ఈనాడు - వ్యంగ్యం
గడ్డే పెట్టండి మహాప్రభో!
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సంపాదకీయ పుట - 18 - 09- 2002 - ప్రచురితం)
'మాకరపు జిల్లాల్లో గడ్డిస్వామి పవరు విన్నారా బావగారూ? అనడిగాడు మా బావ మరిది - మొన్న పండక్కి వాళ్లూరు కవిసమ్మేళ నానికెళ్లినప్పుడు. 'గడ్డంలోంచీ గడ్డిని మొలిపిస్తాడాయన ' అన్నాడు గర్వంగా
'గడ్డంలోంచి పేలు పుట్టించొచ్చుగానీ.. గడ్డినెలా మొలిపిస్తాడోయ్!'
' శూన్యంలోంచి లింగాలను లాగుతున్న ప్పుడు... ఆకుల్నుండీ పెట్రోలు పిండుతున్న ప్పుడు... గడ్డంలోంచి గడ్డిని పీకటంలో వింతేముందండీ ? '
'ఏమైనా మీ గడ్డిస్వామి గారి సామాజిక స్మృహకు నా జోహార్లు. నోరులేని మూగ జీవాల మేతను అంత ఉదారంగా మొలిపించి ఉచితంగా పంచటం నిజంగా ముదావహం.'
'గడ్డిస్వామిగారికున్నంత భూతదయలో వందోవంతు మన గవర్నమెంటుకుంటే మాకు ఈతిప్పలన్నా తప్పేవి కదా! కరవు మూలకంగా భూములు బీడుపడిపోయాయి. కరుణించి కాస్త 'గడ్డి పెట్టండి మహాప్రభో!' అని కాళ్లా వేళ్లా పడంగా, పడంగా, కరవు కాటకాల్ని ఇన్నాళ్టికి ఓ నాట కంలా చూసిపోయింది కేంద్ర బృందం!'
'జిల్లాల్లో తిరిగినప్పుడు కరవు చూసి గుండెలు చెరువయ్యేలాగా బాగానే కన్నీళ్లు కార్చుకున్నారుగానీ, ఢిల్లీ గాలి సోకంగానే గుండె రాయిగా మారినట్లుంది... సవాలక్ష యక్షప్రశ్నలు సంధిస్తూ హైదరాబాదధికారుల్ని హడలు గొట్టేస్తున్నార' ని విన్నాను.'
' నిజమే. నిరుటి కరవుకు విడుదలైన నిధుల మిగులు వివరాలు కూడా ఇప్పుడడు గుతున్నారని దిగులుపడుతున్నారు. ఢిల్లీ నిండా నాయకులేనాయె!... అక్కడ మాత్రం గడ్డిక్కరవుండదూ! అందుకే తృణానికి బదులు తృణమో ఫణమో విత్తనాలు నెత్తికి రుద్దాలని చూస్తున్నట్లున్నారు.'
'అందుకే... విత్తనాలొద్దు... గడ్డే కావాలని మొత్తుకొనేది. గడ్డి తినే జీవాల వివరాలన్నీ వెంటనే పంపిస్తేనే గ్రాంటు సంగతి వింటాం. అంటున్నార్ట సెంట్రలువాళ్లు'
' ఆ లెక్కలిప్పుడెక్కడ దొరుకుతాయోయ్!... అంతర్జంటుగా ఏ ఏసీబీ వాళ్ల దగ్గరో... సి.బి.ఐ. ఫైళ్లలోనో... రోజువారీ పేపర్లలోనో కొన్నున్నా కోట్లలో గ్రాంటన్నప్పుడు ఇంకా ఎన్నో వివరాలు పంపాల్సుంటుంది!'
' బాగా చెప్పార్సార్ ' అన్నాడు తలుపు దగ్గర నిలబడినాయన వినయంగా చేతుల్లోని కాగితాలూపుకుంటూ..
'వినాయకచవితయిపోయింది గదయ్యా! ఇప్పుడేంటి మళ్ళీ చందాలూ? '
' చందాలు కాదు బావగారూ! మావూరు పంతులుగారు, జంతువుల వివరాలు రాసుకుందుకొచ్చాడు' అంటూ కూర్చునేందుకు నులకమంచం చూపించాడు మా బావమరిది.
'మా గాడిదకేమన్నా రెండు ముక్కలు వంటబట్టేటట్లున్నాయా సార్.. అడుగో... అడ్డమైన గడ్డీ నములుతూ ఇక్కడే నిలబ డ్డాడు' అన్నాడు రెండో కొడుకువైపు మిర్రిమిర్రి చూస్తూ.
'గాడిదలు కూడా ఇలా గడ్డితింటే ఎలా గండీ? అందుకే ఇక్కడ ఇంత కరవొచ్చింది!' అని గుడ్లురుమిచూశాడు... పక్కనే నిలబడ్డ పెద్దాయన.
పశుగణాంక వివరాలనుపర్యవేక్షించే అధికారిట ఆయన. హైదరాబాద్ టీవీ నుంచీ వచ్చాడు.
ప్రశ్నపత్రం చూపి క్వశ్చన్నడగటం మొదలు పెట్టాడు గడగడా
' మీ ఇంట్లో మొత్తం జంతువులెన్నీ?... అందులో గడ్డి తినేవెన్నీ? ... అన్నం తినేవెన్నీ? అన్నం తరువాత నీళ్లు తాగేవెన్నీ? ... తాగనివెన్నీ? .... పిల్లలూ... కుక్కలూ... ఏమైనా ఉన్నాయా?'
' అబ్బే.. అవేవీలేవండీ!' అన్నాడు మా మామగారు భయంభయంగా.
