జన్మతః మనిషి మూడు రుణాలతో పుడుతున్నాడన్నది
ఉపనిషత్ వాక్యం.
ఋషుల రుణాన్ని బ్రహ్మచర్యంతో,
దేవతల రుణాన్ని యజ్ఞాలతో,
పితృదేవతలరుణాన్ని వివాహంతో తీర్చుకోవాలని
పెద్దల ఆదేశం.
తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకునేందుకు
వివాహాన్ని ఓ ధార్మిక సంస్కారంగా తీర్చిదిద్దుకున్న సంప్రదాయం మనది.
'పెళ్లి అనేది ఓ విచిత్ర
వలయంలాంటిది. అందులో ఉన్నవాళ్ళు బయటపడాలని తహతహలాడుతుంటే.. బయట ఉన్నవాళ్ళు లోనికి
వెళ్లాలని ఉబలాటపడుతారు' అని ఓ మేధావి చమత్కరించాడు. అయినా, భారతీయ సంస్కృతి ప్రకారం
మోక్షగామి పాటించవలసిన నాలుగు ధర్మమార్గాలలో
గృహస్థాశ్రమం తప్పనిసరిది .
ధర్మార్థ కామమోక్షాల సాధనకోసం కలసిమెలసి ప్రస్థానిస్తామంటూ- పెళ్లినాడు చేసిన
ప్రమాణాల సాక్షిగా వధూవరులు అడుగు పెట్టే పొదరిల్లు వివాహబంధం! 'సతుల బడయనేల, సుతుల బడయనేల, వెతలు
పడగనేల వెర్రితనము..' అన్న వేమన కూడా కామి కానివాడు
మోక్షగామి కాలేడు పొమ్మని తేల్చిచెప్పిన మాట మనం మర్చిపోలేం కదా! భారతీయుల
సంప్రదాయం ప్రకారం ఆ మూడో పురుషార్థం ధర్మబద్ధంగా సిద్ధించే మార్గం గృహస్థాశ్రమం.
సుఖదుఃఖాలలో, కలిమిలేములలో సహభాగస్వాములుగా భార్యాభర్తలు
సాగించే సంసారయాత్రకు స్నేహం ఓ దీపంలా
దిక్సూచి ధర్మం నిర్వహించాలన్నది భారతీయ
సమాజంలోని నియమం. 'మాయ, మర్మము లేని
నేస్తము/మగువలకు, మగవారికి ఒక్కటె/' అంటూ
'బ్రతుకు సుకముకు సమాన ఫాయిదా 'రాజమార్గము'ను నిర్దేశించిన వైతాళికుడు
గురజాడ. ఆధిక్యతా భావనలను, ఆధిపత్య ధోరణులను దరికి
రానీయకుండా- 'మగడు వేల్పన పాత మాటది/ ప్రాణమిత్రుడ నీకు...'
అన్న గురజాడ వాక్కుకు వారసుడిగా- తన జీవన సహచరికి ఆత్మీయహస్తం
అందిస్తూ, దాంపత్యబంధంలో స్నేహ బాంధవ్యం రుచి చూపించవలసిన
చొరవ ఓం ప్రధమంగా పురుషుడిదే.
'జీవితమనే రేడియో సెట్టుకి భర్త
ఏరియల్, భార్య ఎర్త్' అంటూ
కవిత్వీకరించిన ఆరుద్ర- ఏకాభిప్రాయం అనే విద్యుచ్ఛక్తి లేకపోతే ఆ సెట్టు పలికే మట సున్నా అన్నాడు.
భార్యాభర్తల సాహచర్యం సమశ్రుతి చేసిన
స్వరవాయిద్యం తీరులో సంసార పేటికలో ప్రతి
నిమిషం పాతలాగా కాగాలి.
దాంపత్యమంటే మూడు ముడులతో పేనిన రెండు ఆత్మలు
ఒక్కటై వాగర్థాల వలె విడదీయలేనంత గాఢంగా పెనవేసుకుని ఉండటం! మనుగడకు మూలమంత్రమైన
మమతను గుండె నిండుగా నింపుకొని జీవనమనే మహతిపై మహత్వ స్నేహగీతాన్ని పలికించడం!
అలకలు-అనునయాలు;
విరసాలు-సరసాలు; ఉక్రోషాలు-ఊరడింపులు; పంతాలు-పశ్చాత్తాపాలు; కించిత్ కోపాలు-కిలకిల
నవ్వులు; గిల్లికజ్జాలు- గిలిగింతలు; సాధింపులు-సర్దుబాట్లు...
ఆ వీణ మెట్లపై పల్లవించే గాన మాధుర్యంలో సప్తస్వరాలై ఊపిరులూదడందాంపత్యమంటే-
స్త్రీ పురుషుల జంట ఆలుమగలై చెట్టపట్టాలుగా తొలిసారి వేసిన ఏడు అడుగులు.
