కాఫీరాగాలు
- కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ – కాలమ్ )
*
దేవతలూ రాక్షసులూ పాల సముద్రాన్ని మధిస్తే ఆరంభంలో కాలకూటం అనక పీయూషం ఉద్భవించాయి. రాక్షసులకు కాలకూటం దక్కితే, దేవతలు అమృతం లభించింది. ఏమీ దొరకని మనుషుల కోసం కాలకూటం లోంచి 'కా', పీయూషం లోంచి 'పీ' బైటకు పీకి ' కాపీ ' అనే కొత్త కాక్ బైల్ సృష్టించాడు. కాలక్రమేణా సదరు కాపీ 'కాఫీ'గా మారి మనిషిని ఆడిస్తున్నది.
విషంలోని మాదకశక్తి , అమృతానికుండే అద్భుత రుచి, రెండూ కాఫీలో కలిసుంటాయి !అమృతం , విషం హంబక్కేమో కానీ.. కాఫీ కిక్కు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రియల్ ! కోక్ నుంచి కొబ్బరి బోండాం దాకా ఎన్ని డ్రింకులున్నా కాఫీకుండే ఆ కిక్కే వేరు! శ్రీరామనవమి బెల్లప్పానకం, ముక్కు దిబ్బడకు వాడే మిరియం .. బెల్లం , దూడ పుడితే దొరికే జున్నుపాలు..
మాత్రమే తెలిసిన భారతీయుడికి కాఫీ మప్పి పర్మినెంటు సర్వెంటుగా మార్చుకున్నాడు తెల్లతోలు తో !
కుదిరితే కప్పు కాఫీ నాలుగు కబుర్ల కుర్రకారు కాలంలోనూ కాటికెళ్లే ముసలి డొక్కులకు కాఫీ మీదే మోజు. ఎంత కాఫిర్ కైనా కాఫీ దగ్గర కాసుల్లెక్కుండదు. కాఫీలు తాగారా? టిఫినీలు తిన్నారా? అంటూ వెంటబడి మరీ వేపుకు తింటేనే ఆ కాళ్యాణం కమనీయంగా జరిగినట్లు!
టర్కీలో పిల్ల కాఫీ కమ్మంగా కలిపిస్తేనే సంబంధం కలుపుకునే ఆచారం.
అయ్యర్లకు వరల్డువైడుగా పేర్రావడం ఫిల్టరు కాఫీ తయారీలో సైషలిస్టులు కావడం వల్లే!
కాఫీ కాయడం క్రికెట్టాటల్లో బెట్టింగు కాయడమంతీజీ కాదు. కాఫీ మేకింగులపై అన్ లైన్ క్లాసులు పీకి మరీ కింగులూ క్వీనులూఅయే వాళ్లకు లెక్కే లేదిప్పు డు.
మూలక్కూర్చుని మూలిగే ముసలాళ్ళ మురిపాలే కాఫీల మీదింతలా పెరిగి పోతుంటే పని పాటలు చేసుకు బ్రతికే సంసారుల బడ్జెటు కథ ఇహ కాఫీ స్పెషల్లా చెప్పాలా ?
కాఫీల మీద శాస్త్రవేత్తలు కూడా అస్తమానం ఏవో దిక్కుమాలిన ప్రయోగాలు చేస్తుంటారు. ఒక ఇల్లినాయిస్ యూనివర్శిటీ పరిశోధకబృందం కాఫీ కేన్సరుకు తిరుగులేని మందంటుంది. ఆ మర్నాడే మరో చికాగో విశ్వవిద్యాలయం చికోరీ లేని కాఫీ మాత్రమే సేఫని స్టేట్మెంటిచ్చేస్తుంది. అన్ లిమిటెడ్ కాఫీతో యుట్రస్ పని వికటిస్తుందని ఊటా పరిశోధన వాక్రుస్తే .. అదేం లేదు పుట్టబోయే కిడ్ 'విజార్డ్' అవాలంటే కెఫిన్ కాస్సంట్రేడెడ్ కాఫీ కనీసం రోజుకో పది సారైనా తల్లి
గొంతులో దిగాలని గుయానా యూనివర్శిటీ గగ్గోలెడుతుంది . మగాళ్లకి మెదడులో కణితలు పెరిగి గభాలున గుండెలు ఆగే అవకాశం గత శతాబ్దం కన్న అరవై శాతం అధికమయిందని అదేందో అర్థం కాని టెర్మినాలజీలో కాఫీ డ్రింకింగ్ పెరిల్స గురించో జర్మన్ శాస్త్రవేత్త బెదిరించేస్తే తాజా పరిశోధనలో తాజాగా తయారైన కాఫీ తాక్కుండా ముక్కుతో పీల్చినా చాలు మెదడులోని అసిటోన్ ఎంజైమ్స్ ఉద్దీపించి ఆ రోజంతా ఫీల్ గుడ్ మూడ్ ఉంటుందని మన దగ్గరే ఓ హెర్బల్ పరిశోధక సంస్థ అభయహస్తం . ఆ అర్ధం కాని పాడు లెక్కలు పట్టించుక్కూర్చుంటే తాగే గుక్కెడు కాఫీ కాలకూట విషంగా తోచి రేపటి కాటి ప్రయాణం ఈరోజే ఖాయం అవుతుంది.
