దేవుళ్లను ఏమన్నా అంటే కళ్లు పోతాయని మనకో నమ్మకం. కబోదులు క్రమంగా పెరిగిపోతున్నారీ మధ్యన దేశంలో. అంటే దైవదూషణ కూడా అదే మోతాదులో ఎక్కువైందనేగా సూచన! ఈ లాజిక్‌ను వదిలేసి దేవుళ్ల విధులు దీక్షగా నిర్వహించే మా రక్షకభటులను ఆడిపోసుకోవద్దని హెచ్చరించేందుకే లాఠీగా నేనీపూట ఈ భేటీ పెట్టింది!
మెత్తనివాణ్ని చూస్తే మొత్తబుద్ధవడం మీ మనుషులందరిలోనూ ఉండే సహజ దుర్గుణం. ఏనుగు నోట్లో బాంబు పెట్టిన నేరగాడినే ఉరితీయాలని తెగ రచ్చ రేగుతున్నది కదా సామాజిక మాధ్యమాల్లో! ఇక జనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ఎన్ని ఏనుగుల పెట్టు? ప్రభువుల దగ్గరుండే పెద్దల మీదనే ఎదురూ బెదురూ లేకుండా బాంబుల్ని మించిన ప్రమాదకర ట్వీట్లా?! మరి మేం ఇక్కడున్నది రక్షకభటుల చేతిలో స్వీట్లు తినిపించడానికా?
మక్కెలిరగదన్నడం తప్ప మరో మార్గం లేకుండా మాకు చెడ్డ పేరు తెస్తున్నది మీరు... న్యాయం చేసే లాఠీలం మేమే న్యాయంగా న్యాయస్థానాల తలుపు తట్టాలి!
పోలింగ్ కేంద్రాల్ని జయించి గద్దెలెక్కిన పెద్దమనుషులు ఎవరైనా ఆటొమేటిగ్గా దైవాంశ సంభూతులైపోతారు. అదివరకు మాదిరి అడ్డదిడ్డమైనవాళ్లకు ప్రతి అడ్డాలో అడిగినప్పుడల్లా దర్శనమిచ్చేస్తే దేవుడెట్లా అవుతాడు ఏ పాలకుడైనా?కనీసం ప్రెస్ మీట్లన్నా పెట్టడంలేదని అల్లర్లు చేస్తే గుడ్లప్పగించి చూస్తూ కూర్చోవడానికా కొన్ని కోట్లు పోసి మా లాఠీ కర్రల్ని సర్కారు కొని దాచిపెట్టింది? బోలెడంత మంది మా ప్లీడర్లు చెట్టుకిందా చోటు దొరక్క గగ్గోలు పెడుతున్నారు. గోరంతయినా ఉపాధి కల్పించిన పుణ్యం దక్కుతుంది మా పోలీసు బెత్తాలకు. దైవం కనిపించదన్న ధీమా వద్ధు లా అండ్ ఆర్డర్ కి ప్రత్యక్ష గార్డులు... రక్షక భటులు.
బుల్లి దేవుళ్ల మీద బురద పడ్డా కళ్లుపోవుట ఖాయం... ఆ ఇంగితం మరోసారి మీ మట్టి బుర్రలకు ఎక్కిద్దామనే- ఎన్ని పనులున్నా ఇప్పుడీ సమావేశం పెట్టుకున్నది!
నాస్తికులు, ఆస్తికులన్న రాగద్వేషాలుండవు మా లాఠీలకు. మా పెద్ద దేవుడికి తేడా అని తోస్తే ఎంత పిస్తాకైనా మేం తోలు తీయడం ఖాయం. నియంతృత్వమా, నీతిమంతమా, ప్రజాస్వామ్యమా, పెద్దమనిషితనమా అన్న బఠాణీ చర్చలు మా ఠాణాల్లో ఉండవు భాయీ! చిర్రాకు పెంచితే చివరికి చిరిగేది మీ చీప్ వీపులే... విచారణలు గిచారణల విచారాలన్నీ ఆ తరవాతనే!