సప్తాశ్వాలు పూన్చిన వారి సంసార రథం మలిసంధ్యలోనూ తొలిసంధ్యలోని తేజరింపు రవంతైనా
తరగకుండా సాగిపోవడం! ఆత్రేయ అన్నట్లు 'నేనోడి నీవే గెలిచి నీ
గెలుపు నాదని తలచి రాగాలు రంజిలు రోజు రాజీ' రానిమ్మనే
ఆకాంక్షలూరే రెండు గుండెల సాహచర్యం. కోరికలన్నీ తీరి, చివరి మజిలీకి చేరుకున్న తదుపరి 'మన జీవిత పయనంలో చివరి కోర్కె ఏదనీ/ ఒకరికన్న ఒకరు ముందు కన్నుమూసి
వెళ్లాలని..' నిరీక్షించే క్షణాలు ఇంకా నిలబడిగాని
ఉండుంటే సార్థకతతో కూడిన సంసారం ఆలుమగలు నడి మధ్యన ఇన్ని దశాబ్దాలూ
సవ్యంగా సాగినట్లు లెక్కే! శృంగారం అవసరం
కాని వయసులోనూ పరస్పరం ప్రేమించుకునే జంటల 'చుట్టూ అల్లుకునే
అనురాగమనే రాగలత శోభాయమానంగా ఉంటుంది.
పెనుగాలి వీచినా చెక్కుచెదరని ప్రదీప కళికతో పోల్చదగినది అంటారు ఆ తరహా
అన్యోన్య దాంపత్యాన్ని ముళ్లపూడివారు.
ఇతర దేశాల తరహాలో కాకుండా మన భారతీయ సమాజంలో
కుటుంబ వ్యవస్థను అవిచ్ఛిన్నంగా ఉంచుతున్నది ఈ వివాహబంధమే. స్త్రీ, పురుషుల
మధ్య అనురాగబంధాన్ని దృఢతరం చేసేది వైవాహిక జీవితమేనన్నది సార్వజనీన సత్యం. మానసిక
వ్యాకులతతో, నిరాశా నిస్పృహలతో కుంగిపోయే ప్రమాదం నుంచి
మనుషుల్ని వివాహబంధం ఒడ్డున పడేస్తుందని, స్త్రీ, పురుషులిద్దరికీ ఇది వర్తిస్తుందని అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఓ
అధ్యయనంలో నిర్ధారణ అయిన నిజం. ఆధునిక సమాజంలో వివిధ కారణాలు, ఒత్తిళ్లు, కౌటుంబిక సంబంధాల్లో వస్తున్న మార్పులు
వంటి వాటి వల్ల వివాహబంధాలు సడలిపోవడం, భార్యాభర్తలు విడిపోవడం పరిపాటయిపోతున్న రోజులివి. కాలానుగుణంగా విలువలూ
మారుతుండటంతో, వివాహ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతున్నవారినీ
తప్పు పట్టలేం. అయితే, మనుషులకు మనశ్శాంతి చేకూర్చేది
వివాహబంధమేనని శాస్త్రీయంగా తేలడం- అనాదిగా వస్తున్న ఆ వ్యవస్థ ఔన్నత్యానికి ఆదునిక పరిశోధనలూ పట్టం కట్టడం ఆహ్వానించదగ్గ
అంశం. పెళ్లితో ఎక్కువగా మేలు పొందేది మహిళలు మాత్రమేనని గతంలోని అధ్యయనాలు పేర్కొంటే. స్త్రీ, పురుషులు అనే
తేడా లేకుండా ఇరువురికీ వివాహబంధం మానసికంగా స్వాస్థ్యత చేకూరుస్తుందని తాజా
పరిశోధనల వల్ల వెల్లడవుతున్నదిప్పుడు. విడాకులు, లేదా జీవిత
భాగస్వామి కనుమూయడం వంటి కారణాల వల్ల ఆ బంధం తెగిపోతే, మహిళల
కన్నా పురుషులే మానసికంగా ఎక్కువ కుంగుబాటుకు లోనవుతున్నట్లు పరిశోధనల ఫలితాల సారాంశం. పెళ్ళితో నిమిత్తం లేకుండా సహజీవనం
చేస్తున్వారి కన్నా, వివాహబంధంతో ఒక్కటైనవారే ఎక్కువ
సంతోషంగా ఉన్నారంటున్నారు ఆధునిక సామాజిక శాస్త్రవేత్తలు కూడా. అంతమాత్రాన- 'మనువేలనయ్యా, మనసు నీదైయుండ' అంటూ
ఒకరి మీద ఒకరు నమ్మకంతో, అన్యోన్యంగా జీవనయాత్ర సాగిస్తున్న
వారిది భార్యాభర్తల సంబంధం కాకుండా పోదు. ఆనందమయంగా ఉంటుందనుకుంటే, స్త్రీ పురుషులు వివాహబంధంతో నిమిత్తం లేని బతుకుబాటలో పయనించడంలోను ఇబ్బంది ఉండబోదు. ఏ
తీరులో ఉన్నా అది దాంపత్యమే. తాంబూలంలా రాగరంజితమైనదే. మహాకథకులు మల్లాది
రామకృష్ణశాస్త్రి అన్నట్లు- తాంబూలమైనా, దాంపత్యమైనా ఆద్యంతం
రసవంతంగా ఉండటం ప్రధానం!
కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు, సంపాదకీయం, 03 -01 -2010)
________________________________
No comments:
Post a Comment