Sunday, December 12, 2021

ఫ్యామిలీ- చిన్న కథ - కర్లపాలెం హనుమంతరావు

ఫ్యామిలీ- చిన్న కథ 

- కర్లపాలెం హనుమంతరావు 

 

నాన్నా!

ఏంట్రా చిన్నా?

రోజుకు నువ్వెంత నాన్నా సంపాదించేది?

ఉలిక్కిపడ్డాడు   నాన్న.  చుర్రుమని కాలింది. వేలెడంత లేడు. వీడేందీ.. పిచ్చి ప్రశ్నలు!   బదులివ్వదలుచుకోలేదు. అయినా చిన్నా  వదలదలుచుకోలేదు తండ్రి. 

'చెప్పు నాన్నా! పోనీ గంటకు ఎంతిస్తారో ఆఫీసులో అదన్నా చెప్పు. అప్పుడే నేను పోయి పడుకునేది'

రెండు పెడ్దామనిపించింది .  అతి కష్టం మీద ఆపుకొంటూ 'గవర్నమెంటాఫీసుల్లో రోజూ జీతాలిస్తార్రా? నెలకో అరవై వేలొస్తాయేమో! ఇహ ఫో! తొమ్మిదవుతుంది. పోయి పడుకో!' గట్టిగానే గసిరాడీసారి తండ్రి.  

అయినా చిన్నా వదల్లేదు 'ఒక్క రోజుకు ఎంతొస్తుందో అది  చెప్పు నాన్నా! అప్పటి దాకా నేను పడుకునేదే లేదు గ్యారంటీ!'

బిడ్డ మొండితనం తండ్రికి ఎరికే. ఏదో ఒహటి చెప్పేదాకా   వదిలే రకం కాదు. అయినా ఇవాళేందీ పిలగాడు ఇట్లా జీతాల మీద తగులుకున్నాడు! 'రోజుకో రెండొందల చిల్లరొస్తుందేమోరా నాయనా! అయినా.. వేలడంత లేవు నీకెందుకురా ఈ వెధవారాలన్నీ! వెళ్లి పడుకో ఫో! మళ్లీ బైటికెళ్ళే పనుంది నాకు!' 

చిన్నా తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు 'నాన్నా! ప్లీజ్ నాకో ట్వంటీ రూపీస్ అప్పివ్వవా అర్జంటుగా? కావాలంటే వడ్డీ తీసుకో పెద్దయింతరువాత!'

ఉలిక్కిపడ్డాడు తండ్రి. ఇరవై రూపాయల అప్పా? దానికీ వడ్డీ చెల్లింపులా? వీడు పెద్దయిందాకా ఆగి తాను వసూలుచేసుకోవాలా?' వళ్లు మండిపోయింది తండ్రికి ఒక్క ఊపులో వచ్చిన వీరావేశానికి. 'ఎల్కేజీ కుంకగాడివి. డబ్బుల్తో నీకేంట్రా పనసలు? స్కూల్లో ఏం చేస్తున్నావు? ఏం జరుగుతుందీ ఇంట్లో.. ముందు నాకు తెలియాలి ?' అంటూ విసురుగా వంటింటి వైపుకు దూసుకెళ్లిపోయాడా నాయన వక్కసారిగా ముంచుకొచ్చిన వెర్రావేశంతో. 

ఆ దురుసుగా పోవడంలో కిందపడి ఏడిచే పసిబిడ్డ సంగతి కూడా పట్టించుకునే మూడ్ లో లేకుండాపోయింది తండ్రికి. 

***

 అరగంట గడిచిన తరువాత ఆవేశాలు చల్లారాయి ఇంట్లో. తన దురుసు ప్రవర్తనకు తండ్రిలో పశ్చాత్తాపం మొదలయింది. చిన్నా పడుకొన్న గది వైపు చూసాడు. దుప్పటి కప్పుకుని కప్పు వంక చూస్తూ తల్లి పక్కనే పడుకుని ఉన్న పదేళ్లు కూడా నిండని కొడుకును చూసి తండ్రి గుండె చెరువయింది. గిల్టీగా చిన్నా పక్కలోకి చేరాడు నాన్న. ' సారీరా! బుజ్జిగా! ఇందాక నేను నీతో అట్లా  మాట్లాడకుండా ఉండాల్సింది.తోసేసానేమో కూడా కదా! వెరీ సారీ రా కన్నా! ఇదిగో నువ్వడిగిన ఇరవై రూపాయలు. ఇప్పుడు  నువ్వు హ్యాపీనే గదా?'

ఇరవై నోటు చేతిలొ పడగానే గభాలున లేచి కూర్చున్నాడు చిన్నా. అప్పటిదాకా ఏడ్చినట్లు వాడి లేతబుగ్గల మీద చారలు కట్టిన కన్నీళ్లే తెలియచేస్తున్నాయ్. ఇప్పుడవేమీ పట్టించుకునే మూడ్ లో లేడు చిన్నా! తండ్రి ఇచ్చిన ఇరవై నోటును  దిండు కింద దాచిపెట్టుకుని ఉన్న మరికొన్ని అట్లాంటి నోట్లతోనే కలిపి లెక్క   పెట్టేపనిలో పడిపోయాడు. చిన్నా దిండు కింద నోట్లు చూసిన తండ్రికి మళ్లీ కోపం తన్నుకురాబోయింది. 

కానీ అదే క్షణంలో చిన్నా.. గభాలున తండ్రిని గట్టిగా కౌగలించుకుని అన్నాడు 'థేంక్యూ పాపా! థేంక్యూ వెరీ మచ్! ఈ ఇరవైతో  రెండొందలు సరిపోయింది. ఇవన్నీ అచ్చంగా నీవే ఇక నుంచి!' చిల్లర నోట్లన్నీ తన   గుప్పెట్లో కుక్కి మూసేసే చిన్నా వంక అయోమయంగా చూసాడా తండ్రి. ' 'రేపు అమ్మ బర్త్ డే డాడీ !  నువ్వచ్చంగా ఇంట్లోనే ఉంటున్నావ్. అమ్మతో, నాతో కలిసి గుడికి సినిమాకి వస్తున్నావ్!  ఫుల్ డే ఆఫీసుకు డుమ్మా. నీ  జీతం రెండొందలు ఇచ్చాగా!  నువ్వూ హ్యాపీనేగా!' 

ఉత్సాహంగా చిన్నా అన్న ఆ మాటలకు  బిత్తరపోయిచూడడం నాన్న వంతయింది. 


-కర్లపాలెం హనుమంతరావు 

07- 04 -2021 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...