' పోనీ.... నల్లులూ? ... బల్లులూ...? ఈగలూ... దోమల్లాంటివైనా ఉన్నాయా? '
'అవి లేకుండా కొంపెలాగుంటుందండీ!' అన్నాడీసారి వినయంగా .
'అయితే నల్లులు షుమారెన్నుం డొచ్చూ? .... బల్లుల్లో ఆడవెన్నీ! ... మగవెన్నీ? ఈగలన్నీ ఈ ప్రాంతంవేనా?... వేరేచోటు -నుండి వలస వచ్చాయా? దోమలకు బోదకాల్లాంటి వ్యాధులేమైనా ఉన్నాయా? నల్లులకు అనీమియా రాకుండా జీవకారుణ్యం వాళ్ల పథకాలున్నాయి. అవి అమలుచేస్తున్నారా? .....
అన్నింటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పా రింట్లో అందరూ కలిసి.
' కరవు కడప, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో అయితే ఈ ఏరియాలో వివరాలు సేకరిస్తున్నారేంది సార్!' అనడిగానాఖర్లో.
ఇప్పటికిప్పుడు అంత దూరం గడ్డి కమిటీని పంపడం కుదర్దుకనక... అందుబాటులోఉన్నవరకూ ఇక్కడే వివరాలు సేకరిస్తున్నాం. సాయంకాలానికల్లా ఫిగర్లు ఢిల్లీ వెళ్లాలిమరి' అని కంగారుగా లేచి నిలబడ్డాడాయన.
' క్రైసిస్ మేనేజ్మెంట్ని కవర్ చేయటంలో మనవాళ్లని మించిన మొనగాళ్లు లేరోయ్!'
'ఏదో.. గవర్నమెంట్ గ్రాస్ సాలరీస్ తీసు కొనే వాళ్లం. ఈ గ్రాసం కోసం ఆ మాత్రం సాయంపట్టకపోతే విశ్వాసమన్నమాట కసలు మీనింగ్ లేదుకదాసార్! అవునూ.... ఇందాక మీవాడు తిన్న ఆ గడ్డెక్కడ దొరుకు తుందో కాస్త చెబితే... అక్కడో 'గడ్డిమేళా'లాంటి దేదన్నాఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాంగా! ' అన్నాడు ప్రసన్న చిత్తంతో .
మేళాలెందుకయ్యా బాబూ ! మేతపెట్టండి చాలూ......|
' మేతకేనయ్యా ఈ యాతనంతా! జంతువుల మేత జంతువులే తినాలని మా ఉద్దేశం. జంతు సమేతంగా రావాల్సుం టుంది మేళాకి. బీహార్లో దాణా కుంభకోణం తరువాత ఆ అనుభవంతో కొత్త కోణంలో నుంచి ఆలోచించి మరీ ఆచరిస్తున్న పథకమిది' అంటూ వెళ్లిపోయాడాయన.
గడ్డివాముల్లో కూడా స్కాముల్లేకుండా ముఖ్యమంత్రిగారు ముందుచూపుతో తీసు కున్న చర్యలాగుంది. బాగుంది.
' పల్లెల్లో కూడా జనం తెలివిమీరిపోతున్నా రండీ! లేటెస్టు లెక్కల ప్రకారం ఇంటికో మనిషి... నాలుగు గొడ్లూ ఉన్నట్లు లెక్కతే లిందిప్పుడు ' అన్నాడు. మర్నాడు సాయంత్రం పంతులుగారు బస్టాండులో కల్సినప్పుడు.
' మనం, జంతువుల్ని మేపుతు న్నామా? జంతువులు మనల్ని మేపుతు న్నాయా? అని వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రిగారు మండిపడ్డాట్ట. ఆయనసలే కరాఖండి. అంటే కరవులో రాజకీ యాల్ని ఖండించే మొండి మనిషన్నమాట.'
కాకిలెక్కల్లో కాకలుతీరిన అధికారులు ఇక్కడ ఏవో కాకమ్మ కతలుచెప్పి తప్పించు కుంటారేమోగానీ... సెంట్రల్లో ఇంకా కాకలు తీరిన 'కాకా'లున్నారు. గడ్డికైనాసరే.. వూరికే గుడ్డిగవ్వ గ్రాంటుగా ఇవ్వరు. పనికి ఆహారం' పథకం మానేసి పనికి గడ్డి పథకం' పెట్టేసినా పెట్టేస్తారు... ఈ మితిమీ రిన 'జంతుసంతతి లెక్కల'తంతు చూసి...'
'ఆ గడ్డయినా వూరికే దొరుకుతుందా... ఏందీ?... ఏ గడ్డి స్వామిలాంటివాళ్ల గడ్డమో పట్టుకొని జిల్లాల వారీగా పీక్కునే పథకం పెట్టుకోవాల్సిందే' అన్నాడు మా బావమరిది.
'కరవు పోర్టుఫోలియో ఒకటి వేసి 'గడ్డి'ని కూడా దానికి జతచేసి నిన్ను మినిష్టరుగా చేస్తే భేషుగ్గా వుంటుందోయ్... బావమరిదీ'' అన్నాను బన్సెక్కుతూ అతని భుజంతట్టి.
'అట్లాచేస్తే వచ్చే కరవు కాలంనాటికి మరింత మంది గడ్డిస్వాముల శిష్యుల్ని తయారుచేయించి గ్రాంటుకు సిద్ధంగా వుండనూ' అన్నాడతను కులాసాగా భూజాలెగరేసి.
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సంపాదకీయ పుట - 18 - 09- 2002 - ప్రచురితం)
No comments:
Post a Comment