ఏడో శతాబ్దపు ఈ కాఫీ గింజలు ఎంతలా విశ్వరూపం దాల్చి ఏడిపిస్తోంది పాడు లోకాన్ని! ఎక్కడి ఇథియోపియా ఎక్కడి మేరా మహాన్ ఇండియా? ఇస్లామిక్ గాజా వైన్- ఈ డెవిల్ కాఫీ డ్రింక్! ఇవాళ అదే ఇండియా గుడ్ విల్ డ్రింక్ ! నిషేధించిన క్రైస్తవమే కాఫీ రుచికి దాసోహమన్నది! మక్కా యాత్రకు పోయిన బాబూ బుడాన్ సూఫీ వట్టి చేతులలో రావడ మెందుకని ఏ సుమూహూర్తాన ఆ ఏడు గింజలు గిల్లుకొచ్చినట్లో గాని , దాని దుంప తెగిరి కన్నడ దత్తాత్రేయ కొండల గాలి తగిలి, నూట ఏడు దేశాల నుంచి ప్రస్తుతం అదే మనకు ప్రధాన ఆదాయ వనరైంది!
యూరోపు 'గుడ్ మార్నింగ్ ' మన అరకులోయ కాఫీతోనే! ఇండొనేసియా పిల్లి తిని ఆరగించుకొనే పళ్ళు ఈ కాఫీ గింజలు! 'చరిత్ర మనకెందుకు స్వామీ .. రుచి ప్రధానం గానీ!' అని చిరాకు పడక ఓ కప్పు కాఫీ తెప్పించుకు తాగండి ! అప్పుడు ఏ చెత్త వాగినా చప్పట్లు కొట్టాలనే అనిపించక తప్పదు.
'జొన్న అన్నమే ఆహారం. జొన్నలే తప్పన్ సన్నన్నము సున్న సుమీ' అని వాపోయాడొకప్పుడు పాపం.. ఆ తిండిపోతు కవి శ్రీనాథుడు. ఇప్పుడతగాడే గాని బతికుండుంటేనా .. ' కాఫీ మహాత్మ్యం ' అనే కావ్యం దివ్యంగా గిలికుండక పోనా? దేశభక్తి కవిత్వానికి ప్రసిద్ధులైన కవులు సైతం నురుగులు గక్కే కాఫీ పైన దండకాలు దంచేసారు.
అభినవ సరస్వతి అనే మాస పత్రికలో గౌరావఝుల సీతారామయగారు 'కాఫీతో సమానమైన తీర్థం మరోటి లేదు పొమ్మ' ని తేల్చేశారు. ఏడు పదుల ఏళ్ల కిందటే ' గృహలక్ష్మి' మహిళా సంచిక పేరు తెలియని ఒక కవిశ్రేష్టుని దండకం ప్రచురించింది. అమ్మవారివవుచు నిఖిల జనంబుల/ గృహములందు దాపురించినావు / నిను భరింపలేము నిమ ద్రోయగా లేము' అని పాపం దండకాలలో వాపోయాడు .
లీటరు రేటు పాలకు బదులు వాటరు వాడటం బెటరు అనిపించేవిప్పటి రోజులు. కాఫీ పొడరు ధర వింటుంటే బిపి పెరుగుట ఖాయం. చిటికెడు చక్కర గుక్కెడు నీటిలో కలిపి గుటగుట తాగేద్దామనుకున్నా ఆ చికోరి రుచి వలలో చిక్కి కాఫీ చుక్క గుక్క దిగనిదే పక్క దిగ బుద్ధవటం లేదు !
తాపీ ధర్మారావుగారోసారి కాఫీపై దండకం చెప్పమంటే పోకూరి కాశీపతిగారు అశువుగా జగన్మోహిని కాఫీ జన్మవృత్తాంతం ఆసాంతం గురజాడగారి గిరీశం మించి కథ వినిపించారు . తొల్లి శ్రీకృష్ణుడు స్వర్గం నుంచి సత్యభామకు పారిజాతం తెచ్చిచ్చే సందర్భంలో దారిలో దాని గింజ నేల పై రాలి కాపీ మొక్కై మొలిచిందని కాశీపతిగారి కాఫీ థియరీ !
'అనుదినమ్మును కాఫీయే అనలు కిక్కు
కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కు
కప్పు కాఫీ లభించుటె గొప్ప లక్కు' అంటూ లేటెస్టుగా కాఫీ టేస్టును గూర్చి మిధునం చిత్రం కూడా సెలవిచ్చింది. "కాఫీశ్వరీ! వెన్స్ కేఫేశ్వరీ! బ్రూకుబాండేశ్వరీ! గంట గంటా ప్రతీ యింటా ఉప్పొంగవే పానీశ్వరీ!' అంటూ ప్రాథేయ పడ్డం కంపల్సరీ. మరేం చేస్తాం? మనిషిగా పుట్టేం కదా.. గిట్టే దాకా కాఫీలు తాగడం అప్పనిసరి!
***
No comments:
Post a Comment