మనుధర్మశాస్త్రమని మీ మనుషుల దగ్గరే ఓ శాస్త్రముంది. మీకది మన ధర్మశాస్త్రంలా అనిపించకపోవచ్చునేమో కానీ- ఆ శాస్త్ర కర్త మనువుతాత మాటలే మా రక్షకభట దేవుళ్లకు సదా శిరోధార్యాలు. మీరు రాసుకున్నారు కదా అని రాజ్యాంగంలోని ప్రతి ఆదేశాన్ని శాసనంలా మేం ఎందుకు పాటించాలి? నెవర్! మా లాఠీలకు కొన్ని ప్రత్యేక రైట్స్... అదే హక్కులుంటాయని మీ మట్టి బుర్రలకు ఎందుకు తోచలేదో!
లా అండ్ ఆర్డర్ అంటేనే ప్రభువుల ముందు ఎల్లవేళలా బోర్లాపడివుండే శాఖ. వాడి ముందు ఎవరూ నిటారుగా నిలబడకుండా చూసుకోవడమే మా బుల్లి గాడ్స్ ఆయుధాలుగా మా పని. వందలాది సెక్షన్లు, క్లాజులు, ఆర్టికల్స్ ఉన్న రాజ్యాంగంలో ఏ తరహా దండనీతి ఎవరి ప్రత్యేకహక్కుగా రాసుందో...
ఎవర్రా ఆ రహస్యం గాలించగల సమర్థులు ఇవాళ? కోర్టులు, భాష్యాలు, తీర్పులు గట్రా గట్రా అంటావా? సర్కార్ల మీద దావా పడ్డప్పుడల్లా ఏ ‘సత్వర సుపరిపాలన పునః సంస్థాపనార్థం’ అంటూ చక్కని సమాస మొకటి అఫిడవిట్‌కో కుచ్చుతోకలా తగిలించేస్తే సరి! మీ లాయర్ల నోరు తిరిగి ఆ తింగరి పదం వెలికివచ్చే లోగానే చటుక్కున మా ప్రభువుల పని చక్కబెట్టుకొచ్చేస్తాం మేం. ఎవరెన్ని కారాలూ మిరియాలూ నూరుకున్నా నో ప్రాబ్లమ్! మా బుల్లి గాడ్స్ నమ్ముకున్నది మనువాది చెప్పిన ముచ్చటైన ‘దండనీతి’ సూత్రం మాత్రమే!
దండాలు పెట్టించుకునే దేవుళ్ల పీఠాల్లో మార్పు రావచ్చేమో కానీ... కిందున్న మా బుల్లి దేవుళ్ల దండనీతి పాఠ్యాంశాల్లో మాత్రం మార్పుండదెప్పుడూ. ఆ ఇంగితం లేకనే బుద్ధిమంతులు కొందరు మా బుల్లిదేవుళ్లతో గిల్లికజ్జాలకు దిగి చివరికి పిచ్చాసుపత్రుల పాలయ్యేది! లోకం తీరూ తెలుసుకుని మసలుకోవడం మీకే మంచిది. ఎంత మొత్తుకున్నా ఉపయోగం లేదు. పెత్తనంచేసేవాడి తరఫునే ఏ యుగంలోనైనా బెత్తం ఆడేది. అమెరికన్ న్యాయదేవతైనా సరే- ఆ యుగధర్మంలో మార్పు తేలేదు. న్యాయస్థానాల స్థాయి ఏ దేశంలో అయినా ఆదేశాలిచ్చే వరకే. ఆచరణ స్థాయి మా బుల్లి దేవుళ్ల చేతుల్లోని మా దండాలది. మున్ముందు గొంతెత్తే ముందు మా లాఠీలను కాస్త గుర్తు తెచ్చుకుంటే రాష్ట్రమేంటి, దేశమేంటి, చివరికి ప్రపంచమంతటా సుఖమూ, శాంతీ! మనుధర్మశాస్త్రంలోని దండనీతులన్నీ మా బుల్లి దేవుళ్లకెప్పట్నుంచో కరతలామలకం. కర్రొక్కటే లోకాన్ని దారిలో పెట్టే దివ్య శక్తి. ఈ దండయాత్రలను తప్పుపట్టడం దైవద్రోహం కిందకే వస్తుంది మీ ఇష్టం... ముందే హెచ్చరించాం! మా దేవుళ్లను ఏమన్నా అంటే కళ్లు పోవడం మాత్రం ఖాయం! తస్మాత్ జాగ్రత్తని మరో మారు ఈ భేటీ ద్వారా హెచ్చరిస్తున్నాం!
- కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment