియా బొమ్మలక్కూడా డిమాండెక్కువే. మధ్యమధ్యలో ముష్రాఫ్ సరేసరి . సమయం సందర్బాన్ని బట్టి లోకల్ లీడర్లక్కూడా అర్డర్సొస్తున్నాయ్. ఈ మధ్య వ్యాపారులు కూడా అధికారుల బొమ్మలు తగలబెడుతున్నారు . . కొత్తగా కొద్దిగా డేర్ చేసి .. చూసారుగా.. '
'ఆర్డర్లన్నీ మీకే ఎందుకొస్తున్నాయి? '
' మా దిష్టిబొమ్మలకు ఆకారాలే గాని. పోలికలుండవు. సందర్భాన్ని బట్టి అదే బుష్ .. అదే సద్దాం హుసేన్. ముష్రాపూ అనుకోవచ్చు.. మురళీ మనోహర్ జోషీ అనుకోవచ్చు . ఒక దిష్టిబొమ్మ కొంటే జెండా ఉచితం . పాడెలు కూడా చవకగా కట్టిస్తాం. వీలును బట్టి వాటినే కుర్చీలుగా మార్చుకోవచ్చు. . ఓడితే పడుకోబెట్టి తగలెట్టడానికి . . గెలిస్తే కూర్చోబెట్టి ఊరేగించటానికి.. వీలుగా ఉంటుంది.
కాలం మారుతుంది. మన ఆలోచనలూ మారితేనే విజయం. మా నాయన కొండపల్లి బొమ్మలు మాకు రెండు పూటలా తిండి పెట్టలేకపోయాయి. దిష్టి బొమ్మలు చేస్తూ నేనిప్పుడు కోట్లు గడిస్తున్నా '
'మీకు లోనిచ్చిన బ్యాంకు మునిగింది కదా! లోను తీర్చి డిపాజిటర్లకూ ఉద్యోగు లకూ మీ వంతు సహకారం అందించవచ్చు కదా!'
'దిష్టిబొమ్మలు చవకగా ఇచ్చి సహకార మందిస్తూనే ఉన్నా. డైరెక్టర్లల్లో ఒకాయనకు అనాథ శరణాలయముంది. పిల్లల గుడ్డ పీలికలు కొనే కండిషన్ మీదే నాకు లోనిచ్చింది. కుండ పెంకులు కావాల్సొచ్చినప్పుడల్లా ఉద్యోగుల చేత ఖాళీకుండల ప్రదర్శన ఏర్పాటు చేయించే వాడింకో డైరక్టరు. ఆయనే బోర్డులో ఉద్యోగుల తరపు ప్రతినిధి. వాళ్ల వంతు లాభాల్లో కొంతైనా కడితే, మిగిలిన కంతులు నేను కట్టడం న్యాయంగా ఉంటుంది. లోను కట్టే యడం నాకో లెక్కలోనిది కాదు. నాలుగు రోజులిలాగే నిరసనలు సాగితే దిష్టిబొమ్ములు నాలుగు ఎక్స్ ట్రా పోతాయని ఆశ. కాదు .. కట్టేద్దామన్నా మా ఫ్యాక్టరీ ఉద్యోగులూరుకోరు. నా దిష్టిబొమ్మల్నూరేగించి తగలెట్టేస్తారు. ' అన్నాడు ఉడయవర్లు.
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - దినపత్రిక- సంపాదకపుట - 10-04-2003 - ప్రచురితం )
No comments:
Post a